Fake News, Telugu
 

జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాలలో ఇప్పటివరకు హిందువులు మంత్రులుగా పనిచేయలేదని చేస్తున్న క్లెయిమ్ తప్పు

0

గత 70 ఏళ్లుగా జమ్మూ కాశ్మీర్ లో హిందులెవ్వరూ మంత్రి పదవిలో పనిచెయ్యలేదు అంటూ షేర్ చేస్తున్న ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బీహార్ మంత్రివర్గంలో ఒక్క ముస్లిం మంత్రి కూడా లేరని కొందరు చేసిన కామెంట్లకు బదులుగా ఈ పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: గత 70 ఏళ్లుగా కాశ్మీర్ లో హిందులెవ్వరు మంత్రి పదవిలో పనిచెయ్యలేదు.

ఫాక్ట్ (నిజం): జమ్మూ కాశ్మీర్ భారత దేశంలో విలీనమైన్నప్పటి నుంచి నెలకొల్పిన రాష్ట్ర ప్రభుత్వాలలో హిందువులు కూడా మంత్రులుగా పనిచేసారు. గత 70 ఏళ్లుగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పనిచేసిన ముఖ్యమంత్రులలో హిందువులు లేరన్న మాట వాస్తవం. కానీ, జమ్మూ కాశ్మీర్ లో ఇప్పటివరకు నెలకొల్పిన ప్రభుత్వాలలో  చాలా మంది హిందువులు మంత్రులుగా పనిచేసారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయిమ్ కి సంబంధించిన వివరాల కోసం వెతికితే, జమ్మూ కాశ్మీర్ భారత దేశంలో వీలినమైనప్పటి నుండి చాలా మంది హిందువులు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వాలలో మంత్రులుగా పనిచేసినట్టు తెలిసింది. వారిలో ప్రముఖ కాంగ్రెస్ నేత దుర్గ ప్రసాద్ దార్ కూడా ఉన్నారు. 1948లో షేక్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు దుర్గ ప్రసాద్ దార్ హోం సెక్రటరీ, ఆ తరువాత డిప్యూటీ హోం మంత్రి పదవులలో పనిచేసారు.

2005 నుండి 2008 మధ్య కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ జమ్మూ & కాశ్మీర్ ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు చాలా మంది హిందువులు అయన మంత్రివర్గంలో మంత్రులుగా చేసారు. మంగత్ రామ్ శర్మ, తారా చాంద్ లాంటి కాంగ్రెస్ నాయకులు జమ్మూ & కాశ్మీర్ ఉప ముఖ్యమంత్రులుగా చేసారు.

2015లో PDP-BJP జమ్మూ కాశ్మీర్ లో నెలకొల్పిన ప్రభుత్వంలో చాలా మంది బిజెపి లీడర్లు మంత్రి పదవులని స్వీకరించారు. బలి భాగాట్, ప్రియ సేథి, సునీల్ కుమార్ శర్మ, లాల్ సింగ్ చౌదరి, మొదలగు హిందూ లీడర్లు PDP-BJP ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసారు. వీరు కాకుండా ఇంకా చాలా మంది హిందువులు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసినట్టు తెలిసింది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఇప్పటివరకు నెలకొల్పిన ప్రభుత్వాలలో హిందువులెవ్వరు ముఖ్యమంత్రి అవలేదన్న మాట వాస్తవం. కాని, గత 70 సంవత్సరాలలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వాలలో చాలా మంది హిందువులు మంత్రులుగా పని చేసారు.

ఇటివలే, బీహార్ రాష్ట్రంలో NDA కూటమి పార్టిలు ప్రభుత్వాన్ని నెలకొల్పింది. JDU అధినేత నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. NDA కూటమి పార్టిలు బీహార్ లో నెలకొల్పిన ఈ ప్రభుత్వ కాబినెట్ లో ముస్లింలు ఎవరికీ చోటు దక్కలేదు.

చివరగా, 2020 బీహార్ మంత్రివర్గంలో ఒక్క ముస్లింకి కూడా చోటు దక్కకపోవడం నిజం అయ్యినప్పటికీ, గత 70 ఏళ్లుగా జమ్మూ కాశ్మీర్ లో హిందువులెవ్వరూ మంత్రి పదవిలో లేరనేది అబద్ధం.

Share.

About Author

Comments are closed.

scroll