ప్రపంచంలోని నాలుగో అతి పెద్ద విమానాశ్రయంగా నిర్మిస్తున్న నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పొర్టు యొక్క మోడల్ చిత్రం, అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. ఉత్తరప్రదేశ్ జేవర్ సమీపంలో నూతనంగా నిర్మించనున్న నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పొర్టుకు (NIA) 25 నవంబర్ 2021 నాడు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసారు. పోస్టులో షేర్ చేసిన అదే డిజైన్ మోడల్ చిత్రాన్ని పలువురు బీజేపీ మంత్రులు కూడా నోయిడా ఎయిర్‌పొర్టు యొక్క డిజైన్ మోడల్ చిత్రంగా సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఉత్తరప్రదేశ్ జేవర్ సమీపంలో నూతనంగా నిర్మించనున్న నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పొర్టును (NIA) యొక్క డిజైన్ మోడల్ చిత్రం.
ఫాక్ట్ (నిజం): ఈ ఫోటోలో కనిపిస్తున్నది చైనా బీజింగ్ నగరంలోని డాక్సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పొర్టు, నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పొర్టు యొక్క డిజైన్ చిత్రం కాదు. డాక్సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పొర్టు చిత్రాలని భారత దేశానికి చెందిన కొందరు నోయిడా ఎయిర్‌పొర్టు చిత్రాలుగా షేర్ చేస్తుందని చైనా జర్నలిస్ట్ షేన్ షివే ట్వీట్ కూడా పెట్టారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ ‘Architect Magazine.com’ వెబ్సైటు 06 ఫిబ్రవరి 2015 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ ఫోటోలో కనిపిస్తున్నది చైనా బీజింగ్ నగరంలో నిర్మించనున్న డాక్సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పొర్టు యొక్క డిజైన్ చిత్రమని ఆర్టికల్‌లో తెలిపారు. ఈ డిజైన్ చిత్రాన్ని లండన్ దేశానికి చెందిన జాహ హదీద్ ఆర్కిటెక్ట్ సంస్థ మరియు ADP ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ కమపనీ సంయుక్తంగా రూపొందించినట్టు ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు. స్టార్ ఫిష్ ఆకారంలో కనిపిస్తున్న ఈ భవనం బీజింగ్ నగరంలోని డాక్సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పొర్టని పలు వార్తా సంస్థలు అలాగే, ఆర్కిటెక్ట్ వెబ్సైట్లు ఆర్టికల్స్ పబ్లిష్ చేసాయి. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.
చైనా బీజింగ్ నగరంలోని డాక్సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పొర్టుని 2019 సెప్టెంబర్ నెలలో ప్రారంభించారు. డక్సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పొర్టు యొక్క దృశ్యాలు, పోస్టులో షేర్ చేసిన ఫోటోతో పోలి ఉండటాన్ని మనం చూడవచ్చు. అంతేకాదు, భారత దేశానికి చెందిన కొందరు బీజింగ్ డాక్సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పొర్టని నోయిడా ఎయిర్‌పొర్టు చిత్రాలుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని చైనా జర్నలిస్ట్ షేన్ షివే 26 నవంబర్ 2021 నాడు ట్వీట్ కూడా పెట్టారు.
ఉత్తరప్రదేశ్ జేవర్ సమీపంలో నిర్మించనున్న నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పొర్టు యొక్క గ్రాఫిక్స్ డిజైన్ వీడియోని నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పొర్టు అధికారిక ట్విట్టర్ హేండిల్ 24 నవంబర్ 2021 నాడు షేర్ చేసింది. ఈ గ్రాఫిక్స్ డిజైన్ వీడియోలో కనిపిస్తున్న చిత్రాలు, పోస్టులో షేర్ చేసిన డిజైన్ చిత్రంతో పోలి లేదని స్పష్టంగా తెలుస్తుంది. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటో చైనాలోని డాక్సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పొర్టుకు సంబంధించిన చిత్రాలని స్పష్టమయ్యింది.
చివరగా, చైనాలోని డాక్సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పొర్టు ఫోటోని నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పొర్టు మోడల్ చిత్రమని షేర్ చేస్తున్నారు.