Fake News, Telugu
 

2017లో జమ్మూ కాశ్మీర్‌లో పోలీసులపై జరిగిన రాళ్ల దాడికి సంబంధించిన వీడియోని ఇప్పుడు రాజస్తాన్‌లో జరిగిందంటూ షేర్ చేస్తున్నారు

0

కొందరు వ్యక్తులు పోలీసులపై రాళ్లు రువ్వుతున్న ఒక వీడియోని షేర్ చేస్తూ, ఈ ఘటన ఇటీవల రాజస్తాన్‌లోని జైపూర్‌లో జరిగిందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకి సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: ఇటీవల రాజస్తాన్‌లోని జైపూర్‌లో పోలీసులపై కొందరు వ్యక్తులు రాళ్లు రువ్విన వీడియో.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియో 2017లో జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో జరిగిన నిరసనలకు సంబంధించింది. ఈ నిరసనలలో, నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో కనీసం ఆరుగురు పోలీసులు గాయపడ్డారు. ఈ వీడియోకి రాజస్తాన్‌కి ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్స్‌ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే వీడియోని 2017లో షేర్ చేసిన ఒక ఫేస్‌బుక్ పోస్ట్ మాకు కనిపించింది. యూట్యూబ్‌లో కూడా ఈ వీడియో 2017 నుండి అందుబాటులో ఉంది. దీన్నిబట్టి, ఈ వీడియో ఇటీవల జరిగిన ఘటనకు సంబంధించింది కాదని స్పష్టమవుతుంది.

పోస్టులోని వైరల్ వీడియోను జాగ్రత్తగా గమనించినప్పుడు, వీడియోలో ‘Western Hosiery’ మరియు  ‘Sathoo Furnishings’ అనే పేర్లతో రెండు షాపులను పక్క ప్రక్కనే చూడవచ్చు. ఈ షాపుల పేర్ల ఆధారంగా కీవర్డ్ సెర్చ్ చేయగా, ‘Western Hosiery’ పేరుతోని ఉన్న ఒక ఫేస్‌బుక్ పేజీలో వైరల్ వీడియోలో పక్క ప్రక్కనే కనిపిస్తున్న ఈ రెండు షాపుల ఫోటో కనిపించింది. ఐతే ఈ ఫేస్‌బుక్ పేజీలో ఉన్న వివరణ ప్రకారం, ఈ షాపులు జమ్మూ & కాశ్మీర్‌లోని అనంతనాగ్‌లోని లాల్ చౌక్ ప్రాంతంలో ఉన్నాయి. ‘Alstrong Enterprises India Pvt Ltd’ అనే ఫేస్‌బుక్ పేజీలో కూడా ఇదే ఫోటో కనిపించింది, ఈ పేజీలో కూడా ఈ షాపులు జమ్మూ & కాశ్మీర్‌లోని అనంతనాగ్‌లో ఉన్నట్టు పేర్కొన్నారు.

అలాగే వీడియోలో బాటా షోరూం పక్కన ‘VASCO PASCO’ పేరుతో ఒక షాపును చూడొచ్చు. ఐతే ‘జస్ట్ డయల్’ వెబ్‌సైట్‌లో ‘VASCO PASCO’ షాపు గురించి సమాచారం కోసం వెతకగా, ఈ షాపు కూడా అనంతనాగ్‌లోని లాల్ చౌక్‌లో ఉన్నట్లు తెలిసింది.

పైన తెలిపిన వివరాల ఆధారంగా యూట్యూబ్‌లో వెతకగా వైరల్ వీడియోలోని విజువల్స్‌ని రిపోర్ట్ చేసిన ఒక 2017 వార్తా కథనం మాకు లభించింది. ఈ కథనం ప్రకారం ఈ వీడియో  మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింల మారణహోమానికి వ్యతిరేకంగా జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో జరిగిన నిరసనలకు సంబంధించింది. ఈ నిరసనలలో, నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో కనీసం ఆరుగురు పోలీసులు గాయపడ్డారు. దీన్నిబట్టి, ఈ వీడియోకి రాజస్తాన్‌కి ఎటువంటి సంబంధంలేదని, ఈ వీడియో కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో 2017లో జరిగిన ఘటనకి సంబంధించిందని స్పష్టమవుతుంది.

చివరగా, 2017లో జమ్మూకాశ్మీర్‌లోని అనంతనాగ్‌లో పోలీసులపై జరిగిన రాళ్ల దాడికి సంబంధించిన వీడియోని ఇప్పుడు రాజస్తాన్‌లో జరిగిన ఘటనదంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll