Fake News, Telugu
 

హుబ్లిలో ఇటీవల కురిసిన గాలి వాన వీడియోని ఓడిశా సమీపంలో అసని తుఫాను భీభత్సం దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

ఓడిశా సమీపంలోని గోపాల్‌పూర్ వద్ద అసని తుఫాను భీభత్సం దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. తీవ్రమైన గాలి వానకు కుర్చీలు, టేబుళ్లు వాటంతట అవే గాలిలో ఎగిరిపోతున్న దృశ్యాలని మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఓడిశా సమీపంలోని గోపాల్‌పూర్ వద్ద అసని తుఫాను ధాటికి కుర్చీలు, టేబుళ్లు వాటికంతట అవే ఎగిరిపోతున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): వీడియోలోని ఘటన ఇటీవల కర్ణాటక రాష్ట్రం హుబ్లి నగరంలో చోటుచేసుకుంది. హుబ్లి నగరంలో ఇటీవల కురిసిన భారీ గాలి వానకు హుబ్లి ఎయిర్‌పొర్ట్ స్టాఫ్ క్యాంటిన్లోని కుర్చీలు గాలిలోకి ఎగిరిపోయిన దృశ్యాలని ఈ వీడియో చూపిస్తుంది. పోస్టులో షేర్ చేసిన వీడియోకి అసని తుఫానుకు ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని కొందరు ఫేస్‌బుక్ యూసర్లు మే మొదటి వారంలో షేర్ చేసినట్టు తెలిసింది. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాను 10 మే 2022 నాడు తూర్పు తీర ప్రాంతాన్ని తాకింది. దీన్ని బట్టి, పోస్టులో షేర్ చేసిన వీడియో అసని తుఫాను కన్నా ముందు నుంచే సోషల్ మీడియాలో షేర్ అవుతున్నట్టు స్పష్టమయ్యింది. వీడియోలోని ఘటన కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లి ఎయిర్‌పొర్ట్ కాంటీన్ సమీపంలో చోటుచేసుకుందని ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌’ జర్నలిస్ట్ అరుణ్ కుమార్ 05 మే 2022 నాడు ట్వీట్ చేసారు.

హుబ్లి నగరంలో ఇటీవల కురిసిన భారీ గాలి వానకు హుబ్లి ఎయిర్‌పొర్ట్ స్టాఫ్ క్యాంటిన్లోని కుర్చీలు, టేబుళ్లు గాలిలో ఎగిరిపోయిన దృశ్యాలని పలు కన్నడ వార్తా సంస్థలు ఈ వీడియోని పబ్లిష్ చేసాయి. ఈ వివరాల ఆధారంగా వీడియోలోని ఘటన కర్ణాటక రాష్ట్రం హుబ్లి నగరంలో చోటుచేసుకుందని, అసని తుఫానుకు సంబంధించినది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, హుబ్లి నగరంలో ఇటీవల కురిసిన భారీ గాలి వానకు కుర్చీలు ఎగిరిపోయిన వీడియోని ఓడిశా సమీపంలో అసని తుఫాను భీభత్సం అంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll