Fake News, Telugu
 

ఈ వీడియోలో కనిపిస్తున్న అగ్నిప్రమాదం మోటార్ సైకిల్‌ని గరిష్ట ఉష్టోగ్రతలో పార్క్ చేయడం వలన చోటుచేసుకోలేదు

0

గరిష్ట ఉష్టోగ్రతలో మోటార్ బైక్‌ని బయట పార్క్ చేయడం వలన జరిగిన ప్రమాదం యొక్క దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఒక ద్విచక్ర వాహనం ఇంధన ట్యాంకులో నీరు పోసిన వెంటనే అందులో నుండి భారీ మంటలు చెలరేగిన దృశ్యాలని మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఎండలో పార్క్ చేసిన బైక్‌పై నీరు పోస్తే, పెట్రోల్ ట్యాంక్ లోపల అధిక ఉష్టోగ్రత ఆవిరి అభివృద్ధి చెంది, వెంటనే ట్యాంక్ నుండి భారీ మంటలు చెలరేగుతాయని ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: గరిష్ట ఉష్టోగ్రతలో బైక్‌ని పార్క్ చేయడం వలన జరిగిన ఒక ప్రమాదం యొక్క దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): వీడియోలోని ఘటన ఇటీవల మహారాష్ట్రలోని నాలా సోపర అనే పట్టణంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదం జరిగే ముందు, వీడియోలో కనిపిస్తున్న ద్విచక్ర వాహనం ఒక సీఎన్‌జీ ఆటోని ఢీకొంది. ఆటోని ఢీకొన్న వెంటనే మోటార్‌సైకిల్ పెట్రోల్ ట్యాంక్‌ నుండి చిన్నపాటి మంటలు చెలరేగాయి. పెట్రోల్ ట్యాంక్‌ నుండి చెలరేగిన చిన్నపాటి మంటలను ఆర్పేందుకు వాహనదారుడు పెట్రోల్ ట్యాంకులో నీరు పోయడంతో, ఒక్క సారిగా భారీ మంటలు చెలరేగి పక్కనే ఉన్న ఆటో కూడా మంటలతో కాలిపోయింది. ఈ ప్రమాదం ద్విచక్ర వాహనాన్ని అధిక ఉష్టోగ్రతలో పార్క్ చేయడం వలన చోటుచేసుకోలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘NDTV’ జర్నలిస్ట్ సునీల్ కుమార్ సింగ్ 13 ఏప్రిల్ 2022 నాడు ట్వీట్ చేసినట్టు తెలిసింది. వీడియోలోని ఘటన మహారాష్ట్రలోని నాలా సోపర పట్టణంలో చోటుచేసుకుందని ఈ ట్వీట్లో తెలిపారు. మండుతున్న ఇంధన ట్యాంకుని తెరవడం వలన ఈ ప్రమాదం చోటుచేసుకుందని ఈ ట్వీట్లో తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలని రిపోర్ట్ చేస్తూ ‘NDTV’ వార్తా సంస్థ ఆర్టికల్ కూడా పబ్లిష్ చేసింది. ఈ ఆర్టికల్‌లో తెలిపిన వివరాల ప్రకారం, వీడియోలో కనిపిస్తున్న ద్విచక్ర వాహనం, ఈ అగ్ని ప్రమాదం జరిగే ముందు ఒక సీఎన్‌జీ ఆటోని ఢీకొంది. ఆటోని ఢీకొన్న వెంటనే మోటార్‌సైకిల్ పెట్రోల్ ట్యాంక్‌ నుండి చిన్నపాటి మంటలు చెలరేగినట్టు ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు. పెట్రోల్ ట్యాంక్‌ నుండి చెలరేగిన చిన్నపాటి మంటలను ఆర్పేందుకు, ఆ ద్విచక్ర వాహనదారుడు పెట్రోల్ ట్యాంకులో నీరు పోయడంతో, ఒక్క సారిగా భారీ మంటలు చెలరేగి పక్కనే ఉన్న ఆటో కూడా కాలిపోయినట్టు తెలిసింది. ఈ దుర్ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ అగ్నిప్రమాదం ద్విచక్ర వాహనాన్ని ఎండలో పార్క్ చేయడం వలన చోటుచేసుకోలేదు. ఈ ఘటనకి సంబంధించి పబ్లిష్ చేసిన మరికొన్ని న్యూస్ రిపోర్టులని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.  

గరిష్ట ఉష్టోగ్రతలలో వాహనాలని క్రమంగా బయట పార్క్ చేయడం వలన వాహనంపై యూవి కిరణాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనివలన, వాహనంపై వేసిన పెయింటింగ్ క్రమంగా పోవడం, మోటార్‌సైకిల్‌ ఉపకరణాలకు నష్టం కలగడం, వాహన టైర్లు పాడైపోవడం అలాగే, ఇంధన ట్యాంకు నుండి పెట్రోల్ ఆవిరి అవడం వంటి నష్టం జరుగుతుంది. పెట్రోల్ లేదా గ్యాసోలిన్ వంటి ఇంధనం వేడి కారణంగా ఆవిరైపోయే ధోరణిని కలిగి ఉంటుంది. ద్విచాక్రవాహనం లేదా మరే ఇతర వాహనమైన ఎక్కువ సమయం ఎండలో ఉంచితే, ఇంధన ట్యాంకులోని పెట్రోల్ త్వరగా ఆవిరైపోతుంది. అయితే, ఇంధన ట్యాంకుపై అమర్చిన మూతని ఒకవేళ పూర్తిగా ముసివేస్తే, ఇంధన ట్యాంక్ లోపల ఆవిరి ఒత్తిడి పెరిగి ట్యాంక్ ద్వంసమయ్యే అవకాశముంది. కానీ, ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఆధునిక వాహనాలలో, ఈ ప్రమాదం కలగకుండా ఉండేందుకు డిజైనర్లు, ఇంధన ట్యాంక్ మూత దగ్గర ‘ఇంధన ట్యాంక్ వెంట్‌’ని అమరుస్తున్నారు. ఇంధన ట్యాంకులో ఏర్పడిన ఆవిరైన అణువులను ఈ వెంట్‌ బయటకి పంపిస్తుంది.

చివరగా, ఈ వీడియోలో కనిపిస్తున్న అగ్నిప్రమాదం అధిక ఉష్టోగ్రతలో ద్విచక్ర వాహనాన్ని పార్క్ చేయడం వలన చోటుచేసుకోలేదు.

Share.

About Author

Comments are closed.

scroll