Fake News, Telugu
 

‘టిబెట్‌లో మేఘం నేలపై ఒరిగింది’ అంటూ షేర్ చేస్తున్న ఈ వీడియోలో కనిపిస్తున్నది ఒక ఇసుక తుఫాను

0

టిబెట్‌లో మేఘం నేలపై ఒరిగింది, దీనివల్ల వాహనాలు నిలిచిపోయాయి, అద్భుతమైన దృశ్యం”, అని చెప్తూ ఒక పోస్ట్‌ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: టిబెట్‌లో మేఘం నేలపై ఒరిగింది. ఆ వింతను వీడియోలో చూడవచ్చు.

ఫాక్ట్: వీడియోలో కనిపించేది నేలపై ఒరిగిన మేఘం కాదు. అది ఒక ఇసుక తుఫాను. కావున, పోస్ట్‌లో చెప్పింది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్ట్‌లోని వీడియో యొక్క స్క్రీన్‌షాట్స్‌ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో వెతకగా, ఆ వీడియో ఎప్పటినుండో ఇంటర్నెట్‌లో వివిధ ప్రదేశాల పేర్లతో షేర్ అవుతున్నట్టు తెలిసింది. అది చైనాలోని షింజియాంగ్‌లో తీసిన వీడియో అని కొందరు 2018లో పోస్ట్ చేసినట్టు ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు. అయితే, ఆ వీడియోని ఎక్కడ తీసారనే ఖచ్చితమైన సమాచారం మాకు లభించలేదు. కానీ, ఆ వీడియోలో కనిపించేది నేలపై ఒరిగిన మేఘం కాదని, అది ఒక ఇసుక తుఫానని 2018లోనే వివిధ మీడియా సంస్థలు వార్తలు ప్రచురించినట్టు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

ఇలాంటి ఇసుక తుఫానులు వింతేమి కావు. ఇలాంటి ఇసుక తుఫానులు ప్రపంచంలోని వివిధ ప్రదేశాల్లో వస్తూ ఉంటాయి. రాజస్థాన్ రాష్ట్రంలో 2019లో ఇలాంటి ఒక ఇసుక తుఫాను వచ్చినప్పుడు తీసిన వీడియోని ఇక్కడ చూడవచ్చు.

ఇసుక తుఫానులకు సంబంధించిన మరింత సమాచారం ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

చివరగా, ‘టిబెట్‌లో మేఘం నేలపై ఒరిగింది’ అంటూ పోస్ట్‌లో షేర్ చేస్తున్న వీడియోలో కనిపిస్తున్నది ఒక ఇసుక తుఫాను.

Share.

About Author

Comments are closed.

scroll