Fake News, Telugu
 

పాకిస్థాన్, చైనాలతో యుద్దమంటూ వస్తే భారత దేశానికి కాకుండా శత్రు దేశాలకి మద్దతు పలుకుతానని ప్రకాష్ రాజ్ పేర్కొనలేదు

0

పాకిస్థాన్, చైనాతో యుద్దమంటూ వస్తే తాను భారత దేశానికి కాకుండా శత్రు దేశాలకి మద్దతు పలుకుతానని సిని నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల పేర్కొన్నట్టు సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతుంది. ప్రకాష్ రాజ్ చర్చిలో ప్రార్ధన చేస్తున్నప్పుడు తీసిన ఫోటోని ఈ పోస్టులో షేర్ చేస్తూ, చెన్నైలోని ఒక చర్చిలో ప్రార్ధన సందర్భంగా ప్రకాష్ రాజ్ ఈ సంచలన వ్యాఖ్యలు చేసినట్టు క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పాకిస్థాన్, చైనాతో యుద్దమంటూ వస్తే తాను భారత దేశానికి కాకుండా శత్రు దేశాలకి మద్దతు పలుకుతానని ప్రకాష్ రాజ్ ఇటీవల చెన్నైలోని ఒక చర్చిలో పేర్కొన్నారు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఫోటో, 2019 ఫిబ్రవరి నెలలో ప్రకాష్ రాజ్ బెంగళూరులోని బేతేల్ AG చర్చిని సందర్శించినప్పుడు తీసారు. పాకిస్థాన్, చైనాతో యుద్దమంటూ వస్తే తాను శత్రు దేశాలకి మద్దతు పలుకుతానని ప్రకాష్ రాజ్ ఈ చర్చిలో పేర్కొనలేదు. 2019 లోక్ సభ ఎన్నికలలో బెంగళూరు నుండి పోటి చేస్తానని ప్రకటించిన ప్రకాష్ రాజ్, ఎన్నికల ప్రచారానికి వెళ్ళే ముందు అన్ని మతాలను గౌరవిస్తూ వివిధ ప్రార్థన స్థలాలను దర్శించుకున్నారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ ఒక యూసర్ 04 ఫిబ్రవరి 2019 నాడు ట్వీట్ పెట్టినట్టు తెలిసింది. సినీనటుడు ప్రకాష్ రాజ్ బెంగళూరులోని బేతేల్ AG చర్చిని సందర్శించి పాస్టర్ రేవ్ జాన్సన్ ఆశీస్సులు తీసుకుంటున్న దృశ్యాలని ఈ ట్వీట్లో తెలిపారు. ప్రకాష్ రాజ్  బెంగళూరు బేతేల్ AG చర్చిని సందర్శించినప్పుడు తీసిన మరికొన్ని ఫోటోలని ఈ వీడియోలో చూడవచ్చు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని ప్రకాష్ రాజ్ 05 ఫిబ్రవరి 2019 నాడు తన ట్వీట్లో షేర్ చేసారు. ప్రకాష్ రాజ్ తన ట్వీట్లో, బేతేల్ AG చర్చిలో దిగిన ఫోటోతో పాటు ఇతర మత ప్రార్ధన స్థలాలలో తీసిన ఫోటోలని కూడా షేర్ చేసారు. 2019 లోక్ సభ ఎన్నికలలో బెంగళూరు నుండి పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన ప్రకాష్ రాజ్, ఎన్నికల ప్రచారానికి వెళ్ళే ముందు అన్ని మతాలను గౌరవిస్తూ వివిధ ప్రార్థన స్థలాలను దర్శించుకున్నానని తన ట్వీట్లో తెలిపారు.

ప్రకాష్ రాజ్  బేతేల్ AG చర్చిలో పాకిస్థాన్, చైనాతో యుద్దమంటూ వస్తే తాను వాళ్ళకి మద్దతు పలుకుతానని పేర్కొన్నట్టు ఇంటర్నెట్లో ఎక్కడ రిపోర్ట్ అవలేదు. బేతేల్ AG చర్చిలోనే కాదు, మరే సందర్భంలోనైనా ప్రకాష్ రాజ్ అటువంటి వ్యాఖ్యలు చేసివుంటే, ఆ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ అనేక న్యూస్ సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేసేవి. కానీ, అటువంటి వార్తలేవి ఏ ఒక్క వార్తా సంస్థ రిపోర్ట్ చేయలేదు.

ఇదివరకు, ఇదే ఫోటోని నాస్తికుడని చెప్పుకునే ప్రకాష్ రాజ్ చర్చిలో ప్రార్ధన చేస్తున్న దృశ్యాలని సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు, FACTLY దానికి సంబంధించి ఫాక్ట్-చెక్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది.

చివరగా, పాకిస్థాన్, చైనా దేశాలతో యుద్దమంటూ వస్తే భారతకి కాకుండా శత్రు దేశాలకి మద్దతు పలుకుతానని ప్రకాష్ రాజ్ పేర్కొనలేదు.

Share.

About Author

Comments are closed.

scroll