Fake News, Telugu
 

కాశ్మీర్ ఫైల్స్ గెలుచుకున్నది భారత ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత సినిమా పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కాదు

0

వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రానికి ఉత్తమ చలనచిత్రం విభాగంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది అని చెప్తున్న పోస్టు ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీని గురించి సరైన వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

క్లెయిమ్: 2022లో విడుదలైన చిత్రం ‘ది కాశ్మీర్ ఫైల్స్’ ఉత్తమ చలనచిత్రంగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గెలుచుకుంది.

ఫాక్ట్(నిజం): ఈ అవార్డుకి మరియు సినిమా రంగంలో భారత ప్రభుత్వం ఏటా ఇచ్చే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు సంబంధం లేదు.  ది కాశ్మిర్ ఫైల్స్ చిత్రం గెలిచింది 2016లో స్థాపించబడిన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (DPIFF) వారు ఇచ్చే అవార్డు. కేంద్ర  ప్రభుత్వం ఇచ్చే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 1969లో స్థాపించబడింది. అసలు ఈ అవార్డులో ఉత్తమ చిత్రం అనే విభాగమే ఉండదు. భారతీయ సినిమా రంగం అభివృద్ధికి కారణమైన వారికి ఈ అవార్డును అందచేస్తారు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిము తప్పుదోవ పట్టించేలాగా ఉంది.

ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రానికి వచ్చిన అవార్డును గురించి ఇంటర్నెట్లో వెతకగా, దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (DPIFF) వారు ఫిబ్రవరి 20వ తారీఖున నిర్వహించిన అవార్డుల ప్రధాన కార్యక్రమంలో ఉత్తమ చలనచిత్రం విభాగంలో ది కాశ్మీర్ ఫైల్స్ నెగ్గింది అని తెలిసింది.

దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (DPIFF) 2016లో స్థాపించబడింది. ఉత్తమ చలనచిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, తదితర విభాగంలో ఈ అవార్డులను అందచేస్తారు. ఈ ఏడాది విజేతల జాబితాను ఈ వార్త కథనంలో చూడవొచ్చు.

అయితే ఈ అవార్డు మరియు భారత ప్రభుత్వం ఇచ్చే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఒకటి కాదు. ప్రతి ఏటా భరత ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును చలనచిత్ర రంగం యొక్క అభివృద్ధికి కృషి చేసిన వారికి అందచేస్తుంది. ఏటా ఒకరికి మాత్రమే ఈ అవార్డును ఇస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్లో నిర్వహించిన జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో ఈ అవార్డును సినీనటి ఆశ పరేఖ్ అందుకొన్నారు. 2020 సంవత్సరానికి గాను ఈ బహుమతిని తనకు అందచేశారు.

గతంలో అమితాబ్ బచ్చన్, లతా మంగేష్కర్, కే. విశ్వనాధ్ మరియు అనేక సినీరంగ ప్రముఖులకి  ఈ అవార్డును భారత ప్రభుత్వం అందచేసింది

చివరిగా, కాశ్మీర్ ఫైల్స్ గెలుచుకున్న దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, భారత ప్రభుత్వం ఇచ్చే సినిమా రంగంలో అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రెండూ వేరు.

Share.

About Author

Comments are closed.

scroll