CAA మరియు NRC కి వ్యతిరేకంగా ఇండియా గేట్ వద్ద ప్రియాంక గాంధీ చేపట్టిన నిరసనలో ‘క్యాబ్ తీసేయండి, భరత్ ని ముస్లిం దేశం చేయండి’ (‘कैब हटाओ, इस देश को मुस्लिम राष्ट्र बनाओ’) అని హిందీలో రాసి ఉన్న ప్లకార్డు కనపడిందని చెప్తూ ఒక ఫోటోని చాలా మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్: ప్రియాంక గాంధీ చేపట్టిన నిరసనలో ‘క్యాబ్ హఠావో ఇస్ దేశ్ కో ముస్లిం దేశ్ భనావో’ ప్లకార్డు.
ఫాక్ట్ (నిజం): ఫోటోలోని ప్లకార్డు ఫోటోషాప్ చేయబడింది. ఒరిజినల్ ప్లకార్డు మీద ‘लाठी-गोली नहीं, रोजगार-रोटी दो’ (లాఠీ మరియు బులెట్లు కాదు, ఉద్యోగాలు మరియు రోటీ ఇవ్వండి) అని రాసి ఉంటుంది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ చేసిన ఫోటోలో వెనకాల కూర్చున ఒక మహిళ చేతిలో ‘ముస్లిం దేశ్ భనావో’ ప్లకార్డు ఉన్నట్టు చూడవొచ్చు. ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే ఫోటో ఇంటర్నెట్ లో దొరకలేదు. కానీ, ఆ నిరసన కార్యక్రమం యొక్క మిగితా ఫోటోలు సెర్చ్ రిజల్ట్స్ లో వచ్చాయి. ‘UNI’ వెబ్ సైట్ వారు ప్రచురించిన ఫోటోలో, అదే మహిళ ప్లకార్డు పట్టుకున్నట్టుగా చూడవొచ్చు. కానీ, ఆ ప్లకార్డు పై ‘लाठी-गोली नहीं, रोजगार-रोटी दो’ (లాఠీ మరియు బులెట్లు కాదు, ఉద్యోగాలు మరియు రోటీ ఇవ్వండి) అని రాసి ఉన్నట్టు చూడవొచ్చు. ఈ ఫోటో కేవలం వేరే కోణం నుండి తీయబడింది. ఆ మహిళ పక్కన కూర్చున్న మనుషులు రెండు ఫోటోలలో ఒక్కళ్ళే ఉండడం చూడవొచ్చు. అంతేకాదు, ‘The Print’ వారు ప్రచురించిన ఫోటోలో కూడా ఆ మహిళ ‘లాఠీ మరియు బులెట్లు కాదు, ఉద్యోగాలు మరియు రోటీ ఇవ్వండి’ అంటూ ప్లకార్డు పటుకున్నట్టు చూడవొచ్చు.
ప్రియాంక గాంధీ చుట్టుపక్కల కూర్చున వారి ఎవరి చేతిలో కూడా పోస్ట్ లో చెప్పిన ‘క్యాబ్ హఠావో ఇస్ దేశ్ కో ముస్లిం దేశ్ భనావో’ ప్లకార్డు కనపడలేదు.
చివరగా, ఫోటోషాప్ చేయబడిన ప్లకార్డు ఫోటో పెట్టి, ప్రియాంక గాంధీ చేపట్టిన నిరసనలో ‘ముస్లిం దేశ్ భనావో’ ప్లకార్డు అని తప్పుగా ప్రచారం చేస్తున్నారు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?