Fake News, Telugu
 

కర్ణాటకలో హిజాబ్‌కి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల నేపథ్యంలో శ్రీలంకలో జరిగిన పాత ర్యాగింగ్ వీడియోని షేర్ చేస్తున్నారు

0

కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో హిజాబ్ అనుకూల, వ్యతిరేక నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొందరు అబ్బాయిలు బుర్ఖా ధరించిన స్త్రీలపై బకెట్లతో నీళ్ళు జల్లుతున్న వీడియోని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్  అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకి సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: కర్ణాటక హిజాబ్ వివాదం నేపథ్యంలో అబ్బాయిలు బుర్ఖా ధరించిన స్త్రీలపై బకెట్లతో నీళ్ళు జల్లుతున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియో 2019లో శ్రీలంకలోని ఈస్టర్న్ యూనివర్సిటీలో జరిగిన ర్యాగింగ్‌కి సంబంధించింది. శ్రీలంకకు చెందిన పలు స్థానిక వార్తా సంస్థలు ఈ వీడియోని రిపోర్ట్ చేసాయి. పలు శ్రీలంక సోషల్ మీడియా పేజీలు కూడా ఈ వీడియోని ఈస్టర్న్ యూనివర్సిటీకి ఆపాదిస్తూ షేర్ చేసాయి. ఐతే కర్ణాటకలో ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్తితుల నేపథ్యంలో ఇలాంటి వీడియోలను షేర్ చేయడం వల్ల సమాజంలో ఉద్రిక్తలకు దారితీసే అవకాశం ఉంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ వీడియో పాతది, ఇంకా ఈ వీడియోకి, భారత దేశానికి ఎటువంటి సంబంధంలేదు. వీడియోలోని దృశ్యాలు శ్రీలంకలోని ఒక కాలేజీలో జరిగిన ర్యాగింగ్‌కి సంబంధించినవి.

వైరల్ వీడియోకి సంబంధించిన సమాచారం కోసం కీవర్డ్ సెర్చ్ చేయగా శ్రీలంకకు చెందిన ఒక మీడియా సంస్థ 2019లో తమ యూట్యూబ్‌ ఛానల్‌లో ఇదే వీడియోని ఈస్టర్న్ యూనివర్సిటీకి ఆపాదిస్తూ అప్లోడ్ చేసింది. ఈ వార్తా సంస్థ ఈ వీడియోని రిపోర్ట్ చేసిన కథనం ఇక్కడ చూడొచ్చు.

ఇదే వీడియోని శ్రీలంకలోని ఈస్టర్న్ యూనివర్సిటీలో జరిగిన ర్యాగింగ్ అంటూ షేర్ శ్రీలంకకు చెందిన లంక సన్ న్యూస్ అనే మరొక మీడియా సంస్థ తమ ఫేస్‌బుక్‌ పేజీలో 2019లోనే  షేర్ చేసిన వీడియో ఇక్కడ చూడొచ్చు.

ఇదే వీడియోని 2019లో ఈస్టర్న్ యూనివర్సిటీకి ఆపాదిస్తూ షేర్ చేసిన ఫేస్‌బుక్‌ పోస్టులు మరియు యూట్యూబ్‌ వీడియోలు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. వీటన్నిటిబట్టి ఈ వీడియోకి భారత్‌కు సంబంధంలేదని స్పష్టమవుతుంది. గతంలో కూడా ఈ వీడియో వైరల్ అయినప్పుడు FACTLY ఈ వీడియోని డీబంక్ చేస్తూ రాసిన కథనం ఇక్కడ చూడొచ్చు.

ప్రస్తుతం కర్ణాటకలో విద్యార్థులు హిజాబ్ అనుకూల, వ్యతిరేక నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నిరసనలో భాగంగా మాండ్యాలో ఒక విద్యార్థి హిజాబ్ ధరించి కాలేజీ రావడంతో, కాషాయ కండువాలు ధరించిన కొందరు విద్యార్థులు ఆ అమ్మాయిని హిజాబ్ తీసేయలంటూ నినాదాలు చేస్తూ అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీని నేపథ్యంలోనే పోస్టులో షేర్ చేసిన లాంటి వీడియోలు వైరల్ అవుతున్నాయి.

కర్ణాటకలో హిజాబ్‌కి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు, రిపోర్ట్ అవుతున్న ఘటనల నేపథ్యంలో భారత్‌కు సంబంధంలేని వీడియోలు షేర్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోలు భారతదేశానికి చెందినవని పోస్ట్ క్లెయిమ్ చేయనప్పటికీ ప్రస్తుత సందర్భంలో ఇవి సమాజంలో ఉద్రిక్తలకు దారితీసే అవకాశం ఉంది.

చివరగా, కర్ణాటకలో హిజాబ్‌కి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల నేపథ్యంలో శ్రీలంకలో జరిగిన పాత ర్యాగింగ్ వీడియోని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll