బంగ్లాదేశ్‌లో ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడి వారు చాలా మంది అస్సాం సరిహద్దు ద్వారా భారత్ లోకి చొరబడుతున్నారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ ఉంది. ఈ వీడియోలో సెక్యూరిటీ కంచెకి ఇరువైపులా అనేక మంది నిలబడిన ఉన్న దృశ్యాలు చూడొచ్చు. ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: బంగ్లాదేశ్ ఆందోళనల నేపథ్యంలో అక్కడి వారు చాలా మంది అస్సాం సరిహద్దు ద్వారా భారత్‌లోకి చొరబడుతున్న వీడియో.
ఫాక్ట్(నిజం): ఈ వీడియో బెంగాల్‌లోని భారత్ – బాంగ్లాదేశ్ సరిహద్దు వద్ద రెండు దేశ ప్రజలు కలుసుకోనే ఇండియా – బంగ్లాదేశ్ మిలన్ మేళా’ కార్యక్రమానికి సంబంధించింది. ప్రతీ సంవత్సరం బైసాఖి రోజున ఈ వేడుక జరుగుతుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొన్ని రోజులుగా హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ ఘర్షణలలో ఇప్పటికే అనేక మంది చనిపోయినట్టు వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి. ఈ క్రమంలో కొందరు బంగ్లాదేశీలు బెంగాల్ బోర్డర్ ద్వారా భారత్ లోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా BSF వారిని వెనక్కి పంపించినట్టు వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి (ఇక్కడ & ఇక్కడ).
ఐతే ఈ నేపథ్యంలో ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియోకు బంగ్లాదేశ్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులకు ఎలాంటి సంబంధం లేదు. ఈ వీడియో గత కొన్ని సంవత్సరాల నుండే ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియో స్క్రీన్ షాట్స్‌ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే వీడియో 2018లొనే యూట్యూబ్‌లో అప్లోడ్ చేసినట్టు తెలిసింది.
‘India Bangladesh Milan Mela’ అనే కాప్షన్‌తో ఈ వీడియోను అప్లోడ్ చేసారు. ఈ సమాచారం ఆధారంగా వెతకగా దొరకిన సమాచారం ప్రకారం ప్రతీ సంవత్సరం బైసాఖి రోజున బెంగాల్‌లోని భారత్ – బాంగ్లాదేశ్ బోర్డర్ వద్ద రెండు దేశ ప్రజలు కలుసుకోనే వేడుకను ‘ఇండియా – బంగ్లాదేశ్ మిలన్ మేళా’ అంటారు.
ఈ వేడుక ప్రతీ సంవత్సరం జరుగుతుంది. గతంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన వార్తా కథనాలు మరియు వీడియోలు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ చూడొచ్చు. ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియోలో కనిపిస్తున్నట్టు ఈ వీడియోలలో కూడా కంచెకి ఇరువైపులా ప్రజలు నిలబడి ఉండడం చూడొచ్చు. ఈ సమాచారాన్ని బట్టి ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియోకు బంగ్లాదేశ్‌లో ఇప్పుడు జరుగుతున్న ఆందోళనలకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టమవుతుంది.
చివరగా, బంగ్లాదేశీయులు భారత్‌లోకి చొరబడుతున్నారు అంటూ సంబంధంలేని పాత వీడియోలను షేర్ చేస్తున్నారు.