Fake News, Telugu
 

బెంగాల్‌లో ప్రేమను అంగీకరించలేదన్న కారణంతో అమ్మాయిపై బ్లేడ్‌తో దాడి చేసిన వార్తను మతపరమైన కోణంతో తప్పుగా షేర్ చేస్తున్నారు

0

‘బెంగాల్‌లో ప్రేమను ఒప్పుకోలేదని హిందూ మహిళపై బ్లేడ్‌తో దాడి చేసిన ముస్లిం వ్యక్తి’ అంటూ ఈ ఘటనకి సంబంధించిన ఫోటోలు షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తకి సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: బెంగాల్‌లో ప్రేమను ఒప్పుకోలేదని హిందూ మహిళపై బ్లేడ్‌తో దాడి చేసిన ముస్లిం వ్యక్తి.

ఫాక్ట్ (నిజం): బెంగాల్‌ అలీపుర్‌ద్వార్ జిల్లాలోని ఫలకటలో ఒక వ్యక్తి తన ప్రేమను అంగీకరించలేదన్న కారణంతో ఫలకట కాలేజీలో చదువుతున్న ఒక అమ్మాయిపై కాలేజీ ఎదుటే బ్లేడ్‌తో దాడి చేసాడు. ఐతే ఈ ఘటనలో గాయపడ్డ అమ్మాయి, దాడి చేసిన అబ్బాయి ఇద్దరు ఒకే మతానికి (ముస్లిం) చెందినవారే. పోలీసులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ ఘటనకి సంబంధించిన సమాచారం కోసం గూగుల్‌లో వెతకగా ఈ ఘటనను రిపోర్ట్ చేసిన పలు వార్తా కథనాలు మాకు కనిపించాయి. ఈ కథనాల (ఇక్కడ మరియు ఇక్కడ) ప్రకారం, ఈ ఘటన బెంగాల్‌ అలీపుర్‌ద్వార్ జిల్లాలోని ఫలకటలో జరిగింది. ఫజాద్దీన్ హుస్సేన్ అనే వ్యక్తి తన ప్రేమను అంగీకరించలేదన్న కారణంతో ఫలకట కాలేజీలో చదువుతున్న ఒక అమ్మాయిపై కాలేజీ ఎదుటే బ్లేడ్‌తో దాడి చేసాడు.

దాడి చేసిన వ్యక్తి కూచ్‌బెహార్‌కు చెందిన ఫజాద్దీన్ హుస్సేన్‌గా గుర్తించినట్లు, తన ప్రపోజల్‌ను అమ్మాయి తిరస్కరించినందున అమ్మాయిపై దాడి చేసినట్టు అతను అంగీకరించినట్టు అలీపుర్‌ద్వార్ ఎస్పీ భోలానాథ్ పాండే చెప్పినట్లు టెలిగ్రాఫ్ పేర్కొంది.

ఈ ఘటనను ఇతర వార్తా సంస్థలు కూడా రిపోర్ట్ చేసాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ). ఐతే, ఏ కథనంలో కూడా గాయపడ్డ అమ్మాయి హిందూ అని గాని, దాడిలో మతపరమైన కోణం ఉన్నట్టు రిపోర్ట్ చేయలేదు.

బూమ్ అనే ఫాక్ట్- చెకింగ్ సంస్థ (ఇక్కడ) ఫలకట పోలీస్, సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్‌ని సంప్రదించగా, ఈ ఘటనలో గాయపడ్డ అమ్మాయి, దాడి చేసిన అబ్బాయి ఇద్దరు ఒకే మతానికి (ముస్లిం) చెందిన వారని తెలిపారు. ఈ విషయమై FACTLY కూడా సంబంధిత అధికారులను సంప్రదించింది, వారి నుండి స్పందన రాగానే ఈ ఆర్టికల్ అప్డేట్ చేయబడుతుంది.

ఐతే ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల ముందే ఇదే ప్రాంతంలో ఇలాంటిదే ఇంకో ఘటన జరిగింది. తన ప్రేమను అంగీకరించలేదన్న కారణంతో పదవ తరగతి చదువుతున్న ఒక అమ్మాయిని స్వపన్ అనే వ్యక్తి చంపేసాడు. ఐతే ఘటనలో చనిపోయిన అమ్మాయి, దాడి చేసిన అబ్బాయి ఇద్దరు ఒకే మతానికి (హిందూ) చెందిన వారు (ఇక్కడ మరియు ఇక్కడ).

చివరగా, బెంగాల్‌లో ప్రేమను అంగీకరించలేదన్న కారణంతో అమ్మాయిపై బ్లేడ్‌తో దాడి చేసిన వార్తను మతపరమైన కోణంతో తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll