కొందరు వ్యక్తులు పోలీసులపై రాళ్లు రువ్వుతున్న ఒక వీడియోని షేర్ చేస్తూ, ఈ ఘటన ఇటీవల రాజస్తాన్‌లోని జైపూర్‌లో జరిగిందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకి సంబంధించిన నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: ఇటీవల రాజస్తాన్‌లోని జైపూర్‌లో పోలీసులపై కొందరు వ్యక్తులు రాళ్లు రువ్విన వీడియో.
ఫాక్ట్ (నిజం): ఈ వీడియో 2017లో జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో జరిగిన నిరసనలకు సంబంధించింది. ఈ నిరసనలలో, నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో కనీసం ఆరుగురు పోలీసులు గాయపడ్డారు. ఈ వీడియోకి రాజస్తాన్‌కి ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్స్‌ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే వీడియోని 2017లో షేర్ చేసిన ఒక ఫేస్‌బుక్ పోస్ట్ మాకు కనిపించింది. యూట్యూబ్‌లో కూడా ఈ వీడియో 2017 నుండి అందుబాటులో ఉంది. దీన్నిబట్టి, ఈ వీడియో ఇటీవల జరిగిన ఘటనకు సంబంధించింది కాదని స్పష్టమవుతుంది.
పోస్టులోని వైరల్ వీడియోను జాగ్రత్తగా గమనించినప్పుడు, వీడియోలో ‘Western Hosiery’ మరియు ‘Sathoo Furnishings’ అనే పేర్లతో రెండు షాపులను పక్క ప్రక్కనే చూడవచ్చు. ఈ షాపుల పేర్ల ఆధారంగా కీవర్డ్ సెర్చ్ చేయగా, ‘Western Hosiery’ పేరుతోని ఉన్న ఒక ఫేస్‌బుక్ పేజీలో వైరల్ వీడియోలో పక్క ప్రక్కనే కనిపిస్తున్న ఈ రెండు షాపుల ఫోటో కనిపించింది. ఐతే ఈ ఫేస్‌బుక్ పేజీలో ఉన్న వివరణ ప్రకారం, ఈ షాపులు జమ్మూ & కాశ్మీర్‌లోని అనంతనాగ్‌లోని లాల్ చౌక్ ప్రాంతంలో ఉన్నాయి. ‘Alstrong Enterprises India Pvt Ltd’ అనే ఫేస్‌బుక్ పేజీలో కూడా ఇదే ఫోటో కనిపించింది, ఈ పేజీలో కూడా ఈ షాపులు జమ్మూ & కాశ్మీర్‌లోని అనంతనాగ్‌లో ఉన్నట్టు పేర్కొన్నారు.
అలాగే వీడియోలో బాటా షోరూం పక్కన ‘VASCO PASCO’ పేరుతో ఒక షాపును చూడొచ్చు. ఐతే ‘జస్ట్ డయల్’ వెబ్‌సైట్‌లో ‘VASCO PASCO’ షాపు గురించి సమాచారం కోసం వెతకగా, ఈ షాపు కూడా అనంతనాగ్‌లోని లాల్ చౌక్‌లో ఉన్నట్లు తెలిసింది.
పైన తెలిపిన వివరాల ఆధారంగా యూట్యూబ్‌లో వెతకగా వైరల్ వీడియోలోని విజువల్స్‌ని రిపోర్ట్ చేసిన ఒక 2017 వార్తా కథనం మాకు లభించింది. ఈ కథనం ప్రకారం ఈ వీడియో మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింల మారణహోమానికి వ్యతిరేకంగా జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో జరిగిన నిరసనలకు సంబంధించింది. ఈ నిరసనలలో, నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో కనీసం ఆరుగురు పోలీసులు గాయపడ్డారు. దీన్నిబట్టి, ఈ వీడియోకి రాజస్తాన్‌కి ఎటువంటి సంబంధంలేదని, ఈ వీడియో కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో 2017లో జరిగిన ఘటనకి సంబంధించిందని స్పష్టమవుతుంది.
చివరగా, 2017లో జమ్మూకాశ్మీర్‌లోని అనంతనాగ్‌లో పోలీసులపై జరిగిన రాళ్ల దాడికి సంబంధించిన వీడియోని ఇప్పుడు రాజస్తాన్‌లో జరిగిన ఘటనదంటూ షేర్ చేస్తున్నారు.