Fake News, Telugu
 

ప్రియాంక చోప్రా బురఖా వేసుకొని ఉన్న ఈ ఫోటో బంగ్లాదేశ్ లో తీసినది కాదు.

0

భారతదేశంలో మహిళలకు స్వేచ్చ లేకుంటే, బంగ్లాదేశ్ లో బురఖా వేసుకునే ప్రియాంక చోప్రా, భారత్ లో తనకు ఇష్టం వచ్చిన బట్టలు ఎలా వేసుకుంటుంది అని అడుగుతూ ప్రియాంక చోప్రా బురఖా వేసుకొని ఉన్న ఒక ఫోటోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ప్రియాంక చోప్రా బురఖా వేసుకొని ఉన్న ఈ ఫోటో బంగ్లాదేశ్ లో తీసినది.

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లో ఉన్న ఫోటో ‘సాత్ కూన్ మాఫ్’ అనే సినిమా షూటింగ్ అప్పుడు తీసినది. ఆ సినిమా లోని క్యారెక్టర్ కోసం ప్రియాంక చోప్రా బురఖా వేసుకుంది. ఒరిజినల్ ఫోటోలో ప్రియాంక ముఖం మీద బురఖా ఉండదు. అంతేకాదు, ఆ సినిమా షూటింగ్ జమ్ముకాశ్మీర్ లో జరిగింది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అదే ఫోటో (మొత్తం ఫోటో) ఒక మూవీ వెబ్సైటులో దొరుకుతుంది. ఒరిజినల్ ఫోటోలో ప్రియాంక చోప్రా ముఖం మీద బురఖా లేనట్టు చూడవొచ్చు. అంతేకాదు, ఆ ఫోటో ‘సాత్ కూన్ మాఫ్’ అనే సినిమా షూటింగ్ అప్పుడు తీసినదని ఆ వెబ్సైటులో రాసి ఉంటుంది

కొన్ని కీ-వర్డ్స్ తో వెతకగా, ఆ షూటింగ్ అప్పుడు తీసిన మరిన్ని ఫోటోలు దొరికాయి. పోస్ట్ చేసిన ఫోటోలో ఉన్న వ్యక్తులను ఆ ఫోటోల్లో కూడా మనం చూడవొచ్చు. ఆ ఫోటో ‘సాత్ కూన్ మాఫ్’ సినిమా షూటింగ్ జమ్ముకాశ్మీర్ లో జరిగినప్పుడు తీసినదని ‘పీటీఐ’ వెబ్సైటులో చూడవొచ్చు. ఆ సినిమాకి సంబంధించిన ఒక పాటలో ప్రియాంక చోప్రా  బురఖా వేసుకొని ఉన్నట్టు ఇక్కడ చూడవొచ్చు. కావున, పోస్ట్ చేసిన ఫోటో బంగ్లాదేశ్ కి సంబంధించింది కాదు. ఒక సినిమా షూటింగ్ లో భాగంగా ప్రియాంక చోప్రా జమ్ముకాశ్మీర్ లో బురఖా వేసుకున్నప్పుడు తీసిన ఫోటో అది.

ప్రియాంక చోప్రా బురఖా వేసుకొని ఉన్న మరొక ఫోటో తన ట్విట్టర్ ప్రొఫైల్ లో చూడవొచ్చు. అప్పుడు కూడా ‘క్వాంటికో’ అనే వెబ్ సిరీస్ కోసం వేసుకున్నట్టు చెప్తూ, “#Quantico’ హాష్‌ట్యాగ్ తో తను ట్వీట్ చేసింది.

2018 లో యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ గా ప్రియాంకా చోప్రా బంగ్లాదేశ్ శిబిరాల్లో ఉన్న రోహింగ్యా శరణార్థ పిల్లలను కలవడానికి వెళ్లినప్పుడు తీసిన ఫోటోలను యూనిసెఫ్ వెబ్సైటులో మరియు ప్రియాంక చోప్రా సోషల్ మీడియా అకౌంట్లలో చూడవొచ్చు. ఇక్కడ ఎక్కడా కూడా తాను బురఖా ధరించలేదు.

చివరగా, పోస్ట్ లోని ప్రియాంక చోప్రా బురఖా ఫోటోకి, బంగ్లాదేశ్ కి ఎటువంటి సంబంధం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll