Fake News, Telugu
 

మార్చి నుంచి పాత 100 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్టు ఇప్పటివరకైతే RBI నిర్ణయం తీసుకోలేదు

0

వివరణ (FEBRUARY 24, 2021):
గత సంవత్సరం వైరల్ అయినా ఇదే పోస్టుని ఇప్పుడు మళ్ళీ మార్చి నుంచి పాత 100 రూపాయల నోట్లను ఉపసంహరించనున్నట్లు రిజర్వు బ్యాంకు ప్రకటించిందని షేర్ చేస్తున్నారు. కానీ, పాత 100 రూపాయల నోట్ల ఉపసంహరణ గురించి ఆర్‌బీఐ కొత్తగా ఎటువంటి ఉత్తరువులు జారీ చేయలేదు.

ఈ ఏడాది మార్చి నుంచి పాత 100 రూపాయల నోట్లను ఉపసంహరించనున్నట్లు రిజర్వు బ్యాంకు ప్రకటించింది’, అని చెప్తూ కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: మార్చి 2021 నుంచి పాత 100 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్టు రిజర్వు బ్యాంకు ప్రకటించింది.

ఫాక్ట్: మార్చి 2021 నుంచి పాత 100 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని FACTLY కి ఆర్‌బీఐ అధికారి తెలిపారు. వైరల్ అవుతున్నది ఫేక్ న్యూస్ అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వారు కూడా ట్వీట్ చేసారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లో చెప్పిన విషయం గురించి ఆర్‌బీఐ వెబ్సైటులో వెతకగా, ఈ విషయం పై ఎటువంటి అధికారిక సమాచారం దొరకలేదు. ఆర్‌బీఐ డీజీఎం అధికారి శైలజా సింగ్ కి FACTLY ఫోన్ చేసి మాట్లాడగా, పోస్ట్ లో చెప్పిన విషయం పై చర్చ జరిగిన మాట వాస్తవమే అని, దాని పై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఒక అధికారి మాటలను వక్రీకరించి తప్పుగా షేర్ చేస్తున్నారని తెలిపారు. ఈ విషయం పై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వారు చేసిన ట్వీట్ తో కూడిన న్యూస్ ఆర్టికల్ ని FACTLY కి ఆర్‌బీఐ అధికారి పంపించారు. ఇప్పట్లో పాత 5, 10, మరియు 100 రూపాయల నోట్లను రద్దు చేయట్లేదని ఆర్‌బీఐ తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా వివరణ ఇచ్చారు.

‘మార్చి 2021 నుంచి పాత 5, 10, మరియు 100 రూపాయల నోట్లు రద్దు’ అని వైరల్ అవుతున్నది ఫేక్ న్యూస్ అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వారు చేసిన ట్వీట్ లో కూడా చూడవొచ్చు.

చివరగా, మార్చి 2021 నుంచి పాత 100 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్టు ఇప్పటివరకైతే ఆర్‌బీఐ నిర్ణయం తీసుకోలేదు.

వివరణ (JANUARY 26, 2021):
ఈ ఆర్టికల్ లో పాత 5, 10, మరియు 100 రూపాయల నోట్లు రద్దు గురించి ఆర్‌బీఐ పెట్టిన ట్వీట్ జత చేర్చాము.

Share.

About Author

Comments are closed.

scroll