ఖలిస్థాన్ వేర్పాటువాదులను రైతులుగా గుర్తిస్తున్న ప్రతిపక్షాలు మరియు అమ్ముడుపోయిన మీడియా అంటూ ఒక ఫోటోతో ఉన్న పోస్టును సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఖలిస్థాన్ వేర్పాటువాదులను రైతులుగా గుర్తిస్తున్న ప్రతిపక్షాలు మరియు అమ్ముడుపోయిన మీడియా; దానికి సంబంధించిన ఫోటో.
ఫాక్ట్: ఈ ఫోటో 2015లో లండన్‌లో తీసింది. ఖలిస్థాన్ వేర్పాటువాద అనుకూల సంస్థ దాల్ ఖాల్సా యుకే గ్రూప్ భారతదేశానికి వ్యతిరేకంగా యుకేలో నిర్వహించిన ర్యాలీకి సంబంధించిన ఫోటో ఇది. దీనికి, ఇటీవలో కాలంలో రైతులు చేసిన నిరసనలకు సంబంధం లేదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అటువంటి ఫోటో ఒకటి స్టాక్ ఫోటో వెబ్సైటు alamy లో లభించింది. ఈ ఫోటోను 15 ఆగష్టు 2015న లండన్‌లో తీసారని తెలిపారు. ఖలిస్థాన్ వేర్పాటువాద అనుకూల సంస్థ దాల్ ఖాల్సా యుకే గ్రూప్ ఒకటి భారతదేశానికి వ్యతిరేకంగా యుకేలో నిర్వహించిన ర్యాలీకి సంబంధించిన ఫోటో ఇది. ఆ ర్యాలీకి సంబంధించిన విజువల్స్ దాల్ ఖాల్సా యుకే యూట్యూబ్ ఛానల్‌లో అప్లోడ్ చేసిన వీడియోలో చూడొచ్చు. కావున, ఈ ఫోటో పాతది, ఇటీవల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలకు సంబంధించింది కాదు.
అయితే, ఖలిస్థాన్ వేర్పాటువాద అనుకూల సంస్థలపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దర్యాప్తును ముమ్మరం చేయబోతోందని ఒక ఆర్టికల్‌లో తెలిపారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలలో ఖలిస్థానీ మద్దతుదారులు కొంతమంది ఉన్నారని జనవరి 2021లో అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ సుప్రీంకోర్టుకు తెలిపారు.
చివరగా, లండన్‌లో ఖలిస్థానీ ర్యాలీకి సంబంధించిన పాత ఫోటోను పట్టుకొని ఖలిస్థాన్ వేర్పాటువాదులను రైతులుగా గుర్తిస్తున్న ప్రతిపక్షాలు అంటూ షేర్ చేస్తున్నారు.