Fake News, Telugu
 

తమిళనాడులోని కలత్తూరు గ్రామంలో దేవాలయాల్లో పూజలను నిషేధించాలని డిఎంకే నాయకులు పిటిషన్ ధాఖలు చేసినట్టుగా షేర్ చేస్తున్న ఈ పోస్ట్ తప్పు

0

తమిళనాడు రాష్ట్రం పేరంబాలూరు జిల్లాలోని కలత్తూరు గ్రామంలో హిందూ ఆలయాలలో నిర్వహించే పూజలు ఇస్లాం మత ఆరాధన విధానాలకు విరుద్ధంగా ఉన్నందున వాటిని నిషేధించాలని స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే ప్రభుత్వంలో మంత్రులుగా పని చేస్తున్న మస్తాన్, నాజర్‌లు ఇటీవల హైకోర్టులో వ్యాజ్యం ధాఖలు చేసినట్టు సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మెజారిటీ హిందువులు ఇలాగే ఆలోచించివుంటే, మీ గతి ఏంటని ముస్లింలని ఉద్దేశిస్తూ హైకోర్టు ఈ వ్యాజ్యాన్ని కొట్టిపారేసినట్టు పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: తమిళనాడులోని కలత్తూరు గ్రామంలో దేవాలయాలలో పూజలను నిషేధించాలని ప్రస్తుత డిఎంకే ప్రభుత్వంలోని ముస్లిం మంత్రులు పిటిషన్ ధాఖలు చేస్తే, హైకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టిపారేసింది.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియోని మలయాళం వార్తా సంస్థ ‘Karma News’ 10 మే 2021 నాడు పబ్లిష్ చేసింది. కలత్తూరు గ్రామంలో హిందూ ఊరేగింపు వేడుకలను ముస్లింలు నివసిస్తున్న వీధుల నుండి వెళ్ళకుండా ఆంక్షలు విధిస్తూ 2018 డిసెంబర్ నెలలో ఇచ్చిన తీర్పుని కొట్టిపారేస్తూ మద్రాసు హైకోర్టు 30 ఏప్రిల్ 2021 నాడు తీర్పు ప్రకటించింది. భారత దేశం ఒక సెక్యులర్ దేశమని, ఒక మత సమూహం నిర్ధిష్ట ప్రాంతంలో మెజారిటీగా ఉన్నంత మాత్రాన మిగిలిన మతాల వారు ఆ ప్రాంతంలో పండగ ఊరేగింపు జరపకూడదని ఆదేశించే అధికారం ఎవ్వరికీ ఉండదని మద్రాసు హైకోర్టు తమ తీర్పులో వెల్లడించింది. తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం రాకముందే ఈ తీర్పు ప్రకటించబడింది. అలాగే, కలత్తూరు గ్రామంలో హిందూ దేవుళ్ళ ఊరేగింపులకు వ్యతిరేకంగా ధాఖలైన వ్యాజ్యలలో పోస్టులో తెలుపుతున్న డిఎంకే నాయకుల పేర్లు ఏవి లేవు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.  

పోస్టులో షేర్ చేసిన వీడియోపై ‘Karma News’ అనే లోగో కనిపించడాన్ని మనం చూడవచ్చు. ఈ వివరం ఆధారంగా వీడియో కోసం ఇంటర్నెట్లో వెతికితే, పోస్టులో షేర్ చేసిన వీడియోని ‘Karma News’ వార్తా సంస్థ 10 మే 2021 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. తమిళనాడు రాష్ట్రం పేరంబాలూరు జిల్లాలోని కలత్తూరు గ్రామంలో ముస్లింలు తాము మెజారిటీగా ఉన్నామని తమ ప్రాంతాలలో హిందూ ఊరేగింపులను నిర్వహించకుండా అడ్డుకునే హక్కు లేదని మద్రాసు హైకోర్టు ఒక కేసు తీర్పులో వెల్లడించిందని ఈ వీడియోలో తెలిపారు.

ఈ వార్తా సంస్థ రిపోర్ట్ చేస్తున్న కేసుకి సంబంధించిన వివరాల కోసం వెతికితే, ఈ కేసుకి సంబంధించి ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ వార్తా సంస్థ పబ్లిష్ చేసిన ఆర్టికల్ దొరికింది. తమిళనాడులోని వి.కలత్తూరు గ్రామంలో ముస్లింలు నిర్ధిష్ట ప్రాంతాలలో హిందూ ఊరేగింపులకు అభ్యంతరం వ్యక్తం చేయడంపై ధాఖలైన ఒక పిటిషన్‌కు సంబంధించి మద్రాస్ హైకోర్టు తీర్పు వెల్లడిస్తూ, మత అసహనాన్ని అనుమతిస్తే, అది లౌకిక (సెక్యులర్) దేశానికి మంచిది కాదని, మత సమూహాలలో ఈ మతఅసహనాన్ని తగ్గించాలి మరియు నిషేధించాలని తెలిపింది.

కలత్తూరు గ్రామంలో హిందూ పండగ వేడుకలలో భాగంగా దేవుడి ఊరేగింపులను ముస్లింలు నివసిస్తున్న వీధుల నుండి వెళ్ళకుండా ఆంక్షలు విధిస్తు 2018 డిసెంబర్ నెలలో హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవరిస్తూ మద్రాసు హైకోర్టు 30 ఏప్రిల్ 2021 నాడు తీర్పు ప్రకటించినట్టు తెలిసింది. భారత దేశం ఒక సెక్యులర్ దేశం, ఒక మత సమూహం నిర్ధిష్ట ప్రాంతంలో మెజారిటీగా ఉన్నంత మాత్రాన మిగిలిన మతాల వారు ఆ ప్రాంతంలో పండగ ఊరేగింపు జరపకూడదని ఆదేశించే అధికారం ఉండదని మద్రాసు హైకోర్టు తమ తీర్పులో వెల్లడించింది.

కేసు బ్యాక్ గ్రౌండ్ వివరాలు:

కలత్తూరు గ్రామ ప్రజలు గత 500 సంవత్సరాల నుండి గ్రామంలో మూడు రోజుల పండగ ఉత్సవాలు జరుపుకుంటూ వస్తున్నారని, 2011 వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉత్సవ ఊరేగింపులు జరిగాయని, 2012లో ఇస్లాం మతానికి చెందిన గ్రామస్థులు ఈ ఉత్సవాలు వారికి హరామ్ అని పేర్కొంటూ దేవుడి ఊరేగింపులను అడ్డుకోవడం మొదలు పెట్టారని 2018లో రామస్వామి ఉడయర్ అనే వ్యక్తి తను ధాఖలు చేసిన పిటిషన్లో తెలిపినట్టు తెలిసింది. 2016 వరకు మూడు రోజులు జరిగే ఈ ఉత్సవాలు, ఆ తరువాత  కేవలం ఒక రోజుకి, అది కూడా పోలీస్ బందోబస్తు సహాయంతో జరగడం మొదలయ్యాయని రామస్వామి ఉడయర్ తెలిపారు.

అయితే, కలత్తూరు గ్రామంలో మళ్ళీ మూడు రోజుల పండుగ ఉత్సవ ఊరేగింపులు జరుపడానికి అనుమతి కొరడంతో, రెవెన్యూ అధికారులు మరియు డిప్యూటీ సుపెరిండెంట్ ఆఫ్ పోలీస్ కొన్ని ఆంక్షలు విధిస్తూ ఉత్సవ ఊరేగింపుకు అనుమతి ఇచ్చినట్టు తెలిసింది. అయితే, డిప్యూటీ సుపెరిండెంట్ ఆఫ్ పోలీస్ విధించిన ఆంక్షలను మరింత సులభతరం చేయాలని కోరుతూ రామస్వామి ఉడయర్ మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించారు. రామస్వామి ఉడయర్ ఫైల్ చేసిన పీటీషన్లను కొట్టేస్తూ 21 డిసెంబర్ 2018 నాడు మద్రాస్ హైకోర్టు ఆర్డర్ పాస్ చేసింది.   

మూడు రోజుల ఉత్సవ ఊరేగింపు కార్యక్రమానికి పలు ఆంక్షలు విధిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఈ ఆర్డర్లో, మొదటి మరియు రెండో రోజు జరిగే మొట్టమొదటి దేవుడి ఊరేగింపును ముస్లింలు నివసిస్తున్న ప్రాంతాల గుండా కాకుండా కేవలం మెయిన్ రోడ్లపై మాత్రమే నిర్వహించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. మొదటి రెండు రోజులలో జరిపే రెండో ఊరేగింపును మాత్రం ముస్లింలు నివసిస్తున్న ప్రదేశాలలో కేవలం రాత్రి 10 గంటల నుండి 2 గంటల మధ్య, అది కూడా కఠినమైన ఆంక్షల, మధ్య నిర్వహించుకోవాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది.

21 డిసెంబర్ 2018 నాడు హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాలు చేస్తూ ధాఖలైన పిటిషన్‌కు సంబంధించి మద్రాసు హైకోర్టు 30 ఏప్రిల్ 2021 నాడు తీర్పు వెల్లడించింది. మొదటి రెండు రోజులలో జరిగే మొదటి ఊరేగింపును ముస్లింలు నివసిస్తున్న ప్రాంతాలలో నిర్వహించకూడదని కోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ ఈ పిటిషన్ ధాఖలు చేశారు.

ఎం. కే స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా 07 మే 2021 నాడు పదవి స్వీకారం చేశారు. పోస్టులో తెలిపిన తీర్పుని మద్రాసు హైకోర్టు 30 ఏప్రిల్ 2021 నాడు, అంటే 2021లో తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం రాక ముందే ప్రకటించినట్టు స్పష్టమయ్యింది. అలాగే, పై తెలిపిన కేసుకి పోస్టులో తెలుపుతున్న డిఎంకే నాయకులకు ఎటువంటి సంబంధం లేదు.

చివరగా, తమిళనాడులోని కలత్తూరు గ్రామంలో దేవాలయాలలో పూజలను నిషేధించాలని డిఎంకే నాయకులు పిటిషన్ ధాఖలు చేసినట్టుగా షేర్ చేస్తున్న ఈ పోస్ట్ తప్పు.

Share.

About Author

Comments are closed.

scroll