Fake News, Telugu
 

పీలేరులో చిన్నపిల్లలను కిడ్నాప్ చేసే ముఠా పట్టుబడినట్టుగా వైరల్ చేస్తున్న వీడియోలు కేవలం పుకార్లేనని పీలేరు పోలీసులు స్పష్టం చేశారు

0

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పీలేరులో చిన్నపిల్లలను ఎత్తుకెళ్ళే ముఠాను ప్రజలు పట్టుకొని కొడుతున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు షేర్ అవుతున్నాయి. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం. 

క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్ పీలేరులో చిన్నపిల్లలను ఎత్తుకెళ్ళే ముఠాను ప్రజలు పట్టుకొని కొడుతున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పీలేరులో భవన నిర్మాణ కూలీ పని కోసం వచ్చిన ఇద్దరు ఒడిషాకు చెందిన యువకులు, 18 అక్టోబర్ 2022 నాడు రాత్రి మద్యం సేవించి వెళ్తుండగా, కొందరు స్థానికులు వారిని పిల్లలను ఎత్తుకెళ్ళే ముఠాగా భావించి వారిపై దాడి చేసి పోలీసులకు అప్పగించారు. దెబ్బలు తిన్న ఇద్దరు వ్యక్తులు చిన్నపిల్లలను ఎత్తుకెళ్ళే ముఠా కాదని, వారు కేవలం కూలీ పని చేసుకొనేందుకు పీలేరు వచ్చినట్టు పీలేరు పోలీసులు మీడియాకు స్పష్టం చేశారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం ఇంటర్నెట్లో వెతికితే, ఈ ఘటనకు సంబంధించిన వివరాలను తెలుపుతూ ‘ఈనాడు’ వార్తా సంస్థ పబ్లిష్ చేసిన ఆర్టికల్ దొరికింది. పీలేరు పట్టణంలో చిన్న పిల్లలను కిడ్నాప్ చేసే ముఠా సంచరిస్తున్నట్టు పుకార్లు వ్యాపించినట్టు ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేశారు.  

ఈ ఘటనకు సంభంధించిన వివరాలను రిపోర్ట్ చేస్తూ ‘ABN ఆంధ్రజ్యోతి’ పబ్లిష్ చేసిన ఆర్టికల్‌ని ఇక్కడ చూడవచ్చు. పీలేరులో భవన నిర్మాణ కూలీ పని కోసం వచ్చిన ఇద్దరు ఒడిషాకు చెందిన యువకులు, 18 అక్టోబర్ 2022 నాడు రాత్రి మద్యం సేవించి వెళ్తుండగా, కొందరు స్థానికులు వారితో గొడవపడినట్టు ఈ వార్తా కథనంలో రిపోర్ట్ చేశారు. ఇతర రాష్ట్రానికి చెందిన వారు కావడం, అలాగే వారి భాష అర్ధం కాకపోవడంతో, స్థానికులు వారిని పిల్లలను ఎత్తుకెళ్ళే ముఠాగా భావించి వారిపై దాడి చేసినట్టు ఈ  ఆర్టికల్‌లో రిపోర్ట్ చేశారు.

దెబ్బలు తిన్న ఇద్దరు వ్యక్తులు చిన్నపిల్లలను ఎత్తుకెళ్ళే ముఠా సభ్యులు కాదని, వారు కేవలం కూలీ పని చేసుకునే వారని పీలేరు పొలీసులు మీడియాకు స్పష్టం చేశారు. పిల్లల కిడ్నాప్ అంటూ వచ్చిన వదంతుల్లో వాస్తవం లేదని, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే వదంతులు సృష్టిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని సీఐ మోహన్ రెడ్డి హెచ్చరించారు. ఈ వివరాల ఆధారంగా పీలేరులో స్థానికులు పట్టుకొని దేహశుద్ది చేసిన ఇద్దరు యువకులు కూలీలని, పిల్లలను ఎత్తుకొని వెళ్ళే ముఠా సభ్యులు కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, పీలేరులో చిన్నపిల్లలను కిడ్నాప్ చేసే ముఠా పట్టుబడినట్టుగా వైరల్ చేస్తున్న వీడియోలు కేవలం పుకార్లేనాని పీలేరు పోలీసులు స్పష్టం చేశారు. 

Share.

About Author

Comments are closed.

scroll