Fake News, Telugu
 

ఈ వీడియో బంగ్లాదేశ్‌లోని బ్రాహ్మణబారియా జిల్లాలో ఓ ముస్లిం కుటుంబం ఉరి వేసుకుని మరణించిన దృశ్యాలను చూపిస్తున్నది

0

ప్రసుత్తం బంగ్లాదేశ్‌లో నెలకొన్న హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో, “బంగ్లాదేశ్‌లో కేవలం హిందువులనే కారణంతో చిన్న పిల్లలతో సహా మొత్తం కుటుంబాన్నిఉరేసి చంపిన ముస్లింలు” అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ).ఈ వీడియోలో ఓ మహిళ, ఓ పురుషుడుతో పాటు ఇద్దరు చిన్నారుల చనిపోయి ఉరితాళ్లకు వేలాడుతూ ఉండటం మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: బంగ్లాదేశ్‌లో కేవలం హిందువులనే కారణంతో చిన్నపిల్లలతో సహా మొత్తం కుటుంబాన్ని అక్కడి ముస్లింలు ఉరేసి చంపారు, అందుకు సంబంధించిన దృశ్యాలు.

ఫాక్ట్(నిజం):ఈ వీడియోలోని దృశ్యాలు బంగ్లాదేశ్‌లోని బ్రాహ్మణబారియా జిల్లాలో ఓ ముస్లిం కుటుంబం ఉరివేసుకుని మరణించిన సంఘటనకు సంబంధించినవి. పలు బంగ్లాదేశ్ మీడియా సంస్థల కథనాల ప్రకారం, 28 జూలై 2024న బ్రాహ్మణబారియా జిల్లాలోని నబీనగర్ మున్సిపాలిటీ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు తమ ఇంట్లో శవమై కనిపించారు. మృతులను  సోహగ్ మియా, అతని భార్య జన్నతుల్ బేగం, వారి కుమార్తెలు ఫరియా, ఫాహిమా గుర్తించారు.  కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు

రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమాలతో కొద్ది నెలలుగా బంగ్లాదేశ్ అట్టుడికిపోతోంది. 1971 నాటి బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో పాల్గొన్న వారిని యుద్ధవీరులుగా బంగ్లాదేశ్‌లో పేర్కొంటారు. బంగ్లాదేశ్ ఏర్పాటు అనంతరం అక్కడి ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% యుద్ధవీరుల పిల్లలకు, వారసులకు రిజర్వ్ చేశారు. 2018లో ఈ రిజర్వేషన్లపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో షేక్ హసీనా ప్రభుత్వం వీటిని రద్దు చేసింది. కానీ, ఆ కోటాను పునరుద్ధరించాలని 2024 జూన్ ప్రారంభంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. బంగ్లా విముక్తి యుద్ధవీరుల వారసులకు ప్రభుత్వోద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లను పునరుద్ధరిస్తూ జూన్ 2024లో షేక్ హసీనా సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ యువత, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో రోడ్డెక్కారు. దాంతో జరిగిన భారీ ఆందోళనలు, ఘర్షణల్లో 200 మందికి పైగా మరణించారు. చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఈ రిజర్వేషన్లను 5 శాతానికి తగ్గించింది. కానీ, 200 మంది అమాయకుల మృతికి ప్రధాని హసీనా కారణమంటూ, ఆమె తప్పుకోవాలంటూ వారం రోజులుగా మళ్లీ నిరసనలు వెల్లువెత్తాయి. 03 & 04 ఆగస్ట్ 2024న, బంగ్లాదేశ్‌లో దేశవ్యాప్తంగా జరిగిన ఘర్షణల్లో 100 మందికి పైగా మరణించారు. దీంతో అక్కడ నిరవధిక కర్ఫ్యూ విధించారు. 05 ఆగస్టు 2024న, ఆందోళనకారులు ‘ఢాకా లాంగ్ మార్చ్’కు పిలుపునిచ్చారు, ఈ నేపథ్యంలో షేక్ హసీనా బంగ్లాదేశ్‌ను విడిచిపెట్టి భారతదేశానికి వచ్చారు. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి పారిపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఢాకాలోని ఆమె అధికారిక నివాసంలోకి ఆందోళనకారులు చొరబడి, లూటీ చేసి ధ్వంసం చేశారు (ఇక్కడఇక్కడ).

