Fake News, Telugu
 

వ్యవసాయ మోటార్లకు మీటర్లకు అనుసంధానించే విషయానికి సంబంధించి బండి సంజయ్ వ్యాఖ్యలను వక్రీకరించి షేర్ చేస్తున్నారు

0

‘మేము తెలంగాణ రాష్ట్రంలో మోటార్లకు మీటర్లు పెడతాం’, అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అంటున్న వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. అలాగే ‘నేను ప్రజల కోసం పని చేసేటోన్ని కాదు, నేను పార్టీ కోసం పని చేసే వ్యక్తిని’ అని బండి సంజయ్ అన్నట్టు చెప్తున్న పోస్ట్ కూడా విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోలకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: ‘మేము తెలంగాణ రాష్ట్రంలో మోటార్లకు మీటర్లు పెడతాం’ – బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

ఫాక్ట్(నిజం):  తెలంగాణ రాష్ట్రంలో మోటార్లకు మీటర్లు పెడతామని బండి సంజయ్ అనలేదు. 20 ఫిబ్రవరి 20223న జరిగిన ప్రెస్ మీట్‌లో బండి సంజయ్ పలు సందర్భాల్లో మాట్లాడిన మాటలను వక్రీకరించి షేర్ చేస్తున్నారు. ఆలాగే ఈ ప్రెస్ మీట్‌లో తాను పదవుల కోసం పని చేసే వాడిని కాదని, పార్టీ కోసం పని చేసే వాడినని బండి సంజయ్ అన్న మాటలని తను ప్రజల కోసం పని చేసే వాడిని కాదని అన్నట్టు వక్రీకరించారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఈ రెండు వీడియోలు 20 ఫిబ్రవరి 20223న జరిగిన బండి సంజయ్ ప్రెస్ కాన్ఫరెన్స్ నుండి తీసుకున్నారు. ఐతే వైరల్ పోస్టులలో చెప్తున్నట్టు ‘తెలంగాణ రాష్ట్రంలో మోటార్లకు మీటర్లు పెడతామని’ మరియు ‘తాను ప్రజల కోసం కాక పార్టీ కోసం పని చేసే వ్యక్తినని’ బండి సంజయ్ అనలేదు.

ఈ ప్రెస్ మీట్‌లో మాట్లాడిన మాటలను వక్రీకరించి ఇలా షేర్ చేస్తున్నారు. షేర్ అవుతున్న ఆ రెండు వీడియోలకు సంబంధించి నిజాలేంటో కింద చూద్దాం.

వీడియో 1:

ఈ ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ ఒక సందర్భంలో కేంద్ర నూతన విద్యుత్ పాలసీలో మోటార్లకు మీటర్లు పెట్టమని ఎక్కడా లేదని చెప్పాడు. ఆ తర్వాత ‘మీము తెలంగాణ రాష్ట్రంలో మోటార్లకు మీటర్లు పెడతాం, మాకు లోన్లు ఇవ్వండని చెప్పి, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందా ? రాయలేదా?’  అని అడుగుతాడు.

ఐతే ప్రెస్ మీట్‌లోని ‘మేము తెలంగాణ రాష్ట్రంలో మోటార్లకు మీటర్లు పెడతాం’  అన్న కొంత భాగాన్ని మాత్రమే కట్ చేసి, బండి సంజయ్ రాష్ట్రంలో మోటార్లకు మీటర్లు పెడతాం అన్నట్టు వక్రీకరించి షేర్ చేస్తున్నారు. కాని నిజానికి బండి సంజయ్ ఇలాంటి ఉద్దేశంలో మాట్లాడలేదు.

ఈ ప్రెస్ మీట్‌ను అన్నీ మీడియా సంస్థలు రిపోర్ట్ చేసాయి. ప్రెస్ మీట్‌కు సంబంధించిన వార్తా కథనాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

వీడియో 2:

అలాగే ఈ ప్రెస్ మీట్‌లో ‘మీకు పెద్ద పదవి రాబోతుందని’ ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ‘నేను పదవుల కోసం పని చేసేటోన్ని కాదు, నేను పార్టీ కోసం పని చేసే వ్యక్తిని’ అని బండి సంజయ్ అన్నాడు. వీడియోలో ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది.

ఐతే బండి సంజయ్ అన్న ఈ మాటలను వక్రీకరించి ‘నేను ప్రజల కోసం పని చేసేటోన్ని కాదు, నేను పార్టీ కోసం పని చేసే వ్యక్తిని’ అని బండి సంజయ్ అన్నట్టు షేర్ చేస్తున్నారు.

చివరగా, వ్యవసాయ మోటార్లకు మీటర్లను అనుసంధానించే విషయానికి సంబంధించి బండి సంజయ్ వ్యాఖ్యలను వక్రీకరించి షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll