సెల్‌ఫోన్‌ల మధ్య మొక్కజొన్నలు పెడితే రేడియేషన్‌కు పాప్‌కార్న్ అయ్యాయని చెప్తూ ఒక వీడియో షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ పోస్టు ద్వారా నిద్రపోయేటపుడు తల కింద లేదా ప్రక్కన సెల్‌ఫోన్ పెట్టుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఐతే ఈ కథనం ద్వారా ఆ వీడియోకి సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: సెల్‌ఫోన్‌ల మధ్య మొక్కజొన్నలు పెడితే రేడియేషన్‌కు అవి పాప్‌కార్న్ అయ్యాయి.
ఫాక్ట్ (నిజం): ఈ వీడియోని 2008లో కార్డో సిస్టమ్స్ అనే ఒక సంస్థ తమ సంస్థ ప్రచారం కోసం రూపొందించింది. ఈ వీడియోలో చూపిస్తున్నది నిజం కాదని, ఈ వీడియోని డిజిటల్‌గా రుపొందించామని కార్డో సిస్టమ్స్ CEO ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇదే విషయంపై చాలా వార్తా సంస్థలు నిపుణులని సంప్రదించగా, ఇలా సెల్‌ఫోన్‌ల రేడియేషన్‌కు మొక్కజొన్నలు పాప్‌కార్న్ అవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసారు. సెల్‌ఫోన్‌ల రేడియేషన్ మనిషి శరీరంలోని కణాలను వేడి చేస్తాయి, కానీ అది హానికరం కాదని అధ్యయనాలు సూచిస్తున్నట్టు నిపుణులు స్పష్టం చేసారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వీడియోలో చూస్తుంది నిజం కాదు. కార్డో సిస్టమ్స్ అనే బ్లూటూత్ పరికరాలు తయారు చేసే కంపెనీ 2008లో తమ సంస్థ ప్రచారం కోసం ఈ అడ్వర్టైసింగ్ వీడియోని రూపొందించింది. ఈ వీడియో వైరల్ అవ్వడంతో కార్డో సిస్టమ్స్ CEO ఒక ఇంటర్వ్యూలో ఈ వీడియో గురించి స్పష్టతనిస్తూ నిజానికి వీడియోలో చూపించినట్టు సెల్‌ఫోన్‌ల రేడియేషన్‌కు మొక్కజొన్నలు పాప్‌కార్న్ అవలేదని అన్నారు. ఈ వీడియోని డీబంక్ చేస్తూ స్నోప్స్ 2008లో రాసిన కథనంలో సెల్‌ఫోన్‌ల రేడియేషన్‌కు మొక్కజొన్నలు పాప్‌కార్న్ అవలేదని డిజిటల్‌గా రుపొందించామని కార్డో సిస్టమ్స్ CEO తెలిపినట్టు రాసింది.

అప్పట్లో ఈ వీడియో చాలా వైరల్ కావడంతో చాలా వార్తా సంస్థలు ఈ వీడియో గురించి స్పష్టతనిస్తూ కథనాలు రాసాయి. వైర్డ్ అనే వార్తా సంస్థ వర్జీనియా విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్ర ప్రొఫెసర్ లూయిస్ బ్లూమ్‌ఫీల్డ్‌ని సంప్రదించి రాసిన కథనంలో అయన చెప్పిన దాని ప్రకారం ‘సౌండ్ ద్వారా వేడి చేయడం సాధ్యమైనప్పటికి ఇలా సెల్‌ఫోన్‌ల రేడియేషన్‌కు మొక్కజొన్నలు పాప్‌కార్న్ అవ్వడం భౌతికంగా సాధ్యం కాదు. సాధారణంగా మైక్రోవేవ్ ఓవెన్ మొక్కజొన్నల లోపలి తేమను వేడి చేస్తుంది, తద్వారా అవి పాప్‌కార్న్ అవుతాయి. ఒకవేళ మొబైల్ ఫోన్‌లు అంత శక్తిని విడుదల చేస్తే, ప్రజల వేళ్ల లోపల నీరు వేడెక్కాలి, కాబట్టి ఈ వీడియోలో చెప్తుంది పూర్తిగా అబద్ధం.’ అలాగే సెల్‌ఫోన్‌లు మనిషి శరీరంలోని కణాలను వేడి చేస్తాయి, కానీ అది హానికరం కాదని అధ్యయనాలు సూచిస్తున్నట్టు కూడా బ్లూమ్‌ఫీల్డ్ అన్నారు.

ఈ వీడియోకి సంబంధించి ది గార్డియన్ రాసిన కథనంలో ప్రొఫెసర్ లూయిస్ బ్లూమ్‌ఫీల్డ్ చెప్పిన విషయాన్నే పునరుద్ఘాటించింది. పైగా వీడియో చూపిస్తున్నట్టు మేము కూడా సెల్‌ఫోన్‌ల మధ్య మొక్కజొన్నలు పెట్టి ప్రయత్నించినప్పుడు అవి పాప్‌కార్న్ అవలేదని రాసింది.
గతంలో కూడా ఇలాగే సెల్‌ఫోన్‌ల రేడియేషన్‌తో కోడి గుడ్లను ఉడికించోచ్చని వార్తలు ప్రచారం కావడంతో రేడియో కమ్యూనికేషన్ పరికరాల తయారీదారుల అంతర్జాతీయ ఫోరం అయిన మొబైల్ తయారీదారుల ఫోరం ఇది టెక్నికల్‌గా సాధ్యం కాదంటూ ఒక కథనాన్ని ప్రచురించినట్టు స్నోప్స్ ఒక కథనంలో రాసింది.

చివరగా, సెల్‌ఫోన్‌ల రేడియేషన్‌తో పాప్‌కార్న్ తాయారు చేయడం సాధ్యం కాదు, ఈ వీడియో డిజిటల్‌గా రుపొందించారు.