Fake News, Telugu
 

‘మహాశివరాత్రి రోజున పులులకు మాంసాహారం పెట్టినందుకు ‘జూ’పై ABVP దాడి చేసింది’ అనే శీర్షికతో ఉన్న వ్యంగ్య వార్తను నిజమైన సంఘటనగా షేర్ చేస్తున్నారు

0

మహాశివరాత్రి రోజు పులులకు మాంసాహారం ఇచ్చినందుకు ‘జూ’పై ABVP (Akhil Bharatiya Vidyarthi Parishad) వారు దాడి చేశారంటూ ఒక వార్తా పత్రిక  క్లిప్పింగ్ తో కూడిన ఓ పోస్ట్ (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ న్యూస్ క్లిప్‌కు సంబంధించిన నిజమేంటో చూద్దాం. 

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: మహాశివరాత్రి రోజు పులులకు మాంసాహారం ఇచ్చినందుకు ‘జూ’పై ABVP (Akhil Bharatiya Vidyarthi Parishad) వారు దాడి చేశారు, దానికి సంబందించిన వార్తా పత్రిక క్లిప్పింగ్.

ఫాక్ట్(నిజం): వైరల్ పోస్ట్‌లో షేర్ చేసిన వార్తాపత్రిక క్లిప్పింగ్ నిజమైనది కాదు. ఇది ‘The Savala Vada’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ వ్యంగ్యగా ప్రచురించిన వార్త. ఈ పేజీ తరచూ వ్యంగ్య, ప్యారడీ పోస్టులు చేస్తుంటుంది. మహాశివరాత్రి రోజున పులులకు మాంసాహారం పెట్టారని ‘Zoo’ పై ABVP దాడి చేసినట్లు చెప్పే ఎటువంటి విశ్వసనీయ రిపోర్ట్స్ లేవు. అయితే, మహాశివరాత్రి రోజున ఢిల్లీలోని సౌత్ ఏషియన్ యూనివర్సిటీలో (SAU) మాంసాహారం వడ్డించడంపై ఘర్షణలు జరిగినట్లు కొన్ని వార్తకథనాలు మాకు లభించాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

వైరల్ పోస్ట్‌ను గమనించి పరిశీలించగా, ‘This Might Be Satire’ అని రాసి ఉన్నట్టు గుర్తించాము.

వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా మహాశివరాత్రి రోజు పులులకు మాంసాహారం ఇచ్చినందుకు ‘జూ’పై ABVP దాడి చేసిందా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతికితే, వైరల్ క్లెయింను సమర్థించే ఎటువంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్ మాకు లభించలేదు. అయితే, ఢిల్లీలోని సౌత్ ఏషియన్ యూనివర్సిటీలో (SAU) మహాశివరాత్రి రోజున మాంసాహారం వడ్డించడంపై విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయని పేర్కొన్న పలు వార్తా కథనాలు లభించాయి (ఇక్కడ , ఇక్కడ, ఇక్కడ). SFI (Students Federation of India) సభ్యుల ఆరోపణ ప్రకారం, మహాశివరాత్రి రోజున మాంసాహారం వడ్డించినందుకు ABVP సభ్యులు, విద్యార్థులు మెస్ సిబ్బందిపై దాడి చేశారు. అయితే, ABVP మాత్రం ఉపవాసం చేస్తున్న విద్యార్థులకు కేటాయించిన మెస్‌లో SFI సభ్యులు బలవంతంగా మాంసాహారం వడ్డించేందుకు ప్రయత్నించారని తెలిపింది.

వైరల్ పోస్ట్ యొక్క మూలాన్ని తెలుసుకునేందుకు, ఆ స్క్రీన్‌షాట్‌పై రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వైరల్ వార్తా క్లిప్పింగ్ ను ‘’The Savala Vada’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ (ఆర్కైవ్డ్ లింక్) 28 ఫిబ్రవరి 2025న షేర్ చేసినట్లు గుర్తించాము. ఈ  పోస్ట్‌లోని రెండో స్లైడ్‌లో, సౌత్ ఏషియన్ యూనివర్సిటీ పేరును అఖండ భారత్ యూనివర్సిటీగా మార్చుతున్నట్లు మరొక వ్యంగ్యపు వార్తను షేర్ చేసినట్లు గుర్తించాము.

‘The Savala Vada’ ఇన్‌స్టాగ్రామ్ పేజీని పరిశీలించగా, ఈ పేజీ ప్రస్తుత రాజకీయాలు, వార్తలపై తరచూ వ్యంగ్య, పారడీ కంటెంట్‌ను ప్రచురిస్తుందని మేము గమనించాము.

చివరిగా, మహాశివరాత్రి రోజున పులులకు మాంసాహారం పెట్టినందుకు ‘జూ’పై  ABVP దాడి చేసిందని ‘’The Savala Vada’ ఇన్‌స్టాగ్రామ్ పేజీ వ్యంగ్యపు వార్తను నిజమైన సంఘటనగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll