Fake News, Telugu
 

గతంలో వర్షం నీటికి ఇంట్లోకి కొట్టుకువచ్చిన చేపల వీడియోని ఇప్పుడు హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకు ముడి పెడుతున్నారు

0

ఇటీవల హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకు, చేపలు ఇంట్లోకి కొట్టుకు వచ్చాయి అని చెప్తూ, దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఇటీవల హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకు చేపలు ఇంట్లోకి కొట్టుకు వచ్చిన వీడియో.

ఫాక్ట్(నిజం): ఈ ఘటన వరంగల్ లో జరింగిందని, పాకిస్థాన్ లో జరిగిందని చెప్పే సోషల్ మీడియా పోస్టులు, యూట్యూబ్ వీడియోలు ఆగస్ట్ 2020 నుండే ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. దీన్నిబట్టి ఈ వీడియోకి, ఇప్పుడు హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకు సంబంధంలేదని కచ్చితంగా చెప్పొచ్చు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

‘టీవీ9 మరాఠీ’ న్యూస్ ఛానల్ వారు కూడా తమ ఫేస్బుక్ మరియు ట్విట్టర్ (ఆర్కైవ్) అకౌంట్లలో ఇదే వీడియోని ఇప్పుడు హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించినదిగా షేర్ చేసారు.

ఈ వీడియో గురించిన మరింత సమాచారం కొరకు యూట్యూబ్ లో కీ వర్డ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోని రిపోర్ట్ చేసిన ఒక న్యూస్ వీడియో కనిపించింది. ఈ వీడియో యూట్యూబ్ లో 25 ఆగస్ట్ 2020న అప్లోడ్ చేయబడింది. పైగా ఈ వీడియో వివరణ ప్రకారం ఈ ఘటన వరంగల్ లో జరిగింది. ఐతే ఈ ఘటన వరంగల్ లో జరింగిందని ధృవీకరించే వేరే వార్త కథనం గాని, న్యూస్ వీడియో రిపోర్టింగ్ గాని మాకు లభించలేదు. కాకపోతే వీడియో అప్లోడ్ చేసిన తేదీ ప్రకారం ఈ వీడియో ఇప్పుడు హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకు సంబంధించింది కాదని కచ్చితంగా చెప్పొచ్చు.

వరంగల్ లో జరిగిన ఘటనగా ఇదే వీడియో ని షేర్ చేసిన కొన్ని పాత సోషల్ మీడియా పోస్టులు, యూట్యూబ్ వీడియోలు మాకు కనిపించాయి. ఇంకా ఈ ఘటన పాకిస్తాన్ లో జరిగిందని చెప్పే యూట్యూబ్ వీడియోలు కూడా మాకు కనిపించాయి. వీటన్నిటి ఆధారంగా ఈ వీడియో కి హైదరాబాద్ లో ఇప్పుడు కురుస్తున్న వర్షాలకి సంబంధంలేదని చెప్పొచ్చు. 

ఇటీవల హైదరాబాద్ లో విస్తృతంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సంబంధంలేని ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ హైదరాబాద్ వర్షాలకు సంబంధించినవి అని చెప్తున్నారు.

చివరగా, గతంలో వర్షం నీటికి ఇంట్లోకి కొట్టుకువచ్చిన చేపల వీడియోని ఇప్పుడు హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించినదిగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll