Fake News, Telugu
 

ఉత్తరప్రదేశ్‌కి సంబంధించిన పాత వీడియోని త్రిపురలో ముస్లింలు చేసిన ర్యాలీ అని షేర్ చేస్తున్నారు

0

త్రిపుర ముస్లింలు తమ పై జరుగుతున్న దాడులకు నిరసన తెలుపుతూ భారీ ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. త్రిపుర హిందువుల గుండెల్లో ధడ పుట్టించేలా అక్కడి ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారని ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. త్రిపురలో ఇటీవల చోటుచేసుకున్న మత ఘర్షణలు నేపథ్యంతో, ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఆ వీడియోలో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: త్రిపుర ముస్లింలు తమ పై జరుగుతున్న దాడులకు నిరసన తెలుపుతూ భారీ ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో కనీసం 2021 మే నెల నుండి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఉత్తర ప్రదేశ్ బదౌనికి చెందిన హజ్రత్ అబ్దుల్ హమీద్ ముహమ్మద్ సలిముల్ ఖాద్రి అనే వ్యక్తి అంత్యక్రియల దృశ్యాలని ఈ వీడియో చూపిస్తుంది. ఈ వీడియోకి త్రిపుర మత ఘర్షణలకు ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన స్పష్టమైన వీడియోని ఒక ఫేస్‌బుక్ యూసర్ 09 మే 2021 నాడు పోస్ట్ చేసినట్టు తెలిసింది. హజ్రత్ పీర్ సాలిం మియా సహబ్ బదౌని అంత్యక్రియల దృశ్యాలని ఈ పోస్టు వివరణలో తెలిపారు. అంతేకాదు, ఈ వీడియో మధ్యలో ‘పీర్ సాహాబ్ జిందాబాద్’, ‘లా ఇలః ఇల్లాలః’ అనే నినాదాలు వినవచ్చు.

ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియోకి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతకగా, ఇవే దృశ్యాలతో పోలి ఉన్న ఫోటోలని ‘AAJ TAK’ న్యూస్ సంస్థ 10 మే 2021 నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్‌లో చేసినట్టు తెలిసింది. ఉత్తరప్రదేశ్ బదౌనిలో 09 మే 2021 నాడు  మరణించిన హజ్రత్ అబ్దుల్ హమీద్ ముహమ్మద్ సలిముల్ ఖాద్రి అంత్యక్రియల దృశ్యాలని ఆర్టికల్‌లో తెలిపారు.

ఈ ఆర్టికల్‌ పబ్లిష్ చేసిన ఒక ఫోటో బ్యాక్ గ్రౌండ్లో, పోస్టులో షేర్ చేసిన వీడియోలో కనిపిస్తున్న మినార్ (గేటు లాంటి కట్టడం) కనిపించడాన్ని మనం చూడవచ్చు. దీన్ని బట్టి, వీడియోలోని ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుందని స్పష్టమయ్యింది.

2021 మే నెలలో జరిగిన ఈ అంత్యక్రియలకు సంబంధించి పబ్లిష్ అయిన మరికొన్ని న్యూస్ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ ఊరేగింపు కార్యక్రమం ఎందుకు జరిగిందో కచ్చితంగా తెలియనప్పటికీ, పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది అని, త్రిపుర మత ఘర్షణలకు సంబంధించింది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, ఉత్తరప్రదేశ్‌కి సంబంధించిన పాత వీడియోని త్రిపుర హింసా ఘటనలకు నిరసన తెలుపుతూ అక్కడి ముస్లింలు నిర్వహించిన ర్యాలీ దృశ్యాలని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll