Fake News, Telugu
 

తెలంగాణ హైకోర్టు రెసిడెన్షియల్‌ హాస్టల్స్ కలిగి ఉన్న పాఠశాలలను మాత్రమే ప్రారంభించవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది

0

తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలల పునః ప్రారంభించవద్దని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతుంది. తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలని వారం రోజుల పాటు తెరవవద్దని హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినట్టు ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. 01 సెప్టెంబర్ 2021 నుండి రాష్ట్రంలో అన్ని ప్రైవేటు మరియు ప్రభుత్వ విద్యాసంస్థలు తెరుచుకుంటాయని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో, ఈ పోస్టు సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలను ప్రారంభించవద్దని ఆదేశిస్తూ తెలంగాణ హై కోర్టు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఫాక్ట్ (నిజం): తెలంగాణ హైకోర్టు 31 ఆగష్టు 2021 నాడు ఇచ్చిన స్టే ఆర్డర్లో కేవలం రెసిడెన్షియల్‌ హాస్టల్స్ కలిగి ఉన్న పాఠశాలలను ప్రారంభించవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెసిడెన్షియల్‌ స్కూళ్లు మినహా మిగతా పాఠశాలల్లో తగిన జాగ్రత్తలు పాటిస్తూ ప్రత్యక్ష తరగుతులు నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం గూగుల్‌లో వెతికితే, తెలంగాణ పాఠశాలల్లో ప్రత్యక్ష భోధనకు (off-line) సంబంధించి తెలంగాణ హైకోర్టు 31 ఆగష్టు 2021 నాడు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిసింది. కాని, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఈ స్టే ఆర్డర్లో కేవలం రెసిడెన్షియల్‌ హాస్టల్స్ కలిగి ఉన్న గురుకులాలు మరియు ప్రభుత్వ పాఠశాలలను మాత్రమే ప్రారంభించవద్దని ఆదేశించింది. తదుపరి ఆదేశాల వరకు రెసిడెన్షియల్‌ హాస్టల్స్ కలిగి ఉన్న పాఠశాలలను తెరవవద్దని హైకోర్టు ఆదేశించింది.

గురుకుల పాఠశాలలు, రెసిడెన్షియల్‌ స్కూళ్ల మినహా మిగతా పాఠశాలల్లో తగిన జాగ్రత్తలు పాటిస్తూ ప్రత్యక్ష తరగతులు నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయం పై రాష్ట్ర ప్రభుత్వానికి, స్కూల్స్ యాజమాన్యానికి కొన్ని మార్గ దర్శకాలు జారీ చేసింది. స్కూల్ యాజమాన్యం ప్రత్యక్ష భోధన కోసం పిల్లలను బలవంతం చేయకూడదని, తరగతులకు హజారుకాని విద్యార్ధులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. అలాగే, ప్రత్యక్ష తరగతులు నిర్వహించని విద్యసంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా వైరస్ థర్డ్ వేవ్ ముప్పు ఉన్న నేపథ్యంలో, పాఠశాలలు తీసుకోవలిసిన జాగ్రత్తలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గ దర్శకాలు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది.

తెలంగాణ హైకోర్టు 31 ఆగష్టు 2021 నాడు ఇచ్చిన ఈ మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించిన వివరాలను రిపోర్ట్ చేస్తూ పబ్లిష్ అయిన న్యూస్ అర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సవరణలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం 01 సెప్టెంబర్ 2021 నుండి పాఠశాలల్లో ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ క్లాసెస్ నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రంలో 01 సెప్టెంబర్ 2021 నాడు పలు ప్రైవేటు మరియు ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకున్నాయి

చివరగా, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులలో కేవలం రెసిడెన్షియల్‌ హాస్టల్స్ కలిగి ఉన్న పాఠశాలలను మాత్రమే ప్రారంభించవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Share.

About Author

Comments are closed.

scroll