Fake News, Telugu
 

అపానవాయువు (ఫార్ట్) వదలడం వలన మొబైల్ ఫోన్ పేలిపోయిన దృశ్యాలను ఈ వీడియో చూపించడం లేదు

0

ఒక వ్యక్తి అపానవాయువు (ఫార్ట్) వదలడం వలన అతని వెనుక జేబులో పెట్టుకున్న మొబైల్ ఫోన్ పేలిపోయిందంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా షేర్ అవుతోంది. కౌంటర్ దగ్గర కూర్చున్న ఒక వ్యక్తి ప్యాంటులో నుండి మంటలు చెలరేగడంతో అతను తన ప్యాంట్ విప్పి మంటలకు దూరంగా వెళ్తున్న దృశ్యాలను మనం ఈ వీడియోలో చూడవచ్చు. మానవ అపానవాయువులోని హైడ్రోజెన్ మరియు మీథేన్ వాయువులు ఒక్క స్పార్క్‌తో మంటలు చెలరేగే అంత శక్తి కలిగి ఉంటాయని ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: అపానవాయువు వదలడం వలన మొబైల్ ఫోన్ పేలిపోయిన దృశ్యాలు

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో, 2020లో సౌత్ ఆఫ్రికా దేశంలోని టాంబో ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఘటనను చూపిస్తుంది. సౌత్ ఆఫ్రికా దేశంలోని టాంబో ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో ఒక వ్యక్తి, తన జేబులో పెట్టుకున్న పవర్ బ్యాంక్ పేలడంతో, ప్యాంటు విప్పి మంటలకు దూరంగా వెళ్ళి తనని తాను రక్షించుకున్న దృశ్యాలను ఈ వీడియో చూపిస్తుంది. బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే అపానవాయువులోని మీథేన్ మరియు హైడ్రోజన్ వాయువులు మండే గుణం కలిగి ఉంటాయనే విషయం వాస్తవం. కానీ, వీడియోలోని ప్రమాదం మానవ అపానవాయువు వలన చోటుచేసుకోలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.  

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘Independent’ వార్తా సంస్థ 09 మార్చి 2020 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. సౌత్ ఆఫ్రికా దేశంలోని టాంబో ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో ఒక వ్యక్తి, తన జేబులో పెట్టుకున్న ఎలక్ట్రానిక్ పరికరం పేలడంతో, ప్యాంటు విప్పి మంటలకు దూరంగా వెళ్ళి తనని తాను రక్షించుకున్న దృశ్యాలంటూ ఈ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.

టాంబో ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పబ్లిష్ చేసిన మారికొన్ని  న్యూస్ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ల్వాండో మాషియామహ్లే అనే వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ టికెట్ తీసుకోవడానికి వెళ్లడంతో ఆమె కోసం టికెట్ కౌంటర్ దగ్గర వేచిచూస్తుండగా, తన జేబులో పెట్టుకున్న పవర్ బ్యాంక్ పేలి మంటలు చెలరేగినట్టు ఈ వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. ఈ ప్రమాదానికి సంబంధించి ‘News 24’ వార్తా సంస్థతో ల్వాండో మాషియామహ్లే మాట్లాడుతూ, “నా జేబులో చాలా వేడిగా అనిపించింది. కానీ, అది సాధారణంగా ఫోన్ ఉపయోగిస్తున్నప్పుడు కలిగే వేడిగా పరిగణించాను. కానీ, అది పేలుతుందని నేను అనుకోలేదు”, అని తెలిపారు.   

బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే అపానవాయువులోని (ఫార్ట్) మీథేన్ మరియు హైడ్రోజన్ వాయువులు మండే గుణం కలిగి ఉంటాయని పలు మెడికల్ రిసెర్చ్ సంస్థలు స్పష్టం చేశాయి. పేగులలో ఏర్పడే ఈ మంట కలిగించే వాయువుల వలన కొన్ని ప్రేగు శస్త్రచికిత్సల సమయాలలో ప్రమాదాలు చోటుచేసుకున్నాయని పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి.

చివరగా, అపానవాయువు (ఫార్ట్) వదలడం వలన మొబైల్ ఫోన్ పేలిపోయిన దృశ్యాలను ఈ వీడియో చూపించడం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll