Fake News, Telugu
 

ఆయుధ పూజను కాంగ్రెస్, డీఎంకే పార్టీలు కర్ణాటక, తమిళనాడులో అడ్డుకుంటున్నాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు

0

దసరా పండుగ సందర్భంగా నిర్వహించే ఆయుధ పూజలో ప్రభుత్వ కార్యాలయాల్లో పూలు, కుంకుమ, పసుపు, ఇతర పూజకు అవసరమైన వస్తువులను ఉపయోగించడాన్ని నిషేధిస్తూ తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం, కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ జీ.వో లు జారీ చేశాయని చెప్తూ ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో నిజమెంతో చూద్దాం.

క్లెయిమ్: ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయుధ పూజలో పూలు, కుంకుమ, పసుపు మరియు ఇతర పూజకు అవసరమైన వస్తువులను ఉపయోగించడాన్ని నిషేధిస్తూ తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం మరియు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ జీ.వో లు జారీ చేశాయి.

ఫాక్ట్: సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న నోటీసు నకిలీదని, దాన్ని తాము జారీ చేయలేదని తమిళనాడులోని తిరుప్పూర్‌ కాలేజీ యాజమాన్యం స్పష్టం చేసింది. ఇక కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన నోటీసులో విధాన సౌధ, వికాస సౌధ వంటి చారిత్రక భవనాలలో రసాయనిక పదార్ధాలతో చేసిన పూజ సామాగ్రిని వాడకూడదు అని మాత్రమే ఉంది. పైగా ఇదే నిబంధనలతో కూడిన నోటీసుని గతంలో బీజీపీ ప్రభుత్వం కూడా జారీ చేసింది. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా వైరల్ పోస్టులో తమిళనాడు ప్రభుత్వం జారీచేసిందని చెప్పబడుతున్న నోటీసుని గమనించగా, అది తిరుప్పూర్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆ కాలేజీ సిబ్బందికి జారీ చేసినట్లుగా ఆ నోటీసులో ఇవ్వబడింది. ఆయుధ పూజ, సరస్వతి పూజ సందర్భంగా ఆసుపత్రిలో కానీ, కాలేజీకి సంబంధించిన ఇతర కార్యాలయాలలో కానీ ఎటువంటి దేవుడి ఫోటోలను, విగ్రహాలను ఏర్పాటు చేయకూడదు అని ఇందులో పేర్కొన్నారు. అయితే ఈ నోటీసు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉండడంతో ఆ కాలేజీ యాజమాన్యం స్పందించింది. ఈ నోటీసుని తాము జారీ చేయలేదని, అది నకిలీదని స్పష్టం చేసింది. సంబంధిత మీడియా కథనాలను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. పైగా ఆయుధ పూజని ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించకూడదని తమిళనాడు ప్రభుత్వం ఎక్కడా ప్రకటించలేదు.

ఇక కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన నోటీసుని పరిశీలించగా, ఆయుధ పూజ సందర్భంగా విధాన సౌధ, వికాస సౌధ వంటి భవనాలలో రసాయన పదార్ధాలతో తయారుచేసిన పెయింట్, పసుపు, కుంకుమ వంటి పూజా సామాగ్రిని ఉపయోగించకూడదని ఇందులో పేర్కొన్నారు. విధాన సౌధ, వికాస సౌధ వంటివి చారిత్రక భవనాలు కాబట్టి వాటిని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, రసాయన పదార్ధాల వల్ల ఈ భవనాలకు నష్టం కలుగుతుందని నోటీసులో ఉంది. ఇందులో ఎక్కడా కూడా ఆయుధ పూజని రద్దు చేసినట్లు కానీ, సహజమైన పూజా సామాగ్రిని వాడటం నిషేధం అని చెప్పలేదు.

ఇక ఈ విషయంపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేయగా, ఇటువంటి నోటీసుని 2022లో కూడా బీజీపీ ప్రభుత్వ హయాంలో కూడా జారీ చేశారని సిఎం సిద్ధ రామయ్య స్పష్టం చేశారు.

2020, 2022లలో బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన నోటీసులకి సంబంధిత మీడియా కథనాల్ని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

చివరిగా, ఆయుధ పూజను I.N.D.I.A కూటమి పార్టీలైన కాంగ్రెస్, డీఎంకేలు కర్ణాటక, తమిళనాడులో అడ్డుకుంటున్నాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll