Fake News, Telugu
 

పాత ర్యాలీ వీడియోని దేవేంద్ర ఫడణవీస్ మద్దతుదారులు ఇటీవల ముంబై నగరానికి తరలివెళుతున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

బీజేపీ నేత మరియు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి  దేవేంద్ర ఫడణవీస్ మద్దతుదారులు భారీ కార్ ర్యాలీ నిర్వహిస్తూ ముంబై నగరానికి తరలివస్తున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. శివసేన-బీజేపీ కూటమి ప్రభుత్వంలో దేవేంద్ర ఫడణవీస్‌ని ఉప ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడాన్ని నిరసిస్తూ ఫడణవీస్‌ మద్దతుదారులు ఈ  ర్యాలీ నిర్వహించినట్టు పోస్టులో తెలుపుతున్నారు. అంతేకాదు, ఈ వీడియోని కొందరు హైదరాబాదులో ఇటీవల బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభకు జోడిస్తూ సోషల్ మీడియాలో తప్పుగా షేర్ చేస్తున్నారని ఈ పోస్టులో తెలిపారు.  ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: దేవేంద్ర ఫడణవీస్‌ మద్దతుదారులు భారీ కార్ ర్యాలీ నిర్వహిస్తూ ముంబై నగరానికి తరలివస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో కనీసం 2021 నవంబర్ నెల నుండి ఇంటర్నెట్లో షేర్ అవుతుంది. వీడియోలో కనిపిస్తున్న ర్యాలీ ఇటీవల మహారాష్ట్రలో శివసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరిగలేదు. అలాగే, ఈ వీడియోకి హైదరాబాదులో ఇటీవల బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభకు ఎటువంటి సంబంధం లేదు.  కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.    

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోలు కనీసం 2021 నవంబర్ నెల నుండి ఇంటర్నెట్లో షేర్ అవుతునట్టు తెలిసింది. ఆ వీడియోలని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. బీజేపీ భారీ ర్యాలీ దృశ్యాలంటూ ఈ వీడియో వివరణలలో ఆ యూసర్లు తెలిపారు.

25 నవంబర్ 2021 నాడు ఒక యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోని షేర్ చేస్తూ, బీజేపీ నాయకుడు నరేంద్ర భాటి ఢిల్లీ ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో భారీ ర్యాలీ నిర్వహించిన దృశ్యాలంటూ వివరణలో తెలిపారు. కాని, ఈ విషయాన్నీ దృవికరిస్తూ ఇంటర్నెట్లో మాకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు.

శివసేన-బీజేపీ కూటమిలో దేవేంద్ర ఫడణవీస్‌ని ఉప ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం పట్ల నాగపూర్ బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కొన్ని వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి. కాని, వారందరూ తమ ఆగ్రహాన్ని మౌన నిరసనల రూపంలో మాత్రమే వ్యక్తపరిచినట్టు ఈ వార్తా పత్రికలు స్పష్టం చేసాయి. దేవేంద్ర ఫడణవీస్‌కు మద్దతు పలుకుతూ అతను మద్దతుదారులు ముంబైకి ర్యాలీగా తరలివెల్లినట్టు ఏ ఒక్క వార్తా పత్రిక రిపోర్ట్ చేయలేదు. పోస్టులో షేర్ చేసిన వీడియో ఎక్కడిదో స్పష్టంగా తెలియనప్పటికీ, పై వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది అని, దేవేంద్ర ఫడణవీస్‌ మద్దతుదారుల ర్యాలీ దృశ్యాలు కావని ఖచ్చితంగా చెప్పవచ్చు. 

ఈ వీడియోని ఇటీవల బీజేపీ విజయ సంకల్ప సభకు సంబంధించినదిగా సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు, ఫ్యాక్ట్‌లీ దానికి సంబంధించి ఫాక్ట్-చెక్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది.

చివరగా, పాత ర్యాలీ వీడియోని దేవేంద్ర ఫడణవీస్‌ మద్దతుదారులు ఇటీవల భారీ కార్ ర్యాలీ నిర్వహిస్తూ ముంబై నగరానికి తరలివెళుతున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll