Fake News, Telugu
 

1616లో ఈస్ట్ ఇండియా కంపెనీ అయ్యప్ప స్వామి బొమ్మ కలిగిన నాణేలను ముద్రించినట్టు ఎటువంటి ఆధారాలు లేవు

0

‘406 సంవత్సరాల క్రితం 1616వ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు విడుదల చేసిన అయ్యప్ప స్వామి బొమ్మ కలిగిన ఒక అణా నాణెము’ అని చెప్తూ దీనికి సంబంధించిన ఫోటోను షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: 1616లో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు విడుదల చేసిన అయ్యప్ప స్వామి  బొమ్మ కలిగిన నాణెం ఫోటో.

ఫాక్ట్(నిజం): ఈస్ట్ ఇండియా కంపెనీ వారు హిందూ దేవుళ్ళ రూపంలో నాణేలను ముద్రించినట్లు ఎటువంటి సమాచారం లేదు. RBIలో ఉన్న సమాచారం ప్రకారం క్రీ.శ. 1717లో మొదటిసారి ఆంగ్లేయులు బొంబాయి మింట్‌లో మొఘల్ రాజ్యానికి సంబంధించిన నాణేలను ముద్రించడానికి చక్రవర్తి ఫరూక్సియార్ నుండి అనుమతి పొందారు. అంటే పోస్టులో క్లెయిమ్ చేస్తున్నట్టు 1616లో ఈస్ట్ ఇండియా కంపెనీ అయ్యప్ప నాణెం ముద్రించే అవకాశం లేదు. కాకపోతే మొఘల్ రాజు అక్బర్ సీతా రాముడి రూపాలు ఉన్న నాణేలను ముద్రించినట్టు పలు కథనాలు ఉన్నాయి. కాని అయ్యప్ప నాణేలు ముద్రించినట్టు మాత్రం ఆధారాలు లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

మొఘల్ కాలం నాటి నుండి భారతదేశంలో చలామణిలో ఉన్న నాణేలకు సంబంధించిన సమాచారం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఐతే RBIలో అందుబాటులో ఉన్న సమాచారంలో ఎక్కడా కూడా మొఘలులు కాని బ్రిటీష్ వారు కాని అయ్యప్ప రూపంతో నాణేలు ముద్రించినట్టు సమాచారం లేదు.

RBIలో ఉన్న సమాచారం ప్రకారం క్రీ.శ. 1717లో మొదటిసారి ఆంగ్లేయులు బొంబాయి మింట్‌లో మొఘల్ రాజ్యానికి సంబంధించిన నాణేలను ముద్రించడానికి చక్రవర్తి ఫరూక్సియార్ నుండి అనుమతి పొందారు. 1830 కల్లా ఆంగ్లేయుల ఆధిపత్యం పెరిగిపోయి సొంతంగా నాణేలు ముద్రించడం మొదలుపెట్టారు. ఆ తరవాత 1835లో నాణేల ముద్రణకు సంబంధించి చట్టాన్ని చేశారు. దీన్నిబట్టి 1616లో ఈస్ట్ ఇండియా కంపెనీకి నాణేలు ముద్రించే స్వతంత్ర అధికారం లేదని అర్ధం చేసుకోవచ్చు. ఆ కాలంలో అందుబాటులో ఉన్న పలు నాణేలను కింద చూడవచ్చు.

అక్బర్ సీతారాముల నాణేలు ముద్రించాడు :

ఐతే అంతకుముందు మొఘల్ రాజు అక్బర్ సీతారాముల బొమ్మలతో నాణేలు ముద్రించాడని పలు కథనాలు ఉన్నాయి (ఇక్కడ మరియు ఇక్కడ). 19వ శతాబ్దం ప్రారంభంలో మద్రాసు ప్రెసిడెన్సీలో ఆలయ గోపురం మరియు విష్ణువు రూపంలో నాణేలు ముద్రించారని సమాచారం ఉంది. కాని అయ్యప్ప రూపంతో ఉన్న నాణేలను ముద్రించినట్టు ఎటువంటి సమాచారం లేదు.

ఐతే కాయిన్ క్వెస్ట్ మొదలైన సంస్థలు పురాతన నాణేల పేరుతో దేవుళ్ళ రూపం నాణేలు ముద్రించి విక్రయిస్తున్నాయి. ఇవి కేవలం నకిలీ నాణేల కాని నిజంగా పాత కాలం బ్రిటీష్ వారు ఇలాంటి నాణేలు ముద్రించలేదని వారి వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. హిందూ దేవుళ్ళ రూపంలో ఉన్న కొన్ని రాగి నాణేలు ఈ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండడం ఇక్కడ చూడొచ్చు. వైరల్ అవుతున్న అయ్యప్ప నాణెం కూడా ఇలాంటి ఒక నకిలీ నాణెం అయ్యుండొచ్చు.

చివరగా, 1616లో ఈస్ట్ ఇండియా కంపెనీ అయ్యప్ప స్వామి బొమ్మ కలిగిన నాణెలను ముద్రించినట్టు ఎటువంటి సమాచారం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll