Fake News, Telugu
 

ట్రాఫిక్ సిగ్నల్ పోస్ట్ వరద నీటిలో కొట్టుకుపోతున్న ఈ ఘటన జరిగింది చైనాలో, హైదరాబాద్ లో కాదు

0

హైదరాబాద్ లో ‘13 అక్టోబర్ 2020’  నాడు కురుసిన భారీ వర్షాలకి నగరంలోని చాలా ప్రదేశాలు వరదలతో నిండిపోయాయి. ఈ నేపధ్యంలోనే ఒక ట్రాఫిక్ సిగ్నల్ పోస్ట్ వరద నీటిలో కొట్టుకుపోతున్న దృశ్యాలు కలిగిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకున్నట్టు అందులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: హైదరాబాద్ వరద నీటిలో ట్రాఫిక్ సిగ్నల్ పోస్ట్ కొట్టుకుపోతున్న దృశ్యం.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో హైదరాబాద్ వరదలకి సంబంధించింది కాదు. 2018 లో సౌత్ చైనా లోని యులిన్ నగరంలో ఒక ట్రాఫిక్ సిగ్నల్ పోస్ట్ ఇలా వరదలలో కొట్టుకుపోయినప్పుడు తీసిన వీడియో ఇది, అని విశ్లేషణలో తెలిసింది. ఈ వీడియో భారత దేశానికి సంబంధించింది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియోని జాగ్రత్తగా గమనించగా, అందులో కనిపిస్తున్న షాపుల బోర్డుల పై అలాగే, బైక్ స్టికర్ల పై రాసి ఉన్న అక్షరాలు భారత దేశంలోని ఏ భాషకూ సంబంధించినవి కావని తెలిసింది. వీడియోలో కనిపిస్తున్న ఆ అక్షరాలు ఏ భాషకు సంబంధించినవి అని వెతకగా, అవి చైనా , తైవాన్ దేశాలలో వాడకంలో ఉన్న మాండరిన్ భాషకు సంబంధించిన అక్షరాలు అని తెలిసింది.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలు కలిగివున్న వీడియోని చైనా దేశానికి చెందిన  ‘CGTN’ న్యూస్ ఛానల్ ‘11 మే 2018’ నాడు యూట్యూబ్ లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. సౌత్ చైనా లోని యులిన్ నగరంలో ఒక ట్రాఫిక్ సిగ్నల్ పోస్ట్ ఇలా వరదలలో కొట్టుకుపోయినట్టు ఈ వీడియో వివరణలో తెలిపారు. ‘CGTN’ న్యూస్ ఛానల్ ఇదే వీడియోని తమ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసారు. ‘The Weather Channel’ న్యూస్ వెబ్ సైట్ కూడా ఈ వీడియోని షేర్ చేస్తూ సౌత్ చైనా లోని యులిన్ నగరంలో జరిగిన ఘటనగా వివరించారు.

హైదరాబాద్ నగరంలో ‘13 అక్టోబర్ 2020’ నాడు కురిసిన భారీ వర్షం దాటికి నగరంలో పలు చోట్ల వరదలు వచ్చిన వీడియోలు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

చివరగా, ట్రాఫిక్ సిగ్నల్ పోస్ట్ వరద నీటిలో కొట్టుకుపోతున్న ఈ ఘటన సౌత్ చైనా లోని యులిన్ నగరంలో చోటుచేసుకుంది, హైదరాబాద్ నగరంలో కాదు.

Share.

About Author

Comments are closed.

scroll