Fake News, Telugu
 

ఈ ఫోటోలో జవహర్ లాల్ నెహ్రూ పార్థివ దేహం పక్కన నిలుచున్నది కంబోడియా బౌద్ధ గురువు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కాదు

0

జవహర్ లాల్ నెహ్రూ అంత్యక్రియలకు సుభాష్ చంద్రబోస్ హాజరైన దృశ్యం, అంటూ ఒక వార్తా పత్రిక ప్రచురించిన కథనం యొక్క ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సుభాష్ చంద్రబోస్ మాదిరిగా ఉన్న ఒక వ్యక్తి  జవహర్ లాల్ నెహ్రూ పార్థివ దేహం పక్కన నిలిచున్న చిత్రాన్ని ఈ వార్తా కథనం ప్రచురించింది. ఈ దృశ్యాలు నెహ్రూ అంత్యక్రియల డాక్యుమెంటరిలో బయటపడినట్టు ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: జవహర్ లాల్ నెహ్రూ అంత్యక్రియలకు సుభాష్ చంద్రబోస్ హాజరైన దృశ్యం.

ఫాక్ట్ (నిజం): ఈ ఫోటోలో జవహర్ లాల్ నెహ్రూ పార్థివ దేహం పక్కన నిలిచున్నది కంబోడియా బౌద్ధ గురువు వీర ధర్మవర మహాతెర, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కాదు. ఈ ఫోటోలో నెహ్రూ పక్కన నిలిచున్నది తానే అని వీర ధర్మవర మహాతెర జి డి ఖోస్లా కమిషన్‌కు స్పష్టం కూడా చేసారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 18 ఆగష్టు 1945 నాడు జపాన్ తైహోకు విమానాశ్రయంలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించినట్టు విశ్వసిస్తారు. అయితే, నేతాజీ మరణానికి సంబంధించి సందేహాలు వెలువెత్తడంతో, భారత ప్రభుత్వం నేతాజీ మరణంలో సత్యాలను వెలికితీయడానికి ఇప్పటివరకు మూడు కమిషన్లు ఏర్పాటు చేసింది. 2017లో ఒక RTI అభ్యర్ధనకు హోం మంత్రుత్వ శాఖ సమాధానమిస్తూ, సుభాష్ చంద్రబోస్ 18 ఆగష్టు 1945 నాడు తైహోకు విమానాశ్రయంలో జరిగిన ప్రమాదంలో మరణించినట్టు స్పష్టం చేసింది.  

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఈ ఫోటోలో జవహర్ లాల్ నెహ్రూ పార్థివ దేహం పక్కన నిలిచున్న వ్యక్తి వివరాలని తెలుపుతూ ప్రముఖ భారతీయ రచయిత మరియు మాజీ పాత్రికేయుడు అనుజ్ దార్ 2015లో ట్వీట్ పెట్టినట్టు తెలిసింది. ఈ ఫోటోలో జవహర్ లాల్ నెహ్రూ పార్థివ దేహం పక్కన నిలిచున్నది కంబోడియా బౌద్ధ గురువు వీర ధర్మవర మహాతెర అని, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కాదని అనుజ్ దార్ తన ట్వీట్లో తెలిపారు. ఈ ఫోటోపై స్పష్టతనిస్తూ అనుజ్ దార్ తన యూట్యూబ్ ఛానెల్లో ఒక వీడియోని కూడా పబ్లిష్ చేసారు.

సుభాష్ చంద్రబోస్ మరణ వార్తలలో నిజాలని వెలికి తీయడానికి భారత ప్రభుత్వం 1970లో ఏర్పాటు చేసిన జి డి ఖోస్లా కమిషన్, ఈ ఫోటోపై స్పష్టత కోసం వీర ధర్మవర మహాతెరను విచారించారు. జవహర్ లాల్ అంత్యక్రియల సమయంలో తాను నెహ్రూ పార్ధివ దేహం పక్కన నిలుచొని సంతాపం వ్యక్తం పరుస్తున్నప్పుడు మీడియా వారు వీడియోని చిత్రికరించారని వీర ధర్మవర మహాతెర ఖోస్లా కమిషన్‌కు తెలిపారు. ఈ విషయాన్నీ రిపోర్ట్ చేస్తూ పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

కంబోడియకు చెందిన బౌద్ధ గురువు వీర ధర్మవర మహాతెర 1999లో అమెరికాలో మరణించారు. ‘ది న్యూయార్క్ టైమ్స్’ వార్తా సంస్థ వీర ధర్మవర మహాతెర మరణ వార్తను రిపోర్ట్ చేస్తూ, భారత మొట్టమొదట  ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అంతక్రియలకు వీర ధర్మవర హాజరయినట్టు పేర్కొంది. వీర ధర్మవర మహాతెరకు సంబంధించిన మరింత సమాచారాన్ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటోలో నెహ్రూ పార్థివ దేహం పక్కన నిలిచున్నది కంబోడియా బౌద్ధ గురువు వీర ధర్మవర మహాతెర అని, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, ఈ ఫోటోలో జవహర్ లాల్ నెహ్రూ పార్ధివ దేహం పక్కన నిలుచున్నది కంబోడియా బౌద్ధ గురువు వీర ధర్మవర మహాతెర, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కాదు.

Share.

About Author

Comments are closed.

scroll