Fake News, Telugu
 

కట్నం కోసం జరిగిన గృహ హింస ఘటన వీడియోని తప్పుడు లవ్ జిహాద్ కోణంతో షేర్ చేస్తున్నారు

0

లవ్ జిహాద్ బాధితురాలుకి చెందిన ఒక వీడియో అంటూ, ఓ వ్యక్తి ఓ మహిళను కర్రతో దారుణంగా కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను షేర్ చేసిన పోస్ట్ ప్రకారం, ఆ వ్యక్తి ఒక ముస్లిం. ఈ కథనం ద్వారా ఈ క్లైములోని వాస్తవాలను తనిఖీ చేద్దాం.

క్లెయిమ్: ఒక ముస్లిం వ్యక్తి తన హిందూ భార్యను కర్రతో దారుణంగా కొట్టిన దృశ్యాలు. 

ఫాక్ట్(నిజం): వీడియోలోని సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాలో జరిగింది. శివమ్ యాదవ్ అనే వ్యక్తి తన భార్య జ్యోతిపై వరకట్నం కోసం దాడి చేశాడు. ఈ సంఘటనలో లవ్-జిహాద్ కోణం ఉన్నట్లు ఎటువంటి ఆధారం లేదు. కావున, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పు.

క్లెయిమ్‌ను పరిశోధించడానికి, వైరల్ వీడియో నుండి కొన్ని కీ ఫ్రేమ్‌లను ఉపయోగించి ఇంటర్నెట్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. సెర్చ్ రిజల్ట్స్ లో ఈ వీడియో కలిగి ఉన్న ఒక ట్వీట్‌కు దారితీసింది. ఈ ట్వీట్ ప్రకారం, వీడియోలో సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాలో జరిగింది. ఈ సమాచారాన్ని తీసుకొని, సంబంధిత కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతికగా, ఈ సంఘటనపై ప్రచురింపబడిన కొన్ని వార్తా కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ).

కథనాల ప్రకారం, బకేవార్ ప్రాంతంలోని నహరియా గ్రామానికి చెందిన శివం యాదవ్, వరకట్నం కోసం అతని భార్య జ్యోతిపై దాడి చేశాడు. జ్యోతి, శివంలకి ఐదేళ్ల క్రితం హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగిందని జ్యోతి తల్లి మున్నీ దేవి తెలిపారు. సంఘటన గురించి తెలుసుకొన్న తర్వాత, మున్నీ దేవి నహరియా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు.

7 జూన్ 2023న, ఎటావా పోలీసులు సంఘటన గురించి తెలియజేసే ఒక ట్వీట్‌కు స్పందిస్తూ, వారు నిందితుడిని త్వరగా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. అదనంగా, ETV Bharatతో Etawah జిల్లా రురల్ SP సత్యపాల్ సింగ్ మాట్లాడుతూ, నిందితుడు శివంపైన, తన కుటుంబ సభ్యులపైనా కేసు నమోదు చేసారని, ప్రస్తుతం శివం పరారీలో ఉన్నాడని తెలిపారు.

ఇంతే కాక, ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు, జ్యోతి యాదవ్ మీడియాకు స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. వరకట్న సమస్యలు, వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో శివం తనను కొట్టినట్లు ఆమె తన వాంగ్మూలంలో పేర్కొంది. ఈ సంఘటనపై ప్రచురింపబడిన వార్త కథనాల్లో ఎక్కడా కూడా, ఈ సంఘటనలో లవ్ జిహాద్ కోణం ఉంది అని లేదు. బకేవార్ పోలీస్ స్టేషన్ SHO Factlyతో మాట్లాడుతూ, శివం యాదవ్ పైన కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ వివరాల ఆధారంగా, లవ్ జిహద్‌కి ఈ సంఘటనకి దీనికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టమవుతుంది.

చివరిగా, కట్నం కోసం గృహ హింస ఘటనకు చెందిన వీడియోని తప్పుడు లవ్ జిహాద్ కోణంతో షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll