Fake News, Telugu
 

మార్చి 2023లో భారత్ సరుకుల ఎగుమతి విలువ 38.38 బిలియన్ డాలర్లు, కానీ మార్చి 2022తో పోలిస్తే ఇది 13.89% తక్కువ

0

మోదీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం అత్యంత విజయవంతంగా కొనసాగుతుందని, అందుకు నిదర్శనం మార్చి 2023లో భారత్ విదేశాలకు ఎగుమతి చేసిన మొత్తం సరుకుల(Merchandise) విలువ 40 బిలియన్ డాలర్లుగా (₹3.3 లక్షల కోట్లు) ఉందని చెప్తూ ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: మార్చి 2023లో భారత్ విదేశాలకు ఎగుమతి చేసిన మొత్తం సరుకుల(Merchandise) విలువ 40 బిలియన్ డాలర్లు. ఇది ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని చెప్పడానికి నిదర్శనం.  

ఫాక్ట్: మార్చి 2023లో భారత్ విదేశాలకు ఎగుమతి చేసిన మొత్తం సరుకుల (Merchandise) విలువ 38.381 బిలియన్ డాలర్లు. కానీ మార్చి 2022లో దీని విలువ 44.573 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే గత ఏడాది ఇదే నెలతో పోల్చుకుంటే సరుకుల ఎగుమతి విలువ 13.89% క్షీణించింది. కావున పోస్టులో చెప్పబడిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మార్చి 2023 గణాంకాల ప్రకారం, మార్చి నెలలో భారత్ విదేశాలకు ఎగుమతి చేసిన మొత్తం సరుకుల(Merchandise) విలువ 38.381 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రస్తుత కరెన్సీ మారక విలువ ప్రకారం దీని విలువ సుమారు ₹3.15 లక్షల కోట్లు. అయితే మార్చి 2022లో దీని విలువ 44.573 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే గత ఏడాది ఇదే నెలతో పోల్చుకుంటే సరుకుల ఎగుమతి విలువ 13.89% క్షీణించింది. పైగా మార్చి 2022లో 18.15 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఉండగా, మార్చి 2023లో 6.54% పెరిగి 19.73 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

ఇక సర్వీసుల ఎగుమతి గణాంకాల అంచనాలను పరిశీలిస్తే, మార్చి 2022లో ఎగుమతుల విలువ 26.95 బిలియన్ డాలర్లుగా ఉండగా, మార్చి 2023కు దాదాపు 3% పెరిగి 27.75 కి చేరుకుంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది.

ఇక మార్చి 2023లో సరుకులు మరియు సర్వీసులు కలిపిన మొత్తం ఎగుమతుల విలువ 66.14 బిలియన్ డాలర్లుగా ఉంటుందని, ఇది మార్చి 2022 తో పోలిస్తే 7.52% క్షీణిస్తుందని ఆర్‌బీఐ లెక్కించింది.

చివరిగా, మార్చి 2023లో భారత్ సరుకుల ఎగుమతుల విలువ 38.38 బిలియన్ డాలర్లకు చేరుకున్నప్పటికీ ఇది మార్చి 2022 తో పోలిస్తే 13.89% క్షీణించింది.

Share.

About Author

Comments are closed.

scroll