Fake News, Telugu
 

కొలంబియాలో జరిగిన పాత ఘర్షణ వీడియోని భారత జవాన్లతో నాగాలాండ్ పౌరులు ఘర్షణకు దిగిన దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

సైనికులపై నాగాలాండ్ నాగాల అరాచకాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. జవాన్లతో కొంతమంది ఘర్షణకు దిగుతున్న దృశ్యాలని ఈ వీడియోలో మనం చూడవచ్చు. నాగాలాండ్‌లో ఇటీవల భారత జవాన్లకు, అక్కడి పౌరులకు మధ్య హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్న నేపథ్యంలో, ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఈ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: భారత జవాన్లతో నాగాలాండ్ పౌరులు ఘర్షణకు దిగుతున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో, 2018లో కొలంబియా దేశం కౌకా ప్రాంతంలో స్థానిక తిరుగుబాటు దారులు కొలంబియా సైన్యంతో ఘర్షణకు దిగిన దృశ్యాలని చూపిస్తుంది. ఈ వీడియోకి నాగాలాండ్‌లో ఇటీవల భారత జవాన్లకు సామాన్య పౌరులకు మధ్య చోటుచేసుకున్న ఘర్షణలకు ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘Cable News’ సంస్థ 05 జనవరి 2018 నాడు తమ యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేసినట్టు తెలిసింది. కొలంబియా దేశం కౌకా ప్రాంతంలోని కోరింటో పట్టణంలో, స్థానిక ప్రజలు సైన్యంతో ఘర్షణకు దిగిన దృశ్యాలని ఈ వీడియో వివరణలో తెలిపారు.

ఈ వివరాల ఆధారంగా వీడియోలోని ఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం వెతకగా, ఇవే దృశ్యాలు కలిగిన ఫోటోలని షేర్ చేస్తూ ‘Elpais.com’ అనే వార్తా సంస్థ 05 జనవరి 2018 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. నార్త్ కౌకా డిపార్టుమెంట్ ప్రాంతంలోని కోరింటో పట్టణంలో స్థానిక ప్రజలకు, కొలంబియా సైనికులకు మధ్య సాయుధ ఘర్షణ చోటుచేసుకుందని ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు. ఈ ఆర్టికల్‌లో తెలిపిన సమాచారం ప్రకారం, కోరింటోలోని ఒక చెరుకు మిల్లుపై సుమారు 50 మంది స్థానిక తిరుగుబాటుదారులు దాడి చేసి, ఆ మిల్లులోని యంత్రాలని స్వాధీనం చేసుకున్నారు. పరిస్థితులని అదుపుచేయడానికి వచ్చిన సైన్యంతో ఆ స్థానిక తిరుగుబాటుదారులు ఘర్షణకు దిగినట్టు ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు. ఈ ఘర్షణలో ఎవరికీ గాయాలవలేదని కొలంబియా సైన్యం తరువాత మీడియాకి స్పష్టం చేసింది.

ఈ ఘర్షణకు సంబంధించి 2018లో పబ్లిష్ చేసిన మరికొన్ని న్యూస్ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో పాతదని, నాగాలాండ్‌లో ఇటీవల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలకు సంబంధించినది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, కొలంబియా దేశంలో జరిగిన ఒక పాత ఘర్షణ వీడియోని భారత జవాన్లతో ఇటీవల నాగాలాండ్ పౌరులు ఘర్షణకు దిగిన దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll