Fake News, Telugu
 

వై.ఎస్. జగన్ ప్రభుత్వం అమలుపరుస్తున్న పథకాలని తాను అనుసరిస్తానని రాహుల్ గాంధీ పేర్కొనలేదు

0

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తరహాలో తాము కూడా బ్యాంక్ ఖాతాలలో నేరుగా డబ్బులు వేస్తామని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు, అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది. దేశంలో ఎంత పెద్ద నాయకుడైనా జగన్ బాటలో నడవాల్సిందేనని ఈ పోస్టుని షేర్ చేస్తూ అంటున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.    

క్లెయిమ్: వై.ఎస్. జగన్ ప్రభుత్వం తరహాలో బ్యాంక్ ఖాతాలో నేరుగా డబ్బులు వేస్తామని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

ఫాక్ట్ (నిజం): 2022 మే నెలలో తెలంగాణలో జరిగిన ఒక బహిరంగ సభలో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు రూణమాఫీతో పాటు ప్రతి ఎకరానికి 15 వేల రూపాయిలను నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలో వేస్తామని ప్రకటించారు. అయితే, రాహుల్ గాంధీ చేసిన ఈ వాగ్ధానాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు పరుస్తున్న వైఎస్ఆర్ రైతు భరోసా పథకంతో పొలుస్తూ, రాహుల్ గాంధీ  వై.ఎస్. జగన్ పథకాలని అనుసరిస్తున్నారని ‘DOT News’ అనే యూట్యూబ్ ఛానెల్ మొదట పోస్ట్ పెట్టింది. వై.ఎస్. జగన్ పథకాలని తాను అనుసరిస్తానని రాహుల్ గాంధీ ఎక్కడా పేర్కొనలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.   

పోస్టులో షేర్ చేసిన ఫోటోపై ‘DOT NEWS’ అనే వాటర్ మార్క్ ఉండటాన్ని మనం చూడవచ్చు. పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం ఇంటర్నెట్లో వెతికితే, “ఆంధ్రా సిఎం జగన్ లాగే డైరెక్ట్ గా అకౌంట్ లో వేస్తా”, అనే టైటిల్‌తో ‘DOT NEWS’ యూట్యూబ్ చానెల్ 06 మే 2022 నాడు ఒక వీడియోని పబ్లిష్ చేసినట్టు తెలిసింది.

2022 మే నెలలో వరంగల్‌ బహిరంగ సభలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం వీడియో క్లిప్పుని ఈ యూట్యూబ్ పోస్టులో షేర్ చేశారు. వరంగల్‌లో ప్రకటించిన డిక్లరేషన్ గురించి రాహుల్ గాంధీ ఈ సభలో ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రూణమాఫీతో పాటు ప్రతి ఎకరానికి 15 వేల రూపాయిలను నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలో వేస్తామని ప్రకటించారు. ‘DOT NEWS’ పబ్లిష్ చేసిన వీడియోలో రాహుల్ గాంధీ తాను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వై.ఎస్. జగన్ పథకాలని అనుసరిస్తానని ఎక్కడా పేర్కొనలేదు.    

అయితే, రాహుల్ గాంధీ తెలంగాణ సభలో చేసిన ఈ డైరెక్ట్ బెనిఫిట్ పథకం వాగ్ధానాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు పరుస్తున్న వైఎస్ఆర్ రైతు భరోసా పథకంతో పొలుస్తూ, రాహుల్ గాంధీ  వై.ఎస్. జగన్ పథకాలని అనుసరిస్తున్నారని ‘DOT NEWS’ ఛానెల్ ఈ వీడియోని తప్పుదోవ పట్టించే టైటిల్‌తో యూట్యూబ్లో పబ్లిష్ చేసింది. తెలంగాణ ‘రైతు బంధు’ పథకం, కేంద్ర ప్రభుత్వ ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన’ పథకాలు కూడా రైతుల బ్యాంక్ ఖాతాలో ప్రతి సంవత్సరం నేరుగా డబ్బులని జమ చేసే పథకాలే.

చివరగా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వై.ఎస్. జగన్ ప్రభుత్వం అమలుపరుస్తున్న పథకాలని తాను అనుసరిస్తానని రాహుల్ గాంధీ ఎక్కడా పేర్కొనలేదు. 

Share.

About Author

Comments are closed.

scroll