Fake News, Telugu
 

మద్యం అమ్మకాలను ఆధార్‌తో అనుసంధించాలని రతన్ టాటా అనలేదు

0

మద్యం అమ్మకాలు ఆధార్ కార్డు ద్వారా జరగాలని, మద్యం వినియోగదారులకు ఎలాంటి సబ్సిడీలు ఇవ్వకూడదని రతన్ టాటా అన్నట్టు చెప్తున్న  పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్:  మద్యం అమ్మకాలు ఆధార్ కార్డు ద్వారా జరగాలి; మద్యం వినియోగదారులకు ఎలాంటి సబ్సిడీలు ఇవ్వకూడదు – రతన్ టాటా.

ఫాక్ట్ (నిజం): మద్యం అమ్మకాలు ఆధార్ కార్డు ద్వారా జరగాలని గాని లేక మద్యం వినియోగదారులకు ఎలాంటి ప్రభుత్వ సబ్సిడీలు అందకూడదని రతన్ టాటా అన్నట్టు ఎటువంటి ఆధారాలు లేవు. ఒకవేళ రతన్ టాటా నిజంగానే ఇలా అని ఉంటే పత్రికలు కచ్చితంగా రిపోర్ట్ చేసుండేవి. ఐతే మద్యం అమ్మకాలను నియంత్రించడానికి, పిల్లలను మద్యం నుండి దూరంగా ఉంచడానికి, ఖాళీ సీసాల వ్యర్ధాలను తగ్గించడానికి, ఇంకా పలు కారణాల వల్ల మద్యం అమ్మకాలను ఆధార్‌తో అనుసంధించాలని కోరుతూ పలు NGOలు తమ తమ ప్రతిపాదనలు ప్రభుత్వాలకు  తెలియజేశాయి. కాని ఇవి ఇంకా పరిశీలన దశలోనే ఉన్నాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

రతన్ టాటా ఇలా మద్యం అమ్మకాలు ఆధార్ కార్డు ద్వారా జరగాలని గాని లేక మద్యం వినియోగదారులకు ఎలాంటి ప్రభుత్వ సబ్సిడీలు అందకూడదని వ్యాఖ్యానించినట్టు ఎటువంటి వార్తా కథనాలు లేవు. సాధారణంగా రతన్ టాటా లాంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేసుంటే, పత్రికలు కచ్చితంగా రిపోర్ట్ చేసుండేవి, కాని మాకు ఈ విషయానికి సంబంధించి ఎటువంటి పత్రికా కథనాలు లభించలేదు.

ఐతే గతంలో మద్యం అమ్మకాలను ఆధార్‌తో అనుసంధించాలని కోరుతూ పలు NGOలు తమ ప్రతిపాదనలు ప్రభుత్వాలకు  తెలియజేశాయి. మద్యం అమ్మకాలను నియంత్రించడానికి, పిల్లలను మద్యం నుండి దూరంగా ఉంచడానికి, ఖాళీ సీసాల వ్యర్ధాలను తగ్గించడానికి, మద్యం తాగి వాహానాలు నడపడం తగ్గించడం, ఇంకా పలు కారణాల వల్ల ఇలా మద్యం అమ్మకాలను ఆధార్‌తో అనుసంధించాలని ప్రతిపాదనలు చేసాయి. దీనికి సంబంధించిన వార్తా కథనాలు ఇక్కడ , ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఐతే ఈ ప్రతిపాదనలు ఇప్పటికైతే ఇంకా అమలు కావడం లేదు, అవి ఇంకా పరిశీలన దశలోనే ఉన్నాయి.

మద్రాస్ హైకోర్టు కూడా 2020లో కరోనా సమయంలో మద్యం అమ్మకాలకు సంబంధించిన ఒక తీర్పులో మద్యం కొనుగోలుదారుల పేరు, చిరునామాతో పాటు ఆధార్ కార్డు నంబర్‌ కూడా సేకరించాలని చెప్పింది. ఈ విషయానికి సంబంధించిన వార్తా కథనం ఇక్కడ చూడొచ్చు.

అలాగే మద్యం వినియోగదారులకు ప్రభుత్వ సబ్సిడీలు లేదా పథకాలు వర్తించకూడదని ప్రభుత్వాల వద్ద ప్రతిపాదనలు ఉన్నట్టు ఎటువంటి వార్తా కథనాలు లేవు.

చివరగా, మద్యం అమ్మకాలను ఆధార్‌తో అనుసంధించాలని రతన్ టాటా అనలేదు.

Share.

About Author

Comments are closed.

scroll