పలు రిపోర్ట్స్ ప్రకారం, ప్రస్తుతం జరుగుతున్న అల్లర్లలో కొన్ని చోట్ల నిరసనకారులు మైనారిటీలు, ముఖ్యంగా హిందువుల ఇళ్లు మరియు వ్యాపారాలపై దాడి చేసి వారి విలువైన వస్తువులను దోచుకున్నారని తెలుస్తుంది. అలాగే  హిందువుల ఇళ్లను, దేవాలయాలను ధ్వంసం చేయడం, తగులబెట్టడం వంటి సంఘటనలు జరుగుతున్నట్లు మరికొన్ని రిపోర్ట్స్ పేర్కొన్నాయి (ఇక్కడఇక్కడఇక్కడ).

ఇకపోతే ఈ వైరల్ క్లెయిమ్ కు సంబంధించిన సమాచారం కోసం తగిన బెంగాలీ కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, బంగ్లాదేశ్‌లో కేవలం హిందువులనే కారణంతో చిన్నపిల్లలతో సహా మొత్తం కుటుంబాన్ని అక్కడి ముస్లింలు ఉరేసి చంపినట్లు తెలిపే ఇలాంటి రిపోర్ట్స్ మాకు లభించలేదు. ఈ క్రమంలోనే, 28 జూలై 2024నా బంగ్లాదేశ్‌కు చెందిన “సకిల్ అహ్మద్ రూబెల్ (Sakil Ahmed Rubel)” అనే ఫేస్బుక్ పేజీ షేర్ చేసిన ఒక ఫోటో లభించింది. ఈ ఫోటో వివరణలో ప్రకారం, బ్రాహ్మణ్‌బారియాలోని నబీనగర్ మునిసిపాలిటీ పరిధిలోని విజయ్ పారా ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త సోహగ్ మియా అతని భార్య మరియు ఇద్దరు పిల్లల మృతదేహాలను వేలాడుతున్న స్థితిలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.(బెంగాలీ నుండి తెలుగులోకి అనువదించగా). ఈ ఫొటోలోనీ వ్యక్తుల ముఖాలను, మరియు వారి ఒంటిపై ఉన్న దుస్తులను, వైరల్ వీడియోలో ఉన్న వ్యక్తుల మొహాలు, దుస్తులతో పోల్చి చూస్తే, వైరల్ వీడియోలో మరియు ఈ ఫోటోలో ఒకే సంఘటనను చూపుతున్నాయని మనం నిర్ధారించవచ్చు. సకిల్ అహ్మద్ రూబెల్ తాను ఒక జర్నలిస్ట్ అని, మరియు అతడు నబీనగర్ ప్రాంతానికి చెందినవాడిగా ఫేస్బుక్ పేజీలో పేర్కొన్నారు.    

తదుపరి ఈ సమాచారం ఆధారంగా ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం తగిన బెంగాలీ కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, 28 జూలై 2024న పలు బంగ్లాదేశ్ మీడియా సంస్థలు పబ్లిష్ చేసిన వార్తకథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, బ్రాహ్మణబారియా జిల్లాలోని నబీనగర్ మున్సిపాలిటీ ప్రాంతంలో 28 జూలై 2024న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు తమ ఇంట్లో శవమై కనిపించారు. మృతులను  సోహగ్ మియా, అతని భార్య జన్నతుల్ బేగం, వారి కుమార్తెలు ఫరియా, ఫాహిమా గుర్తించారు. 

బ్రాహ్మణబారియా జిల్లా అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (నబీనగర్ సర్కిల్) సిరాజుల్ ఇస్లాం తెలిపిన మీడియాతో మాట్లాడుతూ,“సోహగ్ నబీనగర్ సదర్ ప్రాంతంలో బట్టల వ్యాపారి. 28 జూలై 2024 తెల్లవారుజామున ఇంట్లో నుంచి శబ్దం వినకపోవడంతో అనుమానం వచ్చిన ఇరుగుపొరుగు వారు ఇంటి తలుపులు పగులగొట్టి చూడగా సీలింగ్‌కు వేలాడుతూ కనిపించారు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు”.

అలాగే, ఈ సంఘటనను రిపోర్ట్ చేస్తూ పలు బంగ్లాదేశ్ మీడియా సంస్థలు వీడియో బుల్లెటిన్స్ ప్రసారం చేశాయి.(ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఈ వీడియోలలో ఉన్న ఇంటిని మరియు వైరల్ వీడియోలో కనిపుస్తున్న ఇల్లు ఒకేలా ఉండటం కూడా మనం గమనించవచ్చు.    

చివరగా, ఈ వీడియోలోని దృశ్యాలు బంగ్లాదేశ్‌లోని బ్రాహ్మణబారియా జిల్లాలో ఓ ముస్లిం కుటుంబం ఉరివేసుకుని మరణించిన సంఘటనకు సంబంధించినవి.

Share.

About Author

Comments are closed.

scroll