Fake News, Telugu
 

కుతుబ్ మీనార్‌ను ఇలా అలంకరించింది జన ఔషధి దివస్‌ను పురస్కరించుకొని, రష్యాకు మద్దతుగా కాదు

0

ప్రస్తుతం ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడి నిర్వహిస్తున్న నేపథ్యంలో, కుతుబ్ మీనార్ మీద రష్యా జాతీయపతాక లైటింగ్ ఏర్పాటు చేసారంటూ పలు ఫోటోలు షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ ఫోటోలకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: కుతుబ్ మీనార్‌ను రష్యా జాతీయ పతాకంలోని రంగులలో అలంకరించిన ఫోటోలు.

ఫాక్ట్ (నిజం): ‘జన్ ఔషధి దివస్‌ను’ పురస్కరించుకొని కుతుబ్ మీనార్‌ను ‘అజాది కా అమృత్ మహోత్సవ్’ మరియు ‘జన్ ఔషధి’ థీమ్స్ లో అలంకరించారు. కుతుబ్ మినార్ ఫోటోలపై ‘అజాది కా అమృత్ మహోత్సవ్’ మరియు ‘ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి పరియోజన’ అని స్పష్టంగా రాసి ఉంది. ఇలా అలంకరించడానికి రష్యాకి ఎటువంటి సంబంధంలేదు. రష్యాకు మద్దతుగా ఇలా అలంకరించిందన్న వాదనను PIB కూడా కొట్టిపడేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

భారత ప్రభుత్వం కుతుబ్ మీనార్‌ను రష్యా జాతీయ పతాకంలోని రంగులలో అలంకరించిందని, చైనాకు చెందిన ప్రముఖ వార్తా సంస్థ గ్లోబల్ టైమ్స్ మార్చ్ 07న ఒక కథనాన్ని ప్రచురించింది. చైనా వార్త సంస్థ ఈ వార్తని ప్రసారం చేయడంతో, ఈ వార్త సోషల్ మీడియాలో షేర్ అవుతుంది.

ఐతే నిజానికి కుతుబ్ మీనార్‌ను అలంకరించిన రంగులు మరియు రష్యా జాతీయ పతాకంలోని రంగులు ఒకేలా ఉన్నప్పటికీ, కుతుబ్ మీనార్‌ను ఆ రంగులలో అలంకరించింది జన ఔషధి దివస్‌నను పురస్కరించుకొని, రష్యాకు మద్దతుగా కాదు. పోస్టులో షేర్ చేసిన ఫోటోలలో కుతుబ్ మీనార్‌పై ‘అజాది కా అమృత్ మహోత్సవ్’ మరియు ‘ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి పరియోజన’ అని స్పష్టంగా కనిపిస్తుండడం గమనించొచ్చు.

ప్రజలకు తక్కువ ధరలకు నాణ్యమైన మందులను అందించడానికి ‘ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి పరియోజన’ అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. జన్ ఔషధి పరియోజన ప్రయోజనాల గురించి సామాన్య ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం మార్చి 07వ తేదీన ‘జన్ ఔషధి దివస్’ జరుపుకోవాలని నిర్ణయించారు. ఈ సంవత్సరం వేడుకలను 01 మార్చ్ నుండి 07 మార్చ్ వరకు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే కుతుబ్ మీనార్‌ను ‘అజాది కా అమృత్ మహోత్సవ్’ మరియు ‘జన్ ఔషధి’ థీమ్స్ లో అలంకరించారు.

 కుతుబ్ మీనార్‌ను అలంకరించిన ఫోటోలను కేంద్ర ఆరోగ్య మంత్రి డా.మన్సుఖ్ మాండవియా మరియు ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి పరియోజన అధికారిక ట్విట్టర్ ఎకౌంటు కూడా షేర్ చేసాయి.

ఇలా జన్ ఔషధి దివస్‌లో భాగంగా కుతుబ్ మీనార్‌ను అలంకరించిన ఫోటోలను రష్యాకు మద్దతుగా అలంకరించారని తప్పుగా అర్ధం చేసుకొని షేర్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వ ఫాక్ట్ – చెకింగ్ సంస్థ PIB కూడా ధ్రువీకరించింది.

చివరగా, కుతుబ్ మీనార్‌ను ఇలా అలంకరించింది జన ఔషధి దివస్‌నను పురస్కరించుకొని, రష్యాకు మద్దతుగా కాదు.

Share.

About Author

Comments are closed.

scroll