CAA, NRC కి వ్యతిరేకంగా నిరసనలు చేయించిన వారే, ఇప్పుడు రైతుల వేషం కట్టి ఢిల్లీలో నిరసనలు చేస్తున్నారు, అంటూ షేర్ చేస్తున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇటివల ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులని వ్యతిరేకిస్తూ రైతులు దేశవ్యాప్తంగా నిరసన చేస్తున్న నేపధ్యంలో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: CAA, NRC కి వ్యతిరేకంగా నిరసనలు చేసిన వ్యక్తులే ఇప్పుడు రైతుల వేషం కట్టి ఢిల్లీలో నిరసనలు చేస్తున్నారు.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఆ రెండు ఫోటోలు CAA, NRC బిల్లులకి వ్యతిరేకంగా చేసిన నిరసనలకు సంబంధించినవి. ‘BKU-Bharti Kisan Union Ekta Ugrahan’ అనే కమ్యూనిటీ సంస్థ CAA, NRC బిల్లులకి వ్యతిరేకంగా చేసిన నిరసన కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలే ఇవి. ఈ ఫోటోలకి ఇటివల రైతులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకి వ్యతిరేకిస్తూ చేస్తున్న నిరసనలకి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ఫోటో-1:
పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ ‘BKU-Bharti Kisan Union Ekta Ugrahan’ కమ్యూనిటీ సంస్థ ‘03 మార్చ్ 2020’ నాడు తమ ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ పెట్టినట్టు తెలిసింది. షాహీన్ భాగ్ లో జరుగవలిసిన ఒక ర్యాలీ వాయిదా పడినట్టు ఈ పోస్టు వివరణలో తెలిపారు. ఫోటోలో CAA, NRC బిల్లులకి వ్యతిరేకత తెలుపుతూ పెట్టిన బ్యానర్లని మనం చూడవచ్చు.
ఫోటో-2:
పోస్టులో షేర్ చేసిన మరొక ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ ‘BKU-Bharti Kisan Union Ekta Ugrahan’ సంస్థ ‘10 ఫిబ్రవరి 2020’ నాడు తమ ఫేస్బుక్ అకౌంట్లో పెట్టిన పోస్ట్ దొరికింది. ఈ ఫోటో బ్యాక్ గ్రౌండ్లో కనిపిస్తున్న షాపుల ఆధారాలతో గూగుల్ మాప్స్ లో వెతికితే, ఈ ఫోటో షాహీన్ భాగ్ లోని ఖలిన్ది కున్జ్ దగ్గరలో తీసినది అని తెలుసుకోగలిగాము.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన CAA, NRC బిల్లులని వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న నిరసనలకి సంఘీభావం తెలుపుతూ పంజాబ్ కి చెందిన సిక్కులు షాహీన్ భాగ్ లో నిరసన కార్యక్రమాలు చేపట్టినట్టు ఉమర్ ఖలిద్ ‘05 ఫిబ్రవరి 2020’ నాడు తన ట్విట్టర్ అకౌంట్లో పేర్కొన్నారు. ఉమర్ ఖలిద్ షేర్ చేసిన ఫోటోలో పోస్టులో కనిపిస్తున్న అవే జండాలు అందరు పట్టుకున్నట్టు మనం గుర్తించొచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటో ఇటివల రైతులు చేస్తున్న నిరసనలకి సంబంధించినవి కాదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు.
చివరగా, CAA, NRC బిల్లులని వ్యతిరేకిస్తూ షాహీన్ భాగ్ లో చేసిన నిరసనల ఫోటోలని రైతులు ఇటివల చేస్తున్న నిరసనలుగా చిత్రికరిస్తున్నారు.