ఆంధ్రప్రదేశ్‌లోని గుంతల రోడ్లని ప్రజలు ప్రీ వెడ్డింగ్ ఘాట్ల కోసం వినియోగిస్తున్న దృశ్యమంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్‌లోని గుంతల రోడ్లపై జంటలు ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ జరుపుకుంటున్న దృశ్యం.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఫోటోని ఈస్ట్ ఆఫ్రికాలోని మొజాంబిక్ దేశంలో తీశారు. ఈ ఫోటో 2022 ఆగస్టు నెల నుండి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఈ ఫోటో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని ఆఫ్రికాకు చెందిన పలు వార్తా సంస్థలు, జర్నలిస్టులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు తెలిసింది. ఆఫ్రికాలోని గుంతల రోడ్లు పర్యాటక ఆకర్షణగా నిలుస్తున్నాయని ఆఫ్రికా వార్తా సంస్థలు ఈ ఫోటోని షేర్ చేస్తూ తెలిపాయి. ఈ ఫోటో 2022 ఆగస్టు నెల నుండి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది.
ఈ ఫోటోకి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతికితే, ఆఫ్రికాలోని మొజాంబిక్ దేశంలోని N1 రోడ్డుపై పర్యాటకులు దిగిన ఫోటో అంటూ పలు సోషల్ మీడియా పేజీలు ఈ ఫోటోని 13 ఆగస్టు 2022 నాడు పోస్ట్ చేసినట్టు తెలిసింది. ఆ పోస్టులని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. పై వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటో పాతది మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.
చివరగా, ఆఫ్రికాలో తీసిన ఫోటోని ఆంధ్రప్రదేశ్‌లోని గుంతల రోడ్లపై జంటలు ప్రీ వెడ్డింగ్ షూట్ జరుపుకుంటున్న దృశ్యమంటూ షేర్ చేస్తున్నారు.