Fake News, Telugu
 

సౌదీ అరేబియా జాతీయ పాఠ్యాంశాల్లో రామాయణం, మహాభారతం ప్రవేశపెట్టలేదు

0

సౌదీ అరేబియాలో ఇక నుంచి రామాయణం, మహాభారతం పాఠశాల సిలబస్లో చేర్చి, నేర్పిస్తారని ఆ దేశపు రాజు ముహమ్మద్ బిన్ సల్మాన్ ప్రకటించారు అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: సౌదీ అరేబియా పాఠశాలల్లో ఇక నుండి రామాయణం, మహాభారతం నేర్పిస్తారు అని ఆ దేశ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ ప్రకటించారు. 

ఫాక్ట్(నిజం): ఈ వాదనలు ప్రధానంగా సౌదీ నివాసి నౌఫ్ అల్మార్వాయ్ చేసిన ట్వీట్ ఆధారంగా చేయబడ్డాయి. సౌదీఅరేబియాలోని ఇంటర్నేషనల్ ఇండియన్ స్కూల్ ఉపయోగించే పాఠ్యప్రణాళిక, అక్కడి ప్రైవేటు లేదా పబ్లిక్ పాఠశాలల్లోని పాఠ్యప్రణాళిక వేరు వేరు. అక్కడి పబ్లిక్ పాఠశాలల్లో అన్ని సబ్జెక్టులు అరబిక్ భాషలోనే బోధిస్తారు. ట్విట్టర్లో షేర్ చేసిన ప్రశ్నలు ఆంగ్లంలో ఉన్నందున అది అంతర్జాతీయ పాఠశాల అని చెప్పవచ్చు. కావున ఈ పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది. 

ఈ క్లెయిమ్ గురించి కీ వర్డ్ సెర్చ్ ద్వారా ఇంటర్నెట్లో వెతకగా, ఇటువంటి ప్రకటన ఏదీ సౌదీ అరేబియా రాజు చేసినట్టు ఆ దేశానికి సంబంధించిన ఏ అధికారిక వెబ్సైటులో కానీ, వార్త పత్రికలలో కానీ సమాచారం లేదు.  పైగా, ఈ క్లెయిమ్ 2021 నుంచి షేర్ అవుతోందని గమనించాం (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). ఈ సమాచారం అక్టోబరు 2023లో సోషల్ మీడియాలో మళ్లీ వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ వాదనలు ప్రధానంగా సౌదీ నివాసి నౌఫ్ అల్మార్వాయ్ చేసిన ట్వీట్ ఆధారంగా చేయబడ్డాయని కూడా గమనించాం. 

దీని గురించి ఇంటర్నెట్లో మరింత వెతకగా, సౌదీ అరేబియాకు చెందిన ప్రసిద్ధ కాలమిస్ట్ ఇబ్రహీం అల్-సులైమాన్ తన ట్వీట్ ద్వారా , సౌదీ అరేబియా ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూళ్లల్లో పాఠ్యప్రణాళిక నిర్ణయించుకోవడానికి స్వేచ్ఛ ఉందనీ, ఈ స్కూళ్ళు వారి స్వంత ఫ్రేమ్‌వర్క్‌లు పాటిస్తాయని తెలిపాడు. అయితే, ఈ పాఠశాలల యొక్క పాఠ్యప్రణాళిక, ప్రైవేట్ మరియు స్థానిక ప్రభుత్వ పాఠశాలల యొక్క పాఠ్యప్రణాళిక ఒకటే అనుకోవటం తప్పు అని తెలిపారు. సౌదీ ప్రొఫెసర్ ఒమర్ అల్-సబియీ  తాను గత 25 సంవత్సరాలుగా బోధిస్తున్నానని, అన్ని సబ్జెక్టులు అరబిక్ భాషలోనే బోధించబడుతున్నాయని ట్వీట్ ద్వారా తెలిపారు. తదుపరి, సౌదీఅరేబియాలోని ఇంటర్నేషనల్ ఇండియన్ స్కూల్ కొన్నేళ్లుగా ఇదే పాఠ్యాంశాలను ఉపయోగిస్తోంది అని మరొకరు ట్వీట్ చేయటం గమనించాం.

ఈ సమాచారాన్ని బట్టి ఇంటర్నెట్లో సౌదీ అరేబియాలోని పాఠశాలల యొక్క పాఠ్యప్రణాళిక గురించి వెతకగా, రీసెర్చ్ గేట్ ప్రచురించిన ఒక జర్నల్ ఆర్టికల్ ద్వారా సౌదీ అరేబియాలో (i) పబ్లిక్ (ప్రభుత్వ) మరియు ఖురాన్ పాఠశాలలు; (ii) ఇంటెన్సివ్ ఇంగ్లీష్ కోర్సుతో అరబిక్ మీడియంలో బోధించే ప్రైవేట్ పాఠశాలలు; (iii) ఇంగ్లీష్ మీడియంలో బోధించే అంతర్జాతీయ పాఠశాలలు ఉంటాయని. ఈ అంతర్జాతీయ పాఠశాలలో అరబిక్ మరియు ఇస్లామిక్ అధ్యయనాలకు ఒక కోర్సు కేటాయించబడుతుంది అని తెలుసుకున్నాం. ఈ సమాచారం ద్వారా ట్విట్టర్లో షేర్ చేసిన ప్రశ్నలు ఆంగ్లంలో ఉన్నందున అది అంతర్జాతీయ పాఠశాల అని చెప్పవచ్చు. 

నౌఫ్ అల్మార్వాయ్  తన ట్వీట్లపై చెలరేగిన వివాదాల తరువాత, తాను చెప్పింది తన కొడుకు పాఠ్యాంశాల గురుంచి అని, సౌదీ జాతీయ పాఠ్యాంశాలను గురుంచి కాదని ఆమె స్పష్టం చేసింది. ఆమె స్పష్టీకరణను ఆర్కైవ్‌లో చూడవచ్చు.


సౌదీ అరేబియా యొక్క “విజన్ 2030″(ఇక్కడ మరియు ఇక్కడ) ప్రణాళికలో విద్య యొక్క పాత్ర గురించి పరిశీలించగా, ఇది దేశాన్ని జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా (knowledge based economy) మార్చడానికి ఒక ప్రణాళిక. విద్య ఈ ప్రణాళికలో కీలక పాత్ర పోషిస్తుంది, ఎందుకంటే ఇది నైపుణ్యం కలిగిన కార్మికశక్తిని సృష్టించడానికి మరియు ఆర్థిక వృద్ధికి దారితీస్తుంది అని తెలుసుకున్నాం.

చివరిగా, సౌదీ అరేబియా జాతీయ పాఠ్యాంశాల్లో రామాయణం, మహాభారతం ప్రవేశపెట్టబడలేదు.

Share.

About Author

Comments are closed.

scroll