Fake News, Telugu
 

జిన్నా ఫొటోని తొలగించాలన్న హిందూ మహాసభ డిమాండ్‌పై అలీఘర్ ముస్లిం యూనివర్సిటి ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు

0

అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో ఇటీవల గణతంత్ర దినోత్సవం రోజున మతపరమైన నినాదాలు చేసినందుకు ఒక విద్యార్ధిని సస్పెండ్ చేసిన నేపథ్యంలో, “అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో మహమ్మద్ అలీ జిన్నా ఫొటోను తొలగించి, దాని స్థానంలో వీర్ సావర్కర్ చిత్ర పటాన్ని ఆవిష్కరించిన హిందూ మహాసభ సభ్యులు”, అని చెప్తూ ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో మహమ్మద్ అలీ జిన్నా ఫొటోను తొలగించి, దాని స్థానంలో వీర్ సావర్కర్ చిత్ర పటాన్ని ఆవిష్కరించిన హిందూ మహాసభ సభ్యులు.

ఫాక్ట్: 29 జనవరి 2023 నాడు అఖిల భారత హిందూ మహాసభకు చెందిన కొందరు సభ్యులు అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో ఉన్న మహమ్మద్ అలీ జిన్నా ఫొటోను తొలగించి సావర్కర్ చిత్ర పటాన్ని ఏర్పాటు చేయాలని వస్తుండగా వారిని అలీఘర్ పోలీసులు మద్రక్ టోల్ ప్లాజా వద్దు అడ్డుకొని వారితో మాట్లాడి, వారి నుంచి మెమోరాండం తీసుకొని అక్కడినుంచి పంపించారు. జిన్నా ఫొటోని వెంటనే యూనివర్సిటీ నుంచి తొలగించాలని హిందూ మహాసభ సభ్యులు యూనివర్సిటీ నిర్వాహకులకు అల్టిమేటం జారీ చేశారు. అయితే, యూనివర్సిటీ దీని పైన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కావున పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా, ఈ విషయం గురించి ఇంటర్నెట్లో వెతకగా Navbharat Times, ABP Live, Zee News తదితర వార్తా సంస్థలు ఈ ఘటునకు సంబంధించి ప్రచురించిన కథనాలు లభించాయి. ఈ కథనాల ప్రకారం, 29 జనవరి 2023 నాడు అఖిల భారత హిందూ మహాసభకు చెందిన కొందరు సభ్యులు అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో ఉన్న మహమ్మద్ అలీ జిన్నా ఫొటోను తొలగించి సావర్కర్ చిత్ర పటాన్ని ఏర్పాటు చేయాలని వస్తుండగా వారిని అలీఘర్ పోలీసులు మద్రక్ టోల్ ప్లాజా వద్దు అడ్డుకొని వారితో మాట్లాడి, వారి నుంచి మెమోరాండం తీసుకొని అక్కడినుంచి పంపించారు.

హిందూ మహాసభ సభ్యులు మాట్లాడుతూ, జిన్నా ఫొటో ఉండటం వలన విద్యార్ధులలో తీవ్రవాద లక్షణాలు ఏర్పడే ప్రమాదం ఉందని, అందువలన జిన్నా ఫొటోని వెంటనే యూనివర్సిటీ నుంచి తొలగించి సావర్కర్ ఫొటోని ఏర్పాటుచేయాలని యూనివర్సిటీ నిర్వాహకులకు 72 గంటల అల్టిమేటం జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే,  మతపరమైన నినాదాలు చేసిన విద్యార్ధుల పైన మరింత కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అయితే యూనివర్సిటీలో ఉన్న మహమ్మద్ అలీ జిన్నా ఫొటోను తొలగించినట్లు ఇప్పటివరకు యూనివర్సిటీ నిర్వాహకులు కానీ, మీడియా కానీ ఎక్కడా రిపోర్ట్ చేయలేదు. పైగా యూనివర్సిటీలో జిన్నా ఫోటోని తొలగించాలని 2018 నుంచే అనేక ఆందోళనలను జరుగుతున్నాయి.

చివరిగా, అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో జిన్నా ఫోటోని తొలగించాలని హిందూ మహాసభ డిమాండ్ చేసినప్పటికీ, యూనివర్సిటీ నిర్వాహకులు దానిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.

Share.

About Author

Comments are closed.

scroll