Fake News, Telugu
 

పవన్ కళ్యాణ్‌కు అమరావతి పరిసరాల్లో 62 ఎకరాల భూమి ఉంది అని చెప్పడానికి ఆధారాలు లేవు

0

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు గుంటూరు జిల్లా అమరావతి పరిసర ప్రాంతాలలో 1200 కోట్లు విలువ చేసే 62 ఎకరాల భూమి ఉందని చెప్తూ కొన్ని డాక్యుమెంట్లతో ఉన్న పోస్టు ఒకటి సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు అమరావతి పరిసర ప్రాంతాలలో 1200 కోట్ల విలువ చేసే 62 ఎకరాల భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు.  

ఫాక్ట్: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ ఆస్తికి సంబందించిన ఈ ఆరోపణలు 2018 నుంచి ఉన్నాయి. తన 2019 ఎన్నికల అఫిడవిట్‌ను పరిశీలించగా, అందులో మంగళగిరి మరియు కాజా గ్రామాలలో 2018లో కొన్న 0.9033 మరియు 2.07 ఎకరాల భూమికి సంబంధించిన వివరాలు మాత్రమే ఉన్నాయి. ఇక వైరల్ అవుతున్న పోస్టులో ఉన్న సర్వే నెంబర్‌లను  “మీ భూమి” వెబ్‌సైట్లో వెతకగా ఎటువంటి భూ రికార్డులు లభించలేదు. 2020లో జనసేన పార్టీ ఇవే ఆరోపణలను ఖండిస్తూ ఇటువంటి తప్పుడు ప్రచారం చేసే వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అని స్పష్టం చేసింది. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

ముందుగా, 2018లో తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచే పవన్ కళ్యాణ్ ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డాడు అని ఆరోపణలు ఉన్నాయి అని తెలుస్తుంది. ఈ విషయాలను తెలుసుకోవడానికి పవన్ కళ్యాణ్ 2019 అసెంబ్లీ ఎన్నికలలో భీమవరం, గాజువాకలలో పోటీ చేసేందుకు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌ను పరిశీలించాము. అందులో అమరావతి పరిసర ప్రాంతాలలో ఉన్న భూములకు సంబంధించిన వివరాలను ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

స్థిరాస్తి వివరాలు విస్తీర్ణం (ఎకరాలలో)కొనుగోలు తేదీకొన్న విలువ
సర్వే no. 57/1, మంగళగిరి (గ్రా), గుంటూరు జిల్లా. 0.903313.04.2018రూ. 2,66,04,600/-
సర్వే no. 368/B1, కాజా గ్రామం, మంగళగిరి మండలం, గుంటూరు జిల్లా. 2.0701.02.2018రూ. 45,75,000/-

ఇక వైరల్ అవుతున్న పోస్టులో ఉన్న సర్వే నెంబర్‌లను ఆంధ్ర ప్రదేశ్ రెవెన్యూ శాఖకు చెందిన “మీ భూమి” పోర్టల్ లో వెతికాము. కానీ అక్కడ ఈ సర్వే నెంబర్లకు సంబంధించిన ఎటువంటి రికార్డులు లభించలేదు.

ఇక ఇవే ఆరోపణలు 2020లో కూడా వచ్చినప్పుడు, జనసేన పార్టీకి చెందిన లీగల్ విభాగము ఇది పూర్తిగా తప్పుడు ప్రచారం అని, ఇటువంటి ప్రచారం చేసే వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అని స్పష్టం చేశారు. జనసేన పార్టీ ఈ ఆరోపణలను ఖండిస్తూ అధికారికంగా విడుదల చేసిన లేఖ ఇక్కడ చూడవచ్చు.

చివరిగా, పవన్ కళ్యాణ్‌కు అమరావతి పరిసరాల్లో 62 ఎకరాల భూమి ఉంది అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll