Fake News, Telugu
 

క్రైస్తవ మతానికి మారిన దళితులను షెడ్యూల్డ్ కులాల (SC) కింద గుర్తిస్తూ సుప్రీం కోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వలేదు

0

చర్చిలకు వెళ్ళే దళితులను షెడ్యూల్డ్ కులాల (SC) కిందనే గుర్తిస్తూ సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు ప్రకటించింది, అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతోంది. కేవలం దళితులు క్రైస్తవులుగా మారితే మాత్రమే వారి కులం SC నుండి బీసీగా ఇదివరకు మారుతుండేదని, క్రైస్తవ మతానికి మారిన వేరే కులాలకి చెందిన వారికి ఈ నియమాలు వర్తించవని ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: చర్చిలకు వెళ్ళే దళితులను షెడ్యూల్డ్ కులం (SC) కిందనే గుర్తిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.

ఫాక్ట్ (నిజం): క్రైస్తవ మతానికి మారిన దళితులను షెడ్యూల్డ్ కులాల (SC) కింద గుర్తిస్తూ సుప్రీం కోర్టు ఇటీవల ఎటువంటి తీర్పు ఇవ్వలేదు. ‘Constitution (Scheduled Castes) Order,1950’ ప్రకారం హిందూ, సిక్కు, మరియు బౌద్ధ మతం కాకుండా ఇతర మతాల వారికి షెడ్యూల్డ్ కులం (SC) అర్హత ఉండదు. ఎస్సీ రిజర్వేషన్ల ప్రయోజనాన్ని ఇతర మతాలలోకి మారిన దళితులకు కూడా వర్తింపజేసే అంశంపై తమ ప్రస్తుత వైఖరిని తెలియజేయాలని సుప్రీం కోర్టు, కేంద్ర ప్రభుత్వానికి 30 ఆగస్టు 2022 నాడు ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో మతం మారిన దళితులకు ఎస్సీ హోదా వర్తింపజేసే అంశాన్ని పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కే.జీ.బాలకృష్ణన్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిషన్‌ను ఏర్పాటు చేసింది. రెండేళ్లలో కమిషన్ తమకు నివేదికను సమర్పించవల్సిందిగా కేంద్ర ప్రభుత్వం కోరింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం ఇంటర్నెట్లో వెతికితే, ఇతర మతాలను స్వీకరించిన దళితులకు ఎస్సీ హోదా కల్పించడంపై దాఖలైన ఒక పిటిషన్‌కు సంబంధించి సుప్రీం కోర్టు 30 ఆగస్టు 2022 నాడు ఆర్డర్ పాస్ చేసినట్టు తెలిసింది. ఎస్సీ రిజర్వేషన్ల ప్రయోజనాన్ని ఇతర మతాలలోకి మారిన దళితులకు కూడా వర్తింపజేసే అంశంపై తమ ప్రస్తుత వైఖరిని మూడు వారాలలోపు  తెలియజేయాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది.

2004లో దాఖలైన ఈ పిటిషన్ ప్రస్తుతం సుప్రీం కోర్టులో పెండింగ్లో ఉంది. క్రైస్తవ మతం స్వీకరించిన ఎస్సీలకు కూడా ఎస్సీ రిజర్వేషన్ అమలు అయ్యేలా చూడాలని కోరుతూ ఇంతకముందు కొందరు సుప్రీం కోర్టు లో పిటిషన్ వేసినట్టు ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు. ఈ పిటిషన్లు ప్రస్తుతం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. క్రైస్తవ మతానికి మారిన దళితులను షెడ్యూల్డ్ కులాల (SC) కింద గుర్తిస్తూ సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు ఇచ్చినట్టు ఎక్కడా ఆధారాలు లేవు.

ఆయితే, మతం మారిన దళితులకు ఎస్సీ హోదా కల్పించే అంశాన్ని పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కే.జీ.బాలకృష్ణన్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిషన్‌ను ఏర్పాటు చేసింది. తరతరాలుగా షెడ్యూల్డ్ కులానికి చెందిన వారు, రాజ్యాంగంలోని ప్రెసిడెన్షల్ ఆర్డర్స్‌లో పేర్కొన్న మతాలకు కాకుండా వేరే మతంలోకి మారితే, వారికి ఎస్సీ హోదా కల్పించాలా వద్దా అనే అంశంపై అధ్యయనం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఈ కమిషన్‌ను కోరింది. ప్రస్తుతం ఉన్న షెడ్యూల్డ్ కులాల జాబితాలో అటువంటి కొత్త వ్యక్తులను చేర్చడం వల్ల కలిగే ప్రభావాలను అలాగే, ఇతర మతాలలోకి మారిన దళితులు ఎదుర్కొనే వివక్షను అధ్యయనం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఈ కమిషన్‌కు సూచించింది. రెండేళ్లలో కమిషన్ తమకు నివేదికను సమర్పించవల్సిందిగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అధికారిక నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొంది. ఈ కమిషన్ రిపోర్టు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ అంశం మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Constitution (Scheduled Castes) Order, 1950’ ప్రకారం హిందూ, సిక్కు, మరియు బౌద్ధ మతం కాకుండా ఇతర మతాల వారికి షెడ్యూల్డ్ కులం (SC) అర్హత ఉండదు. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ 11 ఫిబ్రవరి 2021 నాడు రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు అప్పటి కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్ సమాధానమిచ్చారు. విద్యాపరంగా లేదా సామాజికంగా వెనుకబడిన కులం/సంఘాలకు చెందిన వ్యక్తులను ఓబీసీ హోదా కల్పిస్తారు. ఎస్సీ హోదా మాదిరి మతాలానుసారంగా ఓబీసీ హోదా కల్పించరు.  సాధారణంగా ఎస్సీ కులానికి చెందిన వ్యక్తులు హిందూ, సిక్కు, మరియు బౌద్ధ మతం కాకుండా వేరే మతాలలోకి మారితే, వారి సామాజిక మరియు విద్యాపరమైన ప్రతికూలతల ఆధారంగా వారు ఓబీసీ హోదా పొందవచ్చు. దళితులు వేరే మతంలోకి మారితే వారి ఎస్సీ హోదాకు సంబంధించి ఫాక్ట్‌లీ పబ్లిష్ చేసిన ఆర్టికల్‌ను ఇక్కడ చూడవచ్చు.

చివరగా, క్రైస్తవ మతానికి మారిన దళితులను షెడ్యూల్డ్ కులాల (SC) కింద గుర్తిస్తూ సుప్రీం కోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వలేదు.

Share.

About Author

Comments are closed.

scroll