Fake News, Telugu
 

‘1947లో పది రూపాయల నోట్‌పై నేతాజీ సుభాష్ చంద్రబోస్’, అని షేర్ చేస్తున్న ఈ నోటుని ఆర్‌బీఐ విడుదల చేయలేదు

0

1947 సంవత్సరంలో పది రూపాయలు నోట్ పై సుభాష్ చంద్రబోస్ గారి చిత్రం”, అని చెప్తూ ఒక ఫొటోతో కూడిన పోస్ట్‌ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: 1947 సంవత్సరంలో పది రూపాయల నోట్‌పై నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రం ఉన్నట్టు ఫొటోలో చూడవచ్చు. 

ఫాక్ట్: ఫోటోలో ఉన్న నోటును ఆర్‌బీఐ (RBI) విడుదల చేయలేదు. అది నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ బ్యాంకు విడుదల చేసిన బ్యాంకు నోటు అయి ఉండవచ్చు. ఆజాద్ హింద్ బ్యాంకు నోట్లకు సంబంధించి తమ దగ్గర సమాచారం లేదని, కావున వాటిని భారతదేశంలో లీగల్ టెండర్‌గా గుర్తించలేమని 2016లో ఒక ఆర్‌బీఐ అధికారి తెలిపినట్టు తెలిసింది. కావున, భారతదేశంలో ఆర్‌బీఐ విడుదల చేసిన నోట్లపై 1947లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రం ఉండేదని అర్థం వచ్చేలా పోస్ట్‌లో చెప్తూ తప్పుదోవ పట్టిస్తున్నారు.

పోస్ట్‌లోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో వెతకగా, ఆ ఫోటోకి సంబంధించి ఎటువంటి ఖచ్చితమైన సమాచారం లభించలేదు. అది నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ బ్యాంకు విడుదల చేసిన బ్యాంకు నోటు అని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు. ఆజాద్ హింద్ బ్యాంకుకు సంబంధించిన వేరే నోట్ ఫోటోని కొన్ని వార్తాసంస్థలు ప్రచురించినట్టు ఇక్కడ చూడవచ్చు.

ఆజాద్ హింద్ బ్యాంకును నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1944లో స్థాపించారు. భారత స్వాతంత్ర పోరాటానికి భారతదేశ డబ్బు సాయపడేలా ఆ బ్యాంకు ఉపయోగపడుతున్నట్టు నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన వ్యాఖ్యలను ఇక్కడ చదవచ్చు.

ఫోటోలో ఉన్న నోటుకు, ఆర్‌బీఐకి సంబంధం లేదు. ఆర్‌బీఐ వెబ్‌సైట్‌లో (బ్రిటిష్ ఇండియా మరియు రిపబ్లిక్ ఇండియా) ఎక్కడా కూడా పోస్ట్‌లోని ఫోటోని ఆర్‌బీఐ విడుదల చేసినట్టు లేదు. ఆజాద్ హింద్ బ్యాంకు నోట్లకు సంబంధించి తమ దగ్గర సమాచారం లేదని, కావున వాటిని భారతదేశంలో లీగల్ టెండర్‌గా గుర్తించలేమని 2016లో ఒక ఆర్‌బీఐ అధికారి తెలిపినట్టు తెలిసింది.

చివరగా, ‘1947లో పది రూపాయలు నోట్‌పై నేతాజీ సుభాష్ చంద్రబోస్’, అని పెట్టిన పోస్ట్‌లోని నోటుని ఆర్‌బీఐ విడుదల చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll