ఒక వీడియో ని ఫేస్బుక్ లో పోస్టు చేసి, లాక్ డౌన్ వల్ల కాలుష్యం తగ్గడం తో మంచుకొండల్లో బ్రహ్మకమలాలు విరగబూసాయని చెప్తున్నారు. పోస్టులో చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: లాక్ డౌన్ వల్ల కాలుష్యం తగ్గడంతో మంచుకొండల్లో విరగబూసిన బ్రహ్మకమలాల వీడియో.
ఫాక్ట్ (నిజం): పోస్టులోని వీడియో పాతది, అది ఇంటర్నెట్ లో కనీసం 2017 నుండి ఉన్నట్లుగా తెలిసింది. అంతేకాదు, బ్రహ్మకమలాలు ప్రతి ఏటా విరబూస్తాయి. కావున, పోస్టు లో చెప్పింది తప్పు.
యూట్యూబ్ లో కీవర్డ్స్ తో వెతికినప్పుడు, పోస్టులోని వీడియో లభించింది. కానీ, ఆ వీడియో ని 10 డిసెంబర్ 2017 న యూట్యూబ్ లో అప్లోడ్ చేసినట్టుగా ఉంది. అంటే, ఆ వీడియో భారత దేశం లో లాక్ డౌన్ అమలు అవడానికంటే ముందుది.
బ్రహ్మ కమలం (లేదా సౌసురియా ఓబ్వల్లాట) ఉత్తరాఖండ్ రాష్ట్ర పుష్పం. ‘ENVIS Centre on Floral Diversity’ వెబ్‌సైట్ ప్రకారం, బ్రహ్మ కమలాలు జమ్మూ కాశ్మీర్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తరించి ఉన్న హిమాలయాల యొక్క ఆల్పైన్ పచ్చిక భూములలో పెరుగుతాయి. ఆ పుష్పాలు భూటాన్, చైనా, నేపాల్ మరియు పాకిస్తాన్ దేశాలలో 3700 నుండి 4600 మీటర్ల ఎత్తైన ప్రదేశాలలో కూడా కనిపిస్తాయి. బ్రహ్మ కమలాలు సాధారణంగా ప్రతి సంవత్సరం జూన్ – సెప్టెంబర్ సమయంలో వికసిస్తాయి. బ్రహ్మ కమలం గురించి మరింత సమాచారాన్ని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
చివరగా, పాత వీడియోని పెట్టి, ‘లాక్ డౌన్ వల్ల కాలుష్యం తగ్గడంతో మంచుకొండల్లో విరగబూసిన బ్రహ్మకమలాలు’ అని తప్పుగా షేర్ చేస్తున్నారు.
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?