ప్రభుత్వ పాఠశాలలు, గ్రామ సచివాలయాల్లో ఎలక్షన్స్ పెడితే ఓటర్లు ప్రభావితం అవుతారని, కాబట్టి గ్రామాల్లో వేపచెట్టు, మర్రి చెట్టు నీడలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేసిన తెలుగుదేశం నేతలు అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనాకు టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇతర టీడీపీ నేతలు వినతి పత్రం అందజేస్తున్న ఫోటో ఒకటి జత చేసి షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, గ్రామ సచివాలయాలలో కాకుండా చెట్ల కింద నిర్వహించాలని టీడీపీ నేతలు ఎన్నికల సంఘాన్ని కోరారు.
ఫాక్ట్(నిజం): వచ్చే 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, గ్రామ సచివాలయాలలో కాకుండా చెట్ల కింద నిర్వహించాలని టీడీపీ నేతలు ఎన్నికల సంఘాన్ని కోరినట్లు ఎటువంటి సమాచారం లభించలేదు. అంతేకాకుండా, ఈ పోస్టులో షేర్ చేస్తున్న వైరల్ ఫోటో 12 అక్టోబర్ 2023న ఓటర్ల జాబితాకు సంబంధించిన అవకతవకల్లో గ్రామ/వార్డు వాలంటీర్ల పాత్రను పరిశీలించాలని టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలో టీడీపీ నేతలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేష్‌కుమార్ మీనాను వినతి పత్రాన్ని సమర్పించిన సందర్భంలో తీసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
వైరల్ క్లెయిమ్ గురించి మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి వెతకగా, వచ్చే 2024 ఎన్నికలను గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, గ్రామ సచివాలయాలలో కాకుండా చెట్ల కింద నిర్వహించాలని టీడీపీ నేతలు ఎన్నికల సంఘాన్ని కోరినట్లు ఎటువంటి సమాచారం లభించలేదు. ఒక వేళ టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి అలాంటి విన్నపం చేసి ఉంటే ఖచ్చితంగా పలు మీడియా సంస్థలు రిపోర్ట్ చేసి ఉండేవి.
తర్వాత మేము వైరల్ పోస్టులో షేర్ చేసినటువంటి ఫోటోకి సంబంధించిన సమాచారం కోసం, ఇంటర్నెట్‌లో గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతకగా 12 అక్టోబర్ 2023న “ది హిందూ” వార్తసంస్థ ప్రచురించిన వార్త కథనం లభించింది. ఈ వార్త కథనం ప్రకారం, వలంటీర్, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థల్ని ఉపయోగించి అధికార వైసీపీ తమకు అనుకూలంగా దొంగ ఓట్లు చేర్చే ప్రయత్నం చేస్తూ, ప్రతిపక్షాల ఓట్లను తొలగిస్తోంది అని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలో టీడీపీ నేతలు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేష్‌కుమార్ మీనాను అమరావతి సచివాలయంలో 12 అక్టోబర్ 2023న కలిసి ఫిర్యాదు చేశారు. ఈ వైరల్ ఫొటో ఆ సందర్భంలో తీసింది అని తెలిసింది.
పలు మీడియా సంస్థలు కూడా అక్టోబర్ 2023లో ఇదే విషయాన్ని పేర్కొంటూ కథనాలను ప్రచురించాయి (ఇక్కడ & ఇక్కడ). ఈ రిపోర్ట్స్ ప్రకారం, “రాష్ట్రంలో అధికార వైసీపీ పార్టీ చెప్పినట్లుగా వింటూ BLOలుగా ఉన్న సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు ఎలా నకిలీ ఓట్లను చేర్చిస్తున్నారనే దానిపై టీడీపీ నేతలుఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన పలు ఆధారాల్ని కూడా టీడీపీ నేతలు ఎన్నిక కమిషన్‌కి అందజేసి వీటిపై ఈసీ నిబంధనల ప్రకారం వెంటనే చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా కోరారు. వీటిపై క్షేత్రస్ధాయిలో ఉన్న అధికారులతో మాట్లాడతానని ముకేష్ కుమార్ మీనా చెప్పినట్లు తెలుస్తోంది”. అని తెలుస్తుంది. తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు 12 అక్టోబర్ 2023న ఇదే విషయాన్ని చెప్తూ తన X (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
చివరగా, 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, గ్రామ సచివాలయాలలో కాకుండా చెట్ల కింద నిర్వహించాలని టీడీపీ నేతలు ఎన్నికల సంఘాన్ని కోరినట్లు చెప్తున్న ఈ పోస్ట్ ఫేక్.