Fake News, Telugu
 

హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి వీడియోలో చెప్పిన బిల్ ను ప్రవేశపెట్టింది మోదీ ప్రభుత్వం కాదు

0

బ్రేకింగ్ న్యూస్…హిందూ దేవాలయాలను ప్రభుత్వ పరిపాలన నుండి స్వేచ్చ ఇచ్చే బిల్ పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన మోడీ ప్రభుత్వం’ అని చెప్తూ, ‘Times Now’ వారి న్యూస్ వీడియోని సోషల్ మీడియా లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: హిందూ దేవాలయాలను ప్రభుత్వ పరిపాలన నుండి స్వేచ్చ ఇచ్చే బిల్ పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన మోదీ ప్రభుత్వం.

ఫాక్ట్ (నిజం): వీడియోలో చెప్పిన బిల్ ని లోక్ సభ లో ప్రవేశ పెట్టింది మోదీ ప్రభుత్వం కాదు. అది ఒక ప్రైవేట్ మెంబెర్ బిల్. దానిని బీజేపీ కి చెందిన ఎంపీ (మంత్రి కాదు) సత్యపాల్ సింగ్ లోక్ సభ లో 22 నవంబర్ 2019 న ప్రవేశ పెట్టాడు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు. 

పోస్ట్ లోని వీడియో గురించి కీ-వర్డ్స్ తో వెతకగా, అదే వీడియోని (ఫుల్ వీడియోని) ‘Times Now’ వారు 22 నవంబర్ 2019 న తమ ఫేస్బుక్ అకౌంట్ లో పోస్ట్ చేసినట్టుగా చూడవొచ్చు. కావున, పోస్ట్ లో చెప్పినట్టు అది ఇప్పటి ‘బ్రేకింగ్ న్యూస్’ కాదు; అదొక పాత న్యూస్

వీడియోలో చెప్పింది సరిగ్గా వింటే, ఆ బిల్ ని లోక్ సభ లో ప్రవేశ పెట్టింది బీజేపీ ఎంపీ సత్యపాల్ సింగ్ మరియు అది ఒక ప్రైవేట్ మెంబెర్ బిల్ అని తెలుస్తుంది. మంత్రులు కాకుండా ఇతర ఎంపీలు ఎవరైనా, ఏ పార్టీ కి చెందిన వారైనా (సాధారణ బీజేపీ ఎంపీలు కూడా) బిల్ ప్రవేశపెడితే దాన్ని ప్రైవేట్ మెంబెర్ బిల్ అంటారు. బీజేపీ ఎంపీ సత్యపాల్ సింగ్ మంత్రి కాదు కాబట్టి, తను ప్రవేశపెట్టిన బిల్ కూడా ప్రైవేట్ మెంబెర్ బిల్ అవుతుంది. ఇదే విషయాన్ని లోక్ సభ వెబ్సైటులో కూడా చూడవొచ్చు. కావున, ఆ బిల్ ని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టలేదు. ఆ బిల్ ని ‘The Constitution (Amendment) Bill, 2019’ పేరుతో లోక్ సభ లో 22 నవంబర్ 2019 న సత్యపాల్ సింగ్ ప్రవేశ పెట్టాడు. ఆ బిల్ ని ఇక్కడ చదవొచ్చు.

హిందూ దేవాలయాలకు సంబంధించి మరొక బిల్ ని రాజ్యసభలో బీజేపీ ఎంపీ అజయ్ ప్రతాప్ సింగ్ ప్రవేశ పెట్టాడు. అయితే, అది కూడా ఒక ప్రైవేట్ మెంబెర్ బిల్ మాత్రమే. ఆ బిల్ ని ఇక్కడ చదవొచ్చు.

చివరగా, హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి వీడియోలో చెప్పిన బిల్ ను ప్రవేశపెట్టింది మోదీ ప్రభుత్వం కాదు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll