కార్తీక మాసం మొత్తం అరటి ఆకులో భోజనం చేసే అలవాటు ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ తన నివాసంలో నీటి కలువ (తామర) ఆకుపై భోజనం ఏర్పాటు చేసారని చెపుతూ, సోషల్ మీడియాలో నరేంద్ర మోదీ మరియు ఇర్ఫాన్ అలీ భోజనం చేస్తున్న ఫోటోలను పలువురు షేర్ చేస్తున్నారు (ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ).ఈ పోస్ట్ ప్రధాని మోదీ నైజీరియా, బ్రెజిల్ మరియు గయానాకు చెందిన మూడు దేశాల విదేశీ పర్యటన నేపథ్యంలో షేర్ చేయబడుతోంది ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కార్తీక మాసంలో అరటి ఆకులో భోజనం చేసే అలవాటు ఉండడంతో గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ తన నివాసంలో నీటి కలువ ఆకుపై భోజనం ఏర్పాటు చేశారు.
ఫాక్ట్(నిజం): గయానాలో ‘7 కర్రీ వంటకం’ నీటి కలువ ఆకుపై వడ్డించబడుతుంది.7 కర్రీ టూర్ ఒక సాంప్రదాయ ఇండో-గయానీస్ వంటకం. ఇది సాధారణంగా పెద్ద నీటి కలువ ఆకులో వడ్డించబడుతుంది, దీంట్లో ఏడు రకాల వెజిటేరియన్ కర్రీలు ఉంటాయి. ఈ వంటకం సింగింగ్ చెఫ్‌గా ప్రసిద్ధి చెందిన ఇయాన్ జాన్, అతని పార్టనర్ జెసికా హాట్ఫీల్డ్, తయారు చేశారు. గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ నరేంద్ర మోదీకి కలువ ఆకుపై భోజనం కార్తీక మాసం సందర్బంగా ఏర్పాటు చేయలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
గూగుల్ కీవర్డ్స్ ఉపయోగించి శోధించగా, X ప్లాట్‌ఫామ్‌లో 22 నవంబర్ 2024న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన ఒక పోస్ట్ లభించింది (ఆర్కైవ్). ఈ పోస్ట్‌లో, ప్రధాన మంత్రి మోదీ గయానాలో, అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ తన నివాసంలో 7 కూరల భోజనం వడ్డించినట్టు వివరించారు. నీటి కలువ ఆకుపై వడ్డించే ఈ భోజనం గయానాలో అపారమైన సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉందని, ఇది భారతదేశం మరియు గయానా మధ్య లోతైన మరియు శాశ్వతమైన సంబంధాన్ని హైలైట్ చేస్తుందని పేర్కొన్నారు. ప్రెసిడెంట్ ఇర్ఫాన్ అలీ మరియు గయానా ప్రజలు వారి ఆప్యాయత, ఆతిథ్యానికి మరోసారి ధన్యవాదాలు తెలపగా, ఈ పోస్ట్ లో చెప్పారు.
నరేంద్ర మోదీ X పోస్ట్ యొక్క వివరణలోని క్లూలను తీసుకుని వెతికితే, గయానా టూరిజం వెబ్సైట్‌లో “7 కర్రీ రీ-ఇమాజిన్‌డ్: ఏ సెవెన్ టూర్ విత్ ది సింగింగ్ చెఫ్” అనే శీర్షికతో ఒక పోస్ట్ లభించింది (ఆర్కైవ్). ఈ పోస్ట్ లో 7 కర్రీ ఒక సాంప్రదాయ ఇండో-గయానీస్ వంటకం అని, ఇది హిందూ మతపరమైన ఫంక్షన్లలో తయారుచేసి అందిస్తారని పేర్కొన్నారు. ఈ వంటకం సాధారణంగా ఒక పెద్ద నీటి కలువ ఆకులో వడ్డించబడుతుంది, ఏడు రకాల వెజిటేరియన్ కూరలతో ఉంటుంది. ఈ ప్రత్యేక వంటకం సింగింగ్ చెఫ్‌గా ప్రఖ్యాతి చెందిన ఇయాన్ జాన్, అతని పార్టనర్ జెసికా హాట్ఫీల్డ్, సింగింగ్ చెఫ్ అడ్వెంచర్ యజమానులైన వారు తయారు చేశారు అని మాకు తెలిసింది.

మా పరిశోధనలో, మేము 14 నవంబర్ 2020న డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్, గయానా YouTube ఛానెల్‌లో ప్రచురించిన ఒక వీడియోను కనుగొన్నాము (ఆర్కైవ్). ఈ వీడియోలో, గయానా టూరిజం అథారిటీ 2020 టూరిజం అవేర్‌నెస్ నెలలో భాగంగా “7 కర్రీ టూర్”ను పరిచయం చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ గయానా కమ్యూనికేషన్ ఆఫీసర్ నతాశా స్మిత్, “ది పెర్గోలా స్మోక్ హౌస్ కేఫ్” లో వడ్డించబడే కర్రీ గురించి ఇంటర్వ్యూ జరిగింది.
చివరిగా, గయానా సంప్రదాయం ప్రకారం తామర ఆకులో ఆహారం తింటున్న PM మోదీ ఫోటోలను కార్తీక మాసం సందర్భంగా గయానా అధ్యక్షుడి ఏర్పాట్లు అంటూ షేర్ చేస్తున్నారు.