Fake News, Telugu
 

ఈ వీడియోలో పోలీసులతో వాదిస్తున్న అమ్మాయి డ్రగ్స్ తీసుకొని లేదు అని పోలీసులు స్పష్టం చేసారు

0

“కోరమంగళలో డ్రగ్ అడిక్ట్ కేసు*! మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన కన్న కూతుర్ని సరి చేయడం తమ వల్ల కాదని పోలీసులకు స్వయంగా అప్పగించిన తల్లిదండ్రులు.!” అని చెబుతూ తనని చుట్టుముట్టిన కొందరు పోలీసులని తంతున్న ఒక అమ్మాయి వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ వీడియోలో పోలీసులు ఆ అమ్మాయిని పట్టుకోవడానికి ప్రయత్నించడం మనం చూడవచ్చు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

క్లెయిమ్: బెంగళూరులోని కోరమంగళలో మాదకద్రవ్యాల వ్యసనానికి గురైన ఒక అమ్మాయిని పోలీసులు అదుపు చేస్తున్న దృశ్యాలు. ఈ అమ్మాయిని పోలీసులకి తన తల్లిదండ్రులు అప్పగించారు. 

ఫాక్ట్(నిజం): ఈ సంఘటన మంగళూరులో జరిగింది బెంగళూరులో కాదు. 2023 సెప్టెంబర్ నెలలో మంగళూరు నగరంలోని గణేశా మెడికల్స్ దగ్గర ఒక అమ్మాయి దూకుడుగా వ్యవహారిస్తుంటే, తను మాదక ద్రవ్యాలు సేవించింది అనే సందేహంతో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తనని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించగా వారితో వాదించింది. ఈ విషయమై మంగళూరు సిటీ పోలీస్ వారు వివరణ ఇస్తూ, తనని హాస్పిటల్‌లో టెస్ట్ చెయ్యగా, ఎటువంటి మాదక ద్రవ్యాలు తీసుకోలేదు అని టెస్టులో తెలిసింది అని చెప్పారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు. 

వీడియో గురించి మరిన్ని వివరాలని తెలుసుకోవటానికి తగిన కీ  వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఈ వీడియో 2023 సెప్టెంబర్ నెలలో మంగళూరులో జరిగిన ఒక సంఘటనకి చెందినది అని తెలిసింది (ఇక్కడ, ఇక్కడ

ఇక వివరాల్లోకి వెళితే, 1 సెప్టెంబర్ 2023 నాడు మంగళూరు పట్టణంలోని గణేశా మెడికల్స్‌లో ఒక అమ్మాయి దూకుడుగా ప్రవర్తిస్తుంది అని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి మెసేజ్ వెళ్లగా, వారు అక్కడికి వెళ్లి, తను మాదక ద్రవ్యాలు తీసుకుంది అనే సందేహంతో టెస్ట్ చేయడానికి ఆస్పత్రికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తే ప్రతిఘటించి పోలీసులతో వాదించింది. ఆ దృశ్యాలనే మనం వీడియోలో చూడొచ్చు.

కానీ, తర్వాత తనని ఆస్పత్రికి తీసుకెళ్లి టెస్ట్ చేయగా, పరీక్షలో నెగిటివ్ రిజల్ట్ వచ్చింది అని, తర్వాత ఆ అమ్మాయిని తన తల్లిదండ్రులకు అప్పగించారని మంగళూరు నగరం పోలీసు వారు X(ఒకప్పటి ట్విట్టర్) ద్వారా వివరణ ఇచ్చారు. ఇంతే కాక, ఆ అమ్మాయి డ్రగ్ అడిక్ట్ అని పోలీసు వారు ఈ వివరణలో ఎక్కడ కూడా చెప్పలేదు. 

చివరిగా, మంగళూరులో ఒక అమ్మాయి పోలీసులతో దూకుడుగా వ్యవహరించిన దృశ్యాలని తప్పుడు కథనంతో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll