Fake News, Telugu
 

తెలంగాణా మరియు తమిళనాడులో అన్ని ప్రార్థనా స్థలాలకు యూనిట్ కరెంట్ ఒకేలా ఛార్జ్ చేస్తారు

0

Update (20 October 2022):

సాధారణ పౌరులు, దేవాలయాలకు కరెంట్ యూనిట్‌కు రూ.7.85. ఛార్జ్ చేస్తే, మసీదు మరియు చర్చీలకు కరెంట్ యూనిట్‌కు రూ. 1.85 మాత్రమే ఛార్జ్ చేస్తున్నారంటూ ఒక పోస్ట్ తెలంగాణాలో చాలా మంది షేర్ చేస్తున్నారు.

అయితే, తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ టారిఫ్ ఆర్డర్ ప్రకారం, వివిధ ప్రార్థనా ప్రదేశాలకు ఛార్జ్ చేసే కరెంట్ యూనిట్ రేట్లలో ఎటువంటి మతపరమైన వ్యత్యాసం లేదు. పూర్తి మతపరమైన ప్రార్థనా ప్రదేశాలకు (అంటే చర్చిలు, దేవాలయాలు, మసీదులు, గురుద్వారాలు) రూ. 6.40/యూనిట్ (2 kW వరకు లోడ్ కోసం), మరియు రూ. 7.00/యూనిట్ (2 kW కన్నా ఎక్కువ లోడ్ కోసం) ఛార్జ్ చేస్తారు.

Published (20 May 2022):

తమిళనాడులో దేవాలయాలకు కరెంట్ యూనిట్ కి 8 రూపాయలు ఛార్జ్ చేస్తే, మసీదు మరియు చర్చీలకు కరెంట్ యూనిట్ కి  2.85 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తారు అని చెప్తూ, ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: తమిళనాడులో దేవాలయాలకు కరెంట్ యూనిట్ కి 8 రూపాయలు ఛార్జ్ చేస్తే, మసీదు మరియు చర్చీలకు కరెంట్ యూనిట్ కి 2.85 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తారు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో చెప్పినట్టు దేవాలయాలకు ఒక కరెంట్ రేటు మరియు మిగితా ప్రార్థనా స్థలాలకు వేరే రేటు ఉన్నట్టు ఎక్కడా కూడా సమాచారం లేదు. అన్ని ప్రార్థనా స్థలాలకు యూనిట్ కరెంట్ ఒకటేలా ఛార్జ్ చేస్తారని వివిధ ఆర్డర్లలో చూడవొచ్చు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు

పోస్టులో చెప్పిన విషయం గురించి ‘Tamil Nadu Electricity Regulatory Commission (TNERC)’  వారి వెబ్సైటులో వెతకగా, వారు 2019-20 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి రిలీజ్ చేసిన ఒక ఆర్డర్ లో కరెంట్ రేట్లకు సంబంధించిన వివరాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఆ ఆర్డర్ లో ఎక్కడా కూడా దేవాలయాలకు ఒక రేటు మరియు మిగితా ప్రార్థనా స్థలాలకు వేరే రేటు ఉన్నట్టు సమాచారం లేదు. ఆ ఆర్డర్ లో కేవలం ‘Actual Places of Public Worship’ (‘ప్రార్థనా స్థలాలు’) అని రాసి ఉన్నట్టు చూడవొచ్చు. అన్ని ప్రార్థనా స్థలాలకు రెండు నెలలకు గాను 120 రూపాయలు ఫిక్స్డ్ ఛార్జ్ మరియు 120 యూనిట్ల వరకు యూనిట్ కి  2.85 రూపాయలు (అసలు- 5.75 రూపాయలు ప్రతి యూనిట్ కి, ప్రభుత్వ సబ్సిడీ – 2.90 రూపాయలు ప్రతి యూనిట్ కి) ఛార్జ్ చేస్తారు. 120 యూనిట్ల తరువాత ప్రతి యూనిట్ కి  5.75 రూపాయలు (ప్రభుత్వ సబ్సిడీ లేదు) ఛార్జ్ చేస్తారు. ప్రభుత్వ సబ్సిడీకి సంబంధించిన వివరాలు కూడా ఆ ఆర్డర్ లో చూడవొచ్చు. 2019-20 ఆర్ధిక సంవత్సరానికి ప్రార్థనా స్థలాలకు ఇచ్చే సబ్సిడీ సుమారు 16.30 కోట్ల రూపాయలు అవ్వొచ్చని అంచనా వేసారు.

అయితే, పైన ఇచ్చిన వివరాలు ‘Low Tension Supply’ కి సంబంధించినవి. ఒకవేల ప్రార్థనా స్థలాలు ‘High Tension Supply’ తీసుకుంటే, దాని చార్జీలు వేరే ఉంటాయి. వాటిని ‘Tamil Nadu Generation and Distribution Corporation (TANGEDCO)’ వెబ్సైటులో చూడవొచ్చు. 2006 లో కొన్ని దేవాలయాలకు రాయితీ ఇవ్వమని అభ్యర్థన వచ్చినప్పుడు, ఆదాయం బట్టి అన్ని ప్రార్థనా స్థలాలకు ఆ రాయితీలు వర్తించేలా ఇచ్చిన ఆర్డర్ ని ఇక్కడ చూడవొచ్చు. పోస్టులో పెట్టిన కరెంట్ చార్జీల ఫోటో వైరల్ అవుతున్నందున, దానిపై ‘TANGEDCO’ వారిని FACTLY వివరణ కోరింది. వారి నుండి సమాధానం వచ్చాక ఈ ఆర్టికల్ అప్డేట్ చేయబడుతుంది.

చివరగా, తమిళనాడు లో అన్ని ప్రార్థనా స్థలాలకు యూనిట్ కరెంట్ ఒకటేలా ఛార్జ్ చేస్తారు.

వివరణ (20 May 2020):
FACTLY రాసిన ఇమెయిల్ కి తమిళనాడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు సమాధానం ఇస్తూ వేర్వేరు ప్రార్థనా స్థలాలకు వేరు వేరుగా ఛార్జ్ విధిచట్లేదని స్పష్టం చేసారు. వైరల్ అవుతున్న మెసేజ్ లోని సమాచారం కూడా తప్పని తెలిపారు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